సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉత్కంఠభరితంగా సాగిన పురపోరులో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ రెండు, టీడీపీ రెండు గెలుచుకోగా.. ఒక దాంట్లో మిశ్రమ ఫలితం వచ్చింది. జిల్లాలోని వికారాబాద్, బడంగ్‌పేట పురపాలక సంఘాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీలను తెలుగుదేశం చేజిక్కించుకుంది. మరోవైపు తాండూరులో వెలువడిన అనూహ్య ఫలితాలు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచాయి. ఊహించనిరీతిలో మజ్లిస్ పుంజు కోవడమే కాకుండా అతిపెద్ద పార్టీగా అవతరించింది.
టీఆర్‌ఎస్‌తో సమానంగా పది వార్డులను గెలుచుకుని చైర్మన్ రేసులో నిలిచింది. మైనార్టీ ఓటర్ల అండతో మరోసారి మున్సిపాలిటీని దక్కించుకుంటామని భావించిన కాంగ్రెస్.. గెలుపువాకిట బోల్తా పడింది. కేవలం 8 వార్డులకే పరిమితమైంది. టీఆర్‌ఎస్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, ఓటర్ల మద్దతును కూడగట్టలేకపోయింది. గంపెడాశలు పెట్టుకున్న ఉద్యోగసంఘాలు, బలమైన సామాజికవర్గాలు ఆ పార్టీకి అండగా నిలబడలేదు. అయితే, మాజీ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి తనదైన శైలిలో కాంగ్రెస్, టీడీపీలను వెనకకు నెట్టడంలో సఫలమయ్యారు.
పైచేయి..!
వికారాబాద్ పురపాలక సంఘాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ఓటర్ల ఏకపక్ష తీర్పుతో చైర్మన్ పదవిని సునాయసంగా
నిలబెట్టుకుంది. మొత్తం 28 డివిజన్లలో ఆ పార్టీ 14 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. పురపాలక ఎన్నికల సమయంలో పలువురి వలసలతో టీడీపీ బలపడిందని ప్రచారం జరిగినా, ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అది అంతగా ఫలితం చూపలేదని అర్థమవుతోంది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది.
ఇక నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత బడంగ్‌పేటకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 20 వార్డుల్లో పదిహేను స్థానాలను గెలుచుకొని తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. ఇక్కడ టీడీపీ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. కేవలం ఒక వార్డుతో మాత్రమే సరిపెట్టుకుంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన రాజకీయ చతురతతో తిరుగులేని విజయాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యారు.
సైకిల్ జోరు!
కొత్తగా ఏర్పడిన పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ రెండింటిలోనూ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించింది. కాంగ్రెస్ నైతల అనైక్యత, లుకలుకలను అనూకులంగా మలుచుకుని విజయం సాధించింది. టికెట్ల వేటలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అభ్యర్థుల ఎంపికలో చేసిన పొరపాట్లు, ప్రచారపర్వంలో అనుసరించిన విధానం విజయావకాశాలను దెబ్బతీసింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థుల ఖరారులో జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయడం కలిసొచ్చింది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రెండు పురపాలికలు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి.
తాండూరులో ‘గాలి’పటం!
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మజ్లిస్ ఊహకందని విజయాలను నమోదు చేసింది. చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడంలో మజ్లిస్ నిర్ణయాత్మకశక్తిగా మారుతుందని ప్రధాన పార్టీలు భావించాయి. ఈ క్రమంలోనే మజ్లిస్ మద్దతు కోసం వెంపర్లాడాయి. అయితే ఊహించనిరీతిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అంచనాలను దెబ్బతీయడమేకాకుండా ఆ పార్టీలకు సమఉజ్జిగా నిలిచింది. టీఆర్‌ఎస్‌తో సమానంగా పది వార్డులను గెలుచుకున్న మజ్లిస్.. చైర్మన్ పీఠంపై కన్నేసింది. హంగ్ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ (8)తో జతకట్టడం ద్వారా మున్సిపాలిటీపై జెండాను ఎగురవేయాలని ఎంఐఎం భావిస్తోంది.
టీఆర్‌ఎస్ మద్దతు కూడా దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్న ఆ పార్టీ.. ఈనెల 16వ తర్వాత శాసనసభ ఫలితాలను పరిశీలించి తదనుగుణంగా అడుగులు వేయాలని యోచిస్తోంది. కాగా, అతివిశ్వాసంతో దెబ్బతిన్న కాంగ్రెస్.. ఇప్పు డు నష్టనివారణ చర్యలకు దిగుతోంది. ఎంఐఎంకు అండగా నిలవ డం, లేదా మద్దతు తీసుకోవడం ద్వారా మున్సిపాలిటీని తిరిగి నిలబెట్టుకునేందుకు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా పుర ఫలితాలు వెలువడిన అనంతరం మజ్లిస్ పెద్దలతో ఆ యన మంతనాలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
భంగపాటు!
పురపాలక ఎన్నికల్లో పలువురు చైర్మన్ అభ్యర్థులకు భంగపాటు ఎదురైంది. వికారాబాద్‌లో నాలుగు పర్యాయాలు వరుస విజయాలతో ఓటమెరుగని చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్(టీడీపీ) ఈసారి పరాజయం పాలయ్యారు. టీడీపీ తరుఫున చై ర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో ము న్సిపాలిటీలో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ వార్డులు లభించినప్పటికీ, ఆయన మాత్రం విజయం సాధించలేకపోయారు. అలాగే టీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థి శుభప్రదపటేల్ కూ డా గెలుపు ముంగిట బోల్తా పడ్డా రు. తాండూరులో కూడా ఆపార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి విజయాదేవి సమీప టీడీపీ ప్రత్యర్థి చేతిలో ఓడిపోగా, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి యాలాల యాదయ్య కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు.