సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి నేడు సిద్దిపేట నియోజకవర్గంలో టీడీపీకి ఎదురవుతోంది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్‌ను కలిగి రాష్ట్ర స్థాయిలో పార్టీ అధిష్టానం దృష్టిలో పడిన సిద్దిపేట టీడీపీ నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెలవెలాపోతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సంగ్రామంలో రాజకీయ పార్టీల నేతలు తమ జెండాలను గ్రామాల్లో రెపరెలాడించేందుకు కార్యన్మోఖులయ్యారు. కాని నియోజక వర్గంలోని మూడు మండలాల్లో టీడీపీ పరిస్థితి నిరాశ జనకంగా ఉంది. నియోజకవర్గంలోని సిద్దిపేట చిన్నకోడూర్, నంగునూర్ మండలాల పరిధిలో ఉన్న 47 ఎంపీటీసీ స్థానాలకు కేవలం 17 స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండడం విశేషం. మరోవైపు మిగతా స్థానాలకు అభ్యర్థులు దొరకకపోవడంతో ఆయా గ్రామాల క్యాడర్ పరిస్థితి ప్రస్తుత ఎన్నికల్లో ప్రశ్నార్ధకంగానే మారింది.
వివరాల్లోకి వెళ్తె..
టీడీపీ అవిర్భావ సమయం నుంచి 2000 సంవత్సరాల వరకు 17 సంవత్సరాలు నియోజకవర్గంలో టీడీపీది ఏకఛత్రాధిపత్యం. ప్రస్తుత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. కాలక్ర మేణా టీఆర్‌ఎస్ అవిర్భావం చెందడం. కేసీఆర్‌తో పాటే ఉన్న పార్టీ శ్రేణుల్లో అత్యధికం ఆయన బాటే పట్టారు. ఉన్న కొద్దిపాటి క్యాడర్‌తో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో పార్టీ అభ్యర్థుల ఎన్నిక కష్టతరంగా మారింది.
కొన్ని గ్రామాల్లో అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టినప్పటికీ నామినేషన్ల నాటికి కూడా అభ్యర్థులు దొరక కపోవడంతో పరిస్థితి అనుకూలంగా ఉన్న గ్రామాల్లోని అభ్యర్థులను బరిలోకి నిలిపింది. అయినప్పటికీ అత్యధిక గ్రామాల్లో టీడీపీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం తొమ్మిది చోట్ల అభ్యర్థులను నిలిపారు. మరోవైపు మొన్నటి వరకు మండలంలో కొద్దిపాటి బలం ఉన్న నంగునూరులో పరిస్థితి దయనీయంగా మారింది. 12 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం 4 చోట్ల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిద్దిపేట మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలకు నాలుగురే పోటీకి దిగడంతో నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల బ్యాలెట్ పేపర్లో 30 స్థానాల్లో టీడీపీ ఊసేలేకపోవడం విశేషం.
‘పసుపు’ పలచనైంది..
Published Tue, Mar 25 2014 11:14 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement