జూన్ 2 వరకు రాష్ట్రపతి పాలన
గవర్నర్ నరసింహన్ వెల్లడి ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు
తిరుమల: ‘‘రాష్ట్ర విభజనలో భాగంగా అపాయింటెడ్ డే నోటిఫికేషన్ ప్రకారం జూన్ 2న రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావాల్సి ఉంది. అంతవరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది’’ అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ర్టంలో ఎన్నికల కోడ్ వల్ల సీఈవోగా పూర్తి బాధ్యతలు నిర్వర్తించలేకపోయినా రాజ్యాంగపరమైన గవర్నర్ హోదాలో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు. వేసవిలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా నిత్యం సమీక్షిస్తూ రైతుల అవసరానికి అనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి 270 మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. అలాగే ఈ వేసవిలో తాగునీటి సరఫరా, వైద్య సేవలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లాగే సార్వత్రిక ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇస్తికఫాల్ మర్యాదతో గవర్నర్‌కు శ్రీవారి దర్శనం...
రా్రష్టపతి పాలన విధించిన తర్వాత తొలిసారిగా తిరుమలకు వచ్చిన గవర్నర్‌కు టీటీడీ ఆలయ మర్యాదలతో శ్రీవారి దర్శనం చేయించింది. సతీమణి విమలా నరసింహన్‌తో కలసి వచ్చిన ఆయనకు ఆలయ మహద్వారం వద్ద వేద పండితులు, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఆలయ మర్యాదలైన ఇస్తికఫాల్‌తో స్వాగతం పలికారు. స్వామివారి పాదాల వద్ద ఉంచిన శేషవస్త్రాన్ని గవర్నర్‌కు బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో ఈవో, జేఈవో గవర్నర్ దంపతులకు శ్రీవారి లడ్డూ, స్వామివారి చిత్రపటం అందజేశారు. అంతకుముందు గవర్నర్ దంపతులు తిరుచానూరులో పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనానికి 24గంటలు
సాక్షి, తిరుమల: తిరుమలకు శనివారం కూడా భక్తులు పోటెత్తారు. కాలిబాట భక్తులతో కిక్కిరిసిపోయింది. సర్వదర్శనం కోసం మొత్తం 31కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల ఆళ్వారు చెరువు చుట్టూ క్యూలో బారులు తీరారు. వీరికి 24 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. కాలిబాటల్లో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనం వెలుపల రెండు కిలోమీటర్లు క్యూ కట్టారు. వీరికి 12 గంటలు, రూ.300 టికెట్ల భక్తులకు 6గంటల తర్వాత స్వామి దర్శనానికి అనుమతించనున్నారు. గదుల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్రీయ విచారణ కార్యాలయం, ఎంబీసీ-34, పద్మావతి అతిథిగృహాల వద్ద గదుల కోసం భక్తులు క్యూ కట్టారు. తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణ కట్టల్లో నాలుగు గంటల పాటు భక్తులు పడిగాపులు కాచారు.