'మోదీ.. నీ నియంతృత్వం చెల్లదు'
'మోదీ.. తెరి తానాషాహి, నహి చెలెగి' (మోదీ నీ నియంతృత్వం చెల్లబోదు) అంటూ రాజ్యసభ ప్రతిపక్షాల నిరసనలతో దద్దరిల్లింది. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు పెద్దలసభలో ఆందోళనకు దిగారు. అయితే, ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో సభలో దీని గురించి చర్చించలేమంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు అందుకున్నారు. 'మోదీ నీ నియంతృత్వం చెల్లబోదు' అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం తన అధికారాలను దుర్వినియోగపరిచిందని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్ రెండో దఫా సమావేశాలు సోమవారం ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ ఉత్తరాఖండ్ అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించిన ఆర్టికల్ 356ను మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరిచిందని మండిపడ్డారు. దీనిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కౌంటర్ ఇస్తూ రాజ్యసభలో ఈ అంశంపై చర్చకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశామని, ముందు చర్చకు పట్టుబట్టడం సరికాదని సూచించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు వెనుకకు తగ్గకపోవడం.. ఉత్తరాఖండ్ అంశంపై చర్చ జరుపాల్సిందేనని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడం రాజ్యసభ మంగళవారానికి వాయిదాపడింది.