గుండారంలో ఓట్లు గల్లంతయ్యాయని ఓటరు కార్డులను చూపుతున్న గ్రామస్తులు
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుండారం, కల్లెపెల్లి గ్రామాల్లో సుమారు 350 మంది ఓట్లు గల్లంతయ్యాయి. శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు తమ ఓటు లేదని తెలియడంతో ఆవేదనకు గురయ్యారు. తాము పలు ఎన్నికల్లో ఓటు వేయగా ఇప్పుడు ఎలా గల్లంతవుతాయని అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. వికలాంగ వృద్ధుద్దురాలు జత్నం రత్తవ్వ గుండారంలో ఓటు వేసేందుకు రాగా అక్కడ అధికారులు ఇచ్చిన ఓటరు స్లిప్‌లో పేరు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రంలో లేకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగింది. గుండారం, దాని శివారులోని కొత్తగా ఏర్పడ్డ పెరుకబండలోనే సుమారు 250 వరకు ఓట్లు గల్లంతు కాగా.. మరణించిన పలువురి ఓట్లు కొత్త జాబితాలో ఉండటంతో ప్రజలు మండిపడుతున్నారు. కల్లెపెల్లిలో సుమారు 70 ఓట్లు గల్లంతయిన ట్లు తెలిపారు.
ఖాజీపూర్‌లో 40 ఓట్లు గల్లంతు
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని ఖాజీపూర్‌లో సుమారు 40 మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఓటర్ల పేర్లు రికార్డుల్లో లేకపోవడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి బంధువులు అంగన్‌వాడీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అంగన్‌వాడీ కార్యకర్తల నిర్లక్ష్యం కారణంగానే పేర్లు గల్లంతైనట్లు ఆరోపించారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇటిక్యాలలో 200 ఓట్లు..జగదేవ్‌పూర్(గజ్వేల్): గ్రామంలో 1709 ఓట్లు ఉండగా.. అందులో సుమారు 200 ఓట్లు గల్లంతయినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది తమ ఆధార్ కార్డులను, ఎన్నికల గుర్తింపు కార్డులను తీసుకెళ్లినా ఓటర్ లిస్టులో పేరు లేదనే కారణంతో ఓటు వేసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు ఎన్నికల కేంద్రం నుంచి ఇంటికి వెనుదిరిగారు. పీర్లపల్లిలో ఎంపీపీ రేణుక ఓటు హక్కును, నర్సన్నపేటలో జెడ్పీటీసీ రాంచం ద్రం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దుబ్బాకలో...దుబ్బాకటౌన్: దుబ్బాక నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా చాలామంది ప్రజల ఓట్లు గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డులున్నా చాలామంది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో పరేషాన్ అయ్యారు. దుబ్బాక పట్టణంలోనే సుమారుగా నాలుగైదు వందల మందికి పైగా ఓట్లు గల్లంతయ్యాయి. దుబ్బాక పట్టణంలోని 38వ పోలింగ్ కేంద్రం వద్ద పట్టణంకు చెందిన అంకం రాజేశ్వర్, అంకం సత్తవ్వ, రేపాక సువర్ణ, రమ్యలకు చెందిన ఓట్లు గల్లంతు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment