సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కు ఐదు నెలలు నిండనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, ఆ తర్వాత అదే నెల 17న రాష్ట్రపతిపాలన విధించారు. గత ఐదు నెలలుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అధికార యంత్రాంగం సహకారంతో పాలనను కొనసాగిస్తున్నారు. విద్యుత్, నీటి సమస్యల పరిష్కారంతోపాటు ధరల పెరుగుదలను నియంత్రించడం కోసం అక్రమ నిల్వలకు పాల్పడేవారిపై తనిఖీలు జరిపి కఠిన చర్యలు తీసుకోవడంలో నజీబ్ జంగ్ నేత త్వంలోని సర్కారు చురుగ్గా వ్యవహరించింది. అయిన్పటికీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల పేరుతో అయితేనేమీ, రాష్ట్రపతిపాలన వల్లనైతేనేమీ ఏడాది కాలంగా అభివృద్ధి కార్యకలాపాలు మూలనపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు లేనట్లయితే ఎన్నికలు తప్పవని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అంటున్నారు. అన్ని పార్టీలు ఎన్నికలను కోరుకుంటునప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం అందుకు సుముఖంగా లేరు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించాయి. తగినంత సంఖ్యాబలం లేనందువల్ల ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం లేదని ఇంతకాలంగా అంటూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం పునరాలోచనలో పడిపోయింది. విద్యుత్ సంక్షోభం, ఉల్లి, ఆలుగడ్డల ధరల పెరుగదల నేపథ్యంలో ప్రజల ముందుకు ఓట్ల కోసం వెళ్లడం సముచితం కాదనే అభిప్రాయాన్ని కొందరు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సతీష్ ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టాక పార్టీ వైఖరి స్పష్టమయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. ఎన్నికలకు వెళ్లాలని పార్టీ గట్టిగా భావిస్తున్నప్పటికీ అందుకు ఎమ్మెల్యేలు మాత్రం సిద్ధంగా లేరు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యేలు ఆయనకు ఈ విషయాన్నే చెప్పారని అంటున్నారు. ఎమ్మెల్యేలు బుధవారం సమావేశం అవుతారని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? ఎన్నికలకు వెళ్లాలా ? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్‌దీశ్ ముఖి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ శాసనసభలో బీజేపీకి మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డా. హర్షవర్ధన్, రమేష్ బిధూరీ, ప్రవేశ్ వర్మ ఎంపీలుగా ఎన్నికై, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో మొత్తం 70 మంది సభ్యులుండే ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 67కి తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు చేయడానికి 34 మంది ఎమ్మెల్యేలు అవసరం. స్వతంత్ర ఎమ్మెల్యే రామ్‌బీర్ షౌకీన్, జెడియు ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ బీజేపీకి మద్దతు ఇచ్చినట్లయితే మరో ముగ్గురు ఎమ్మెల్యేల సహాయం అవసరం. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గానీ ఆప్ ఎమ్మెల్యేలు గానీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలుగానీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. దిగ్గజాలు సైతం ఓటమి చవిచూసిన ప్రతికూల పరిస్థితుల్లోఎన్నికలలో గెలిచినప్పటికీ పార్టీ తమకు ఉఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారుకు బయటినుంచి మద్దతు ఇవ్వవచ్చని అంటున్నారు.
ఎన్నాళ్లీ నిరీక్షణ?
Published Tue, Jul 15 2014 10:24 PM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement