తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి ఊపిరి సిద్దిపేట. ఉద్యమాల పురిటి గడ్డగా, విలక్షణమైన తీర్పునకు వేదికగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. నాడు తెలంగాణ ప్రజాసమితితో తొలిదశ ఉద్యమానికి అనంతుల మదన్ మోహన్ నాయకత్వం వహించారు. నేడు మలిదశ ఉద్యమం ద్వారా స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ ఓనమాలు నేర్పిన గడ్డ ఇది. మామ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని హరీశ్‌రావు ప్రస్తుతం అదే పరంపర కొనసాగిస్తున్నారు.
సిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం ఏర్పడి 71 ఏళ్లు అయినప్పటికీ ఐదు దశాబ్దాలుగా ముగ్గురిని మాత్రమే ప్రజలు ఆదరించి విలక్షణమైన తీర్పును ఇచ్చారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్ సాధించగా, సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీశ్‌రావు మాత్రం డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సిద్దిపేటలో బీఆర్‌ఎస్ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, ఒక్కొక్కసారి పీడీఎఫ్, టీపీఎస్, స్వతంత్ర అభ్యర్థులను ఆదరించారు. ప్రస్తుతం ఏడోసారి విజయం కోసం హరీశ్‌రావు బరిలో ఉన్నారు.
ముగ్గురూ ముగ్గురే..
సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇరవై సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఐదుసార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. 1952లో ఎడ్ల గురవారెడ్డి(పీడీఫ్), 1957 లో రాజేశ్వర్‌రావు(కాంగ్రెస్), 1962లో సోమేశ్వర్ రావు(స్వతంత్ర), 1967లో వీబీ రాజు(కాంగ్రెస్)ను నియోజకవర్గ ప్రజలు ఒక్కోసారి ఆదరించి గెలిపించారు. తర్వాత 1970లో పోటీ చేసిన మదన్ మోహన్‌ను నాలుగు సార్లు, తర్వాత పోటీ చేసిన కేసీఆర్, హరీశ్‌రావును ఆరు సార్లు వరుసగా గెలిపించారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్, కేసీఆర్, హరీశ్‌రావు డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు.
ఉద్యమానికి వేదిక..
సిద్దిపేట తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి వేదిక లాంటిది. 1969 తొలి విడత ఉద్యమ నేపథ్యంలో అప్పట్లో వీబీ రాజు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. 1970లో జరిగిన తొలి ఉపఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి(పీడీఎఫ్) నుంచి అనంతుల మదన్ మోహన్ పోటీచేసి విజయం సాధించారు. అక్కడి నుంచి మొదలైన మదన్ మోహన్ రాజకీయ ప్రస్థానం 1985 వరకు కొనసాగింది.
కాంగ్రెస్‌లో టీపీఎస్ విలీనం కావడంతో పీవీ రాజేశ్వర్‌రావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాల్లో మదన్ మోహన్ పలుశాఖల మంత్రిగా పనిచేశారు. 1985లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మదన్ మోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగారు. అదే పంథాలో సీఎం కేసీఆర్ 2001లో మలి విడత తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు కేసీఆర్ ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగారు.
2001 నుంచి గులాబీ గుబాళింపు
ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీలకు కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గం నేడు గులాబీ పార్టీకి కంచుకోట అయ్యింది. తెలంగాణ మలి విడత ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పేరిట గులాబీ జెండా చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు రెండు దశాబ్దాల కాలం పైగా సిద్దిపేట గులాబీ పార్టీకి అడ్డాగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment