
రాష్ట్రపతి పాలన విధించాలంటూ హైకోర్టులో పిల్
రాష్ట్రంలో పాలన స్తంభించిందని, అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు.. విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు, సీమాంధ్ర ప్రాంతంలోని 23 జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సజావుగా సాగట్లేదంటూ మరో ప్రజాహిత వ్యాజ్యం కూడా హైకోర్టులో దాఖలైంది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై వివరంగా ఆయా ప్రాంతాల అధికారుల నుంచి నివేదికలు తెప్పించి సమర్పించాలని డీజీపీతో పాటు ఆయా ప్రాంతాల ఐజీపీలను కోర్టు ఆదేశించింది.
ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్ధమంటూ దాఖలైన మరో పిటిషన్ను కోర్టు వాయిదా వేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరానికి చెందిన అధికారులకు దీనిపై నోటీసులు పంపిన కోర్టు.. ఈ పిటిషన్ విచారణను కూడా ఆగస్టు 26వ తేదీకి వాయిదా వేసింది. సమ్మెను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వ న్యాయవాదులను కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. సమ్మెను వెంటనే విరమించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాదులు కోరగా, అసలు ఇప్పటికీ సమ్మె జరుగుతోందన్న నమ్మకం ఏంటని కోర్టు వారిని ప్రశ్నించింది.