ఆదిలాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎవరు రంగంలో ఉంటారనేది తేలాల్సి ఉంది. హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా ఇప్పటికే దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఆదిలాబాద్, బోథ్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్‌లోని వివిధ కమిటీలు ఆ దరఖాస్తులను పరిశీలించిన ఆనంతరం అభ్యర్థులను ఖరారు చేయనుంది.
టికెట్ ఆశిస్తున్న పలువురు..
కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కె.దామోదర్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, అడ్వకేట్ వై.సంజీవ్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు చరణ్‌గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. అలాగే బోథ్ నుంచి డాక్టర్ నరేశ్‌జాదవ్, వన్నెల అశోక్, ఆడె గజేందర్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్, కుమ్ర కోటేశ్, కొడప జలైజాకు, జాదవ్ సుభాశ్, తొడసం దౌలత్‌రావు, జల్కే పాండురంగ్, జాదవ్ వసంత్, శివ రాథోడ్‌లు దరఖాస్తు చేసుకున్నారు.
ఇక పరిశీలన..
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో ఇక వాటి పరిశీలన చేపట్టనున్నారు. పార్టీలో వివిధ కమిటీలు పరిశీలన అనంతరం అందులో ఆమోదయోగ్యమైన వారికి టికెట్ ఖరారు చేస్తారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పరిశీలనపైనే ఉంది. మొదట పొలిటికల్ ఎఫైర్ కమిటీలో పరిశీలన చేస్తారు. ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ, ఆపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో పరిశీలన ఉంటుంది. ఆయా కమిటీల్లో పరిశీలన తర్వాత దాదాపు అభ్యర్థిత్వం ఖరారు చేస్తారు. ఒక వేళ ఈ కమిటీల్లో పరిశీలన తర్వాత కూడా ఇంకా అభ్యర్థిత్వం విషయంలో వివాదం ఉన్న పక్షంలో చివరగా హై పవర్ కమిటీకి ఆ దరఖాస్తు వెళ్తుంది. అక్కడ అన్ని అంశాల పరిశీలన అనంతరం తుది పేరు ప్రకటిస్తారు.
వర్గపోరులో ఎవరికి దక్కేనో..
జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు కారణంగా టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై ఆ పార్టీలో అందరి దృష్టి నెలకొంది. ప్రధానంగా సాజిద్‌ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలు ఒక వైపు ఉండగా.. కంది శ్రీనివాస్‌రెడ్డి మరోవైపు అన్నట్లుగా వీరి మధ్య వైరం ఉంది.
ప్రధానంగా ఇటీవల జిల్లాకేంద్రంలో జరిగిన బీసీగర్జన సదస్సు వివా దంతో ఇది మరింత ముదిరింది. ఒక దశలో ‘కంది’పై సస్పెన్షన్ వేటు వేయగా.. టీపీసీసీ తాజాగా దానిని ఎత్తివేయడం గమనార్హం. అయితే పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. మరో వైపు అధిష్టానం ఆలోచన సర్వత్రా ఆసక్తి కలిగి స్తోంది. మొత్తంగా పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది త్వరలోనే తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment