జనాగ్రహాగ్ని దహిస్తుందేమో..
Published Sun, Mar 2 2014 2:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, రాజమండ్రి :ఓ పక్క రాష్ట్ర విభజన.. మరోపక్క రాష్ట్రపతి పాలన.. ఇంకోవైపు మున్సిపల్ ఎన్నికలకు చురుకుగా జరుగుతున్న సన్నాహాలు.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను అయోమయంలోకి నెడుతున్నాయి. ఎంతగా ఎలుగెత్తినా, సుదీర్ఘ సమరం సాగించినా.. విభజన ఆగలేదన్న ఆగ్రహంతో ఉన్న సీమాంధ్రుల చేతిలో తమకు శృంగభంగం తప్పదని ఆ పార్టీల నేతలు బెంబేలెత్తిపోతున్నారు. అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం నాయకులు, ఆరునూరైనా ఆంధ్రులను రెండు ముక్కలు చేయాలన్న పంతాన్ని నెగ్గించుకున్న కాంగ్రెస్ అధిష్టానం,
ఆ అధిష్టానం నిర్దేశకత్వంతో ఎవరు ఏ కపట నాటకంలో పాత్రధారులవుతున్నారో తెలియని గజిబిజిని సృష్టించిన ఆ పార్టీ నాయకులు.. ఈ తరుణంలో పురపోరు జరిగితే తమకు చెంపపెట్టు తప్పదని జంకుతున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన గడువు ఈనెల మూడుతో ముగుస్తుండడంతో పురపాలక శాఖ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుపోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు కాలూచెయ్యీ కూడదీసుకోవడమే కష్టమనుకుంటుంటే.. ఈలోగానే మున్సిపల్ కదనానికి కత్తులు దూయడం దుస్సాధ్యమని వాపోతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న విస్పష్టమైన వైఖరిని కనబరచకుండా..‘కర్ర విరగరాదు.. పాము చచ్చి తీరాలి’ అన్న రీతిలో చిత్రవిచిత్రమైన ధోరణులను అవలంబించిన ఆ పార్టీల నాయకులు ఇప్పుడు పురపోరుకు అభ్యర్థులను అన్వేషించడమే ‘తల ప్రాణం తోకకు వచ్చినంత’ పని అవుతుందని వాపోతున్నారు.
నిరాయుధుల్లా.. నిస్సహాయంగా..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సాగిన ఉద్యమం లక్ష్యసాధనలో విఫలమైనా.. కాంగ్రెస్, టీడీపీలపై జనంలో విముఖత పెంచింది. సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తానంటే, చంద్రబాబు లేఖలు ఇచ్చి మరీ వత్తాసునిచ్చారని జనం రగిలిపోతున్నారు. విభజన పరిణామాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని కకావికలం చేశాయి. రాజమండ్రి, కాకినాడ కార్పొరేషన్‌లలో వివిధ విభాగాలకు చెందిన నేతలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే నాథులు లేకుండా పోయారు. డివిజన్లలో, వార్డుల్లో పోటీకి నిలిపేందుకు అభ్యర్థులే కరువయ్యే పరిస్థితి రెండు పార్టీలనూ వెన్నాడుతోంది. విభజన పాపాన్ని మూటకట్టుకున్న తమ పార్టీలపై జనం కన్నెర్రజేస్తున్న సమయంలో వచ్చిపడుతున్న పురపోరులో నిరాయుధులైనంతగా నిస్సహాయత టీడీపీ, కాంగ్రెస్ నేతలను ఆవహించింది.
కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ..
కాకినాడ నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రత్యేకాధికారులతో నెట్టుకు వచ్చింది. గత ఏడాది పంచాయతీ ఎన్నికలప్పుడే మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగిపోతాయనుకున్న రాజకీయ పక్షాలకు నిరాశ మిగిలింది. ఎన్నికలపై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అన్నింటికీ తెర దించుతూ హైకోర్టు నాలుగు వారాల్లో ఎన్నికలు జరిపి తీరాలని ఫిబ్రవరి మూడున ఆదేశించింది.
ఆ గడువు ఈ నెల మూడుతో ముగియనుంది. రాష్ట్రంలో రాజకీయంగా అనిశ్చిత వాతావరణం నెలకొన్నా కోర్టు ఆదేశానుసారం పురపాలక శాఖ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుపోతోంది. గత నెల రెండో వారం నుంచి జిల్లాలో భారీగా కమిషనర్ల బదిలీలు జరిగాయి. ఖాళీగా ఉన్న ఎన్నికల అధికారుల పోస్టులను భర్తీ చేశారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు తుది ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని శుక్రవారం పురపాలక శాఖ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం తుది ఓటర్ల జాబితా ప్రకటించాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను బయటికి తీసి తొలి దశ పరిశీలన పూర్తిచేసి, లోపాలు సవరించాలని శనివారం కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
ఎన్నికలు జరిగే పట్టణాలివే..
ఇంకా డివిజన్ల పునర్వ్యస్థీకరణ జరగాల్సి ఉన్నందున ప్రస్తుతానికి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం లేదు. రాజమండ్రి కార్పొరేషన్, అమలాపురం, రామచంద్రపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని, మండపేట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
Advertisement
Advertisement