నీటి వనరుల సంరక్షణకు నిధులు మంజూరు
సిద్దిపేట టౌన్: సిద్దిపేట నియోజకవర్గంలో 2014-15 సంవత్సరానికి గాను నీటి వనరుల సంరక్షణ కోసం నిధులు మంజూరైనట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్, అనంతసాగర్, విఠలాపూర్ గ్రామాలకు ఐడబ్ల్యూఎంపీ పథకం కింద 4313 హెక్టార్లలో రూ. 517.56 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
నంగునూరు మండలం కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి, నర్మెట, మగ్ధుంపూర్, అంక్షాపూర్, ఖానాపూర్, నంగునూరు గ్రామాల్లో 4418 హెక్టార్లకు రూ. 530.16 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. మెగా వాటర్ షెడ్ (జీఓ ఎంఎస్ నం. 11) ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో నీటి వనరుల సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. దీంతో భూగర్భ జలవనరులు పెరుగుతాయన్నారు.
2010-11 సంవత్సరంలో చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, ఇబ్రహీంనగర్, మాచాపూర్, పెద్దకోడూరు గ్రామాల్లో 4082 హెక్టార్లలో రూ.489.84 లక్షలతో, నంగునూరు మండలం ఓబులాపూర్, వెల్కటూరు, ముండ్రాయి, పాలమాకుల, రాంపూర్, బద్ధిపడగ, రాజ్‌గోపాల్‌పేట గ్రామాల్లో 4966 హెక్టార్లలో రూ. 595.85 లక్షలతో పనులు జరుగుతున్నాయన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ పథకం అమలు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపామన్నారు.