కాల్చేసి... కలిసుందామంటారా! | harish rao fire on telangana bill burning | Sakshi
Sakshi News home page

కాల్చేసి... కలిసుందామంటారా!

Published Thu, Jan 16 2014 11:29 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

harish rao fire on telangana bill burning

సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్:  ‘‘వారు భోగి మంటల్లో దహనం చేసింది తెలంగాణ బిల్లు ప్రతులను కాదు...నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల హృదయాలను. ఇది ఆంధ్రానేతల దురహంకారానికి నిదర్శనం..తెలంగాణోడు రోడ్డెక్కితే అరెస్టు చేసే డీజీపీ, సీఎస్‌లు ఇపుడు ఏం చేస్తున్నారు...బిల్లు ప్రతులను దహనం చేసి వారిపై కేసులు పెట్టాల్సిందే..ఇంత జరిగాక కూడా కులిసుందామంటే ఎట్లా కుదురుతుంది’’ అంటూ ఎమ్మెల్యే హరీష్‌రావు నిప్పులు చెరిగారు.

గురువారం రావురూకుల సర్పంచ్ అల్లం శ్యామలకిషన్‌లతో పాటు వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు బాస్‌ల తీరును తప్పుపట్టారు. రాష్ట్రపతి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లులను పిలుపునిచ్చి మరీ భోగి మంటల్లో కాల్చేస్తుంటే వారు ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలన్నారు.

 సకలజనుల సమ్మెలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన తెలంగాణవాదులపై కేసులు పెట్టిన ఈ అధికారులు ఇపుడు ఎందుకని మౌనంగా ఉన్నారో  చెప్పాలన్నారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

 నాడు గాంధీ.. నేడు కేసీఆర్..
 నాడు దేశానికి స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అయితే రేపు తెలంగాణ రాష్ట్రం తెచ్చేది కేసీఆర్ అని ఎమ్మెల్యే హరీష్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ మాటను నిషేధించిన నేపథ్యంలో కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి రాష్ట్రం కావాలని ఎలుగెత్తడం వెనుక కేసీఆర్ చేసిన సంవత్సరాల ఉద్యమముందన్నారు. ఆకలి అయిన వారికే అన్నం విలువ తెలిసినట్లు ఉద్యమకారులకే తెలంగాణ ప్రజల గోస తెలుస్తుందన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆత్మహత్యలులేని ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడాలంటే బిల్లులో తగిన మార్పులు అవసరమన్నారు. పొట్టచేతబట్టుకుని ఇతర దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలంతా ఇక్కడికి రావలంటే తగిన సాగునీరు, ఉద్యోగాలు, ఉపాధి అనివార్యమన్నారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

 సిద్దిపేట నియోజకవర్గంలో 75 మంది సర్పంచ్‌లుంటే వారిలో 70 మంది టీఆర్‌ఎస్ మద్దతుదారులుండడం గర్వంగా ఉందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు శ్రీనివాస్‌రావు, రవీందర్‌రెడ్డి, దువ్వల మల్లయ్య, సారయ్య, బాల్‌రంగం,  జనార్దన్, రామస్వామి,రామకృష్ణరెడ్డి, రాజయ్య, కొళ్ల రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement