తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 14 సార్లు శాసనసభకు సాధారణ ఎన్నికలు జరిగాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది పర్యాయాలు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ స్థానాలకు మాత్రం ఇన్నేళ్ల ఎన్నికల చరిత్రలో ఒక్క పర్యాయం కూడా ఉప ఎన్నిక నిర్వహించాల్సిన సందర్భం ఎదురవలేదు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో ఐదు పర్యాయాలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు జరిగడం విశేషం. ఆ స్థానం నుంచి హరీశ్‌రావు మూడు పర్యాయాలు ఉప ఎన్నికల బరిలో నిలిచి ప్రతీ సారి మెజారిటీ పెంచుకుంటూ విజయం సాధించి రికార్డు నెలకొల్పారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన వల్లూరు బసవ రాజు (వీబీ రాజు) 1967లో సిద్దిపేట నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలోనూ పనిచేసిన వీబీ రాజు 1969 నాటి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తన మంత్రి పదవి, శాసనసభ సభ్యత్వానికి వీబీ రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో 1970లో జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపకుల్లో ఒకరైన అనంతుల మదన్‌మోహన్ సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రాజేశ్వర్‌రావుపై గెలుపొందారు.
టీడీపీ అభ్యర్థిగా సిద్దిపేట నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుపొందిన కేసీఆర్‌కు.. చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కలేదు. కొంతకాలం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన కేసీఆర్.. 2001 ఏప్రిల్‌లో తన శాసన సభ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ను స్థాపించిన క్రమంలోనే 2001లో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కేసీఆర్ స్వతంత్య అభ్యర్థిగా బస్సు గుర్తుపై పోటీ చేసి వరుసగా ఐదో పర్యాయం విజయం సాధించారు.
సిద్దిపేట నుంచి వరుసగా ఆరో పర్యాయం పోటీ చేసిన కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే కరీంనగర్ ఎంపీగా కూడా ఎన్నిక కావడంతో తన పదవికి రాజీనామా చేశారు.
2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో అప్పటికే వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న హరీశ్‌రావు టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తిరిగి 2008 మేలో జరిగిన ఉప ఎన్నికలోనూ హరీష్‌రావు మరోమారు పోటీ చేసి గెలుపొందారు. 2010లోనూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మూడు పర్యాయాలు ఒకే పార్టీ నుంచి విజయం సాధించిన నేతగా రికార్డును సొంతం చేసుకున్నారు.
రామాయంపేటలో అంజయ్య ఏకగ్రీవం..
రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిపై అసమ్మతి స్వరం పెరగడంతో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు టంగుటూరి అంజయ్య 11 అక్టోబర్ 1980న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీ కారం చేసే నాటికి అంజయ్య కేంద్ర కార్మిక శాఖ మంత్రి హోదాలో ఉన్నారు. శాసనసభలో ప్రాతినిథ్యం కోసం అంజయ్య ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యా రు. రామాయంపేట ఎమ్మెల్యే రాజన్నగారి ముత్యంరెడ్డిని రాజీనామా చేయించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.రామాయంపేట ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి హోదాలో అంజయ్య 1981 ఏప్రిల్ 8న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజకీయాల్లోకి వచ్చిన రామాయంపేట జడ్పీటీసీ సభ్యురాలు పద్మా దేవేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పక్షాన 2004 పన్నెండో శాసనసభ ఎన్నికల్లో రామాయంపేట నుంచి గెలుపొందారు. అయితే పార్టీ పిలుపు మేరకు 2008లో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తిరిగి అదే 2008లో రామాయంపేట స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు.
మరో నాలుగు సెగ్మెంట్లలో..!
అందోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పదో శాసనసభ (1994–99) టీడీపీ పక్షాన గెలుపొందిన మల్యాల రాజయ్య .. 1998 లోక్‌సభ ఎన్నికల్లో సిద్దిపేట ఎంపీగా విజయం సాధించారు. రాజయ్య రాజీనామాతో 1998లో అందోలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సినీనటుడు బాబూమోహన్ టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
1972లో స్వతంత్ర అభ్యర్థిగా, 1983, 1985, 1994లో టీడీపీ నుంచి గెలుపొందిన కరణం రామచంద్రరావు 1999లో మరోమారు విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నత శాఖ మంత్రిగా పనిచేస్తూ 2002లో మరణించారు. 2002 జూలైలో జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి ఉమాదేవి టీడీపీ తరపు పోటీ చేసి విజయం సాధించారు.
పాత్రికేయుడిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన సోలిపేట రామలింగారెడ్డి 2004లో జరిగిన పన్నెండో శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పక్షాన దొమ్మాట నుంచి గెలుపొందారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2008లో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తిరిగి అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రామలింగారెడ్డి విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు పీ.కిష్టారెడ్డి 2015 ఆగస్టు 25న గుండె పోటుతో మరణించారు. దీంతో 2016 ఫిబ్రవరిలో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కిష్టారెడ్డి తనయుడు డాక్టర్ పి.సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన భూపాల్‌రెడ్డి గెలుపొం ది, అసెంబ్లీలో అడుగు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment