
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో పూర్తి అయింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గంలో చివరగా 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తెరాస నుంచి తన్నీరు హారిష్ రావు,భాజపా నుంచి నాయిని నరోత్తంరెడ్డి, మహాకూటమికి చెందిన తెలంగాణ జనసమితి పార్టీ నుంచి భవానిరెడ్డిలు పోటీలో ఉన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి గ్యాదరి జగన్, బహుజన సమాజ్ పార్టీ నుంచి పెద్దోళ్ల శ్రీనివాస్, శ్రమ జీవి పార్టీ నుంచి పుష్పలత, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి బుర్ర శ్రీనివాసులు పోటీచేస్తున్నారు. వీరితో పాటు సిద్దిపేట పట్టణానికి చెందిన మరో ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచారు.
నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని సిద్దిపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. 31 మంది 59 సెట్లు నామినేషన్ల దాఖలు చేయగా, అందులో 2 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు తెలిపారు. 29 మంది నామినేషన్లు సవ్యంగా ఉన్నట్టు చెప్పారు. గురువారం రోజు 17 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఓటర్లు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment