న్యూఢిల్లీ: సుదీర్ఘ రాష్ట్రపతి పాలనతో విసిగిపోయిన జాతీయ రాజధానివాసులు వచ్చే నెల ఏడోతేదీన జరగనున్న ఎన్నికల్లో సుస్థిర పాలనకే మొగ్గుచూపే అవకాశముంది. అవినీతి నిర్మూలనకంటే సుస్థిర ప్రభుత్వం అధికకారంలో ఉండాలని వారంతా కోరుకుంటున్నారు. 2013 విధానసభ ఎన్నికల తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కే జ్రీవాల్ 49 రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీంతో అభివృద్ధి పను లు ఆగిపోయాయి. ప్రజల ఈతిబాధలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ కారణంగా వర్తకులు, మధ్యతరగతి వారు. ఆటోరిక్షా డ్రైవర్లు, ఈ-రిక్షా డ్రైవర్లు, చిన్నచిన్న వ్యాపారుల ధోరణిలో మార్పు వచ్చింది. దీంతో వారంతా ఇప్పుడు సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిని నిర్మూలిస్తామని కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం కలగానే మిగిలిపోయింది. ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత జరిపిన అధ్యయనంలో అనేకమంది ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వారంతా సుస్థిర ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు.
రాష్ట్రపతి పాలన ఇన్నాళ్లా: మహ్మద్ కజీమ్
ఇదే విషయమై దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ కజీమ్ మాట్లాడుతూ ‘ఢిల్లీలో సొంత ప్రభుత్వం అధికారంలో ఉండాలి. సుదీర్ఘ రాష్ట్రపతి పాలన ఎంతమాత్రం బాగాలేదు. అసలు మంచిది కూడా కాదు’అని అన్నాడు.
లంచం ఇస్తేనే ఏ పనైనా: ముఖేష్ గుప్తా
ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ముఖేష్ గుప్తా మాట్లాడుతూ ‘పరిస్థితి కొంతమేర మెరుగుపడింది. అయినప్పటికీ లంచం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనీ జరిగే పరిస్థితి ప్రస్తుతం లేదు. సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నాడు. ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందిన నగరమని, ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నాడు. ఇంతకాలం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ చేతిలో అధికారం పగ్గాలు ఉండడంతో విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేకపోయిందన్నాడు. ఈసారి నగరవాసులు నిర ్ణయాత్మకమైన తీర్పు ఇస్తారని ఆశిస్తున్నానన్నాడు, ఆరు నెలలకోసారి ఎన్నికలు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
‘అత్యాచారాల సంఖ్య పెరిగింది’
నగరంలో అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరిగిం దంటూ యువత ఆవేదన వ్యక్తం చేసింది. దీంతోపాటు యాసిడ్ దాడి కేసుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయిం దని అంటున్నారు. ఈ విషయమై నగరంలోని కిద్వాయ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని ఇషా కపూర్ మాట్లాడుతూ ‘మహిళలకు భద్రత, వారి హక్కులకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వానికే ఓటు వేస్తా. 2012లో నిర్భయ ఘటన తర్వాత నిరసనలు వెల్లువెత్తడంతో రాజకీయ నాయకులు అనేక హామీలు ఇచ్చారు. అయినప్పటికీ మహిళలపై నేరాల సంఖ్య ఎంతమాత్రం తగ్గలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఓటు వేయాలని అనిపించడం లేదు’
ఇదే విషయమై నగరంలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి చెందిన రమాశర్మ మాట్లాడుతూ ‘ఓటుహక్కు వినియోగంపై ఆసక్తి తగ్గిపోయింది. సామాన్యుడికి సంబంధించిన సమస్యలను ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడానికే పరిమితమవుతున్నారు. నగరంలో మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మరిన్ని ఆస్పత్రులు, పాఠశాలల నిర్మాణం కూడా జరగాలి. ఎన్నికల బరిలోకి అనేకమంది దిగుతుండడంతో ఎవరిని ఎన్నుకోవాలో కూడా తెలియడం లేదు. నగరం వదిలిపెట్టి పారిపోవాలనిపిస్తోంది’ అని అన్నారు. అవినీతి అనేది తీవ్రంగా పట్టించుకోవాల్సిన విషయమే అయినప్పటికీ దానిని ఏ పార్టీ కూడా నిర్మూలించలేదని అన్నారు.
సుస్థిర పాలనకే అత్యధికుల మొగ్గు
Published Sun, Jan 18 2015 11:19 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement