సతీమణితో కలిసి ఓటేసేందుకు సొంత గ్రామం చింతమడకకు వచ్చిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసేందుకు తరలివచ్చిన గ్రామస్తులు
సాక్షి, సిద్దిపేట: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారంజిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యధర్శి చాడ వెంకట్‌రెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డిలు పోటీ చేసే నియోజకవర్గాలు జిల్లాలోనే ఉండటంతో రాష్ట్రం చూపంతా జిల్లాపైనే పడింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రారంభంలో మొరాయించడంతో పలు ప్రాంతాల్లో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. అదేవిధంగా చీకటి గదుల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో కేసీఆర్, హరీశ్‌రావు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైనవి శాతం
సిద్దిపేట 2,09,345 1,65,075 78.86
హుస్నాబాద్ 2,22,431 1,85,003 83.17
దుబ్బాక 1,90,482 1,63,658 85.92
గజ్వేల్ 2,33,205 2,05,222 88
మొత్తం 8,55,453 7,18,958 83.98
జిల్లా వ్యాప్తంగా 84శాతం పోలింగ్
జిల్లా వ్యాప్తంగా 84 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 8,55,453 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1102 పోలింగ్ కేంద్రాల ద్వారా 7,18,958 మంది ఓటర్లు (83.98 శాతం)తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా గజ్వేల్ నియోకవర్గంలో మొత్తం 2,33,205 మంది ఓటర్లకు గాను 2.05,222 మంది (88 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 2,09,345 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,65,075 మంది (78.86శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో 1,90,482 మంది ఓటర్లకు గాను 1,63,658 మంది(85.92 శాతం) ఓటు వేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,22,431 మంది ఓటర్లకు గాను 1,85,003మంది(83.17శాతం) ఓట్లు వేశారు.
మొరాయించిన ఈవీఎంలు
జిల్లాలో ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్.. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ప్రారంభమైంది. మాక్ పోలింగ్ సమయంలోనే ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడంలో అప్పటికప్పుడు అధికారులు పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మార్పులు చేశారు. కొన్నింటిని సరిచేసి నడిపించారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, బెజ్జంకి మండలం రేగులపల్లె, జగదేవ్‌పూర్, వర్గల్ మండలంలోని మీనాజీపేటలో ఈవీఎంలు మొరాయించాయి. అదేవిధంగా తొగుట మండలం కేంద్రంలోని 134, లింగారెడ్డిపల్లి 115 పోలింగ్ బూత్‌ల్లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. అదేవిధంగా దుబ్బాక మండలం నిజాంపేటలో ఈవీఎం మొరాయించడంతో కొంతసేపు పోలింగ్‌ను నిలిపి వేశారు.
అదేవిధంగా చేర్యాల మండలంలోని చుంచన కోటలో ఈవీఎంలు మొరాయించడం, సక్రమంగా ఓటు పడకపోవడంతో రాత్రి 8గంటల వరకు, తొగుట మండలం లింగారెడ్డి పల్లి, గజ్వేల్ నియోజకవర్గంలోపలు పోలింగ్ స్టేషన్లలో రాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. ఓటర్లు రాత్రి వరకు అక్కడే ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా లైట్లు ఉంటే వీవీ ప్యాట్లు పనిచేయవనే కారణంతో ఈవీఎంలను చీకటిలో ఉంచారు. అయితే ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు చీకటిలో గుర్తులు కనింపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చేసేదిలేక ఏదో ఒక గుర్తుకు ఓటేశామని చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
ములుగు మండలంలో లాఠీచార్జీ
ఎన్నికల్లో భాగంగా జరిగిన పలు సంఘటనలతో జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ములుగు మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ములుగు మండలంలోని బండ్ల మైలారంలో కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు రాగానే అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా మరోవైపు నుంచి కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ములుగు మండలంలోని సింగన్నగూడ, కొక్కండ గ్రామాల్లో కూడా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యంతో సద్దుమణిగింది.
రిమ్మనగూడెం గ్రామంలో కూడా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు గొడవ పడ్డారు. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలోని చెంచాన్‌పల్లిలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వచ్చిన అధికారులు స్థానిక టీఆర్‌ఎస్ నాయకుడి ఇంట్లో బస చేశారని కూటమికి చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారి ఆ ఇద్దరిని ఎన్నికల విధుల నుండి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment