Uttarakhand crisis
-
'సలహా ఇచ్చిన మంత్రిని సాగనంపండి'
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించమని సలహా ఇచ్చిన మంత్రిని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ లో భంగపాటు గురైన మోదీ.. పార్లమెంట్ లో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ బేరాలు ఫలించలేదని అన్నారు. 'కాంగ్రెస్ రాజకీయ బేరసారాలు సాగించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అలా అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చెంతకు ఎందుకు చేరార'ని సిబల్ ప్రశ్నించారు. అధికార దాహంతోనే ఆర్టికల్ 356ను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. 33 శాతం మంది ప్రజలు కరువుతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మోదీ అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో పార్టీ ఫిరాయించిన 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. వారిపై అనర్హత వేటు వేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో రేపు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షలో వీరు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. హరీశ్ రావత్ పై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో హరీశ్ రావత్ విశ్వాస పరీక్ష ఎదుర్కొబోతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరాఖండ్ శాసనసభలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 27 మంది, బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో 61 మంది బలపరీక్షలో ఓటు వేయనున్నారు. తనకు 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రావత్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న బలపరీక్షలో రావత్ గట్టెక్కడం ఖాయంగా కనబడుతోంది. -
రెండో విడత రభసతో మొదలు!
‘రాష్ట్రపతి పాలన’పై పార్లమెంటులో కాంగ్రెస్ ఆందోళన లోక్‌సభ వెల్‌లో ధర్నా.. రాజ్యసభలో నినాదాల హోరు ♦ రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను కేంద్రం కూలదోస్తోందని ధ్వజం ♦ ఉభయసభల్లో ఈ అంశంపై చర్చకు పట్టుపట్టిన వైనం ♦ లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా నోటీసును తిరస్కరించిన స్పీకర్ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో విడత భేటీ అధికార, ప్రతిపక్షాల ఘర్షణతో మొదలయింది. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రాష్ట్రపతి పాలన విధించటంపై ఆగ్రహంతో ఉన్న విపక్ష కాంగ్రెస్.. కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తోందని ఆరోపిస్తూ సోమవారం పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర ఆందోళనకు దిగింది. ఉభయసభల్లోనూ కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లలోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో రాష్ట్రపతి పాలన అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించటంతో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జునఖర్గే, పార్టీ సభ్యులు వెల్‌లో ధర్నాకు దిగారు. జేడీయూ, ఆప్ సభ్యులు కూడా వెల్‌లోకి వచ్చారు. పార్టీ ఎంపీల నిరసనతో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కూడా జతకలిశారు. కాంగ్రెస్ ఆరోపణలను హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తోసిపుచ్చారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్ చర్చకు పట్టుపట్టారు. ‘మోదీ హిట్లర్ పాలన’ అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రపతి పాలన ప్రకటన సభ ముందుకు వచ్చినపుడు చర్చించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. రాజ్యసభ రోజంతా వాయిదాలతో ముగిసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే: ఖర్గే లోక్‌సభలో ఖర్గే మాట్లాడుతూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోయటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని స్పీకర్ సుమిత్రామహాజన్‌తో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని హత్య చేస్తూ బీజేపీ ప్రభుత్వాలను స్థాపించటానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం, వారిపై ఒత్తిళ్లకు పాల్పడటం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై తాను వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చానన్నారు. దీనికి అధికారపక్షం నుంచి నిరసన వ్యక్తమైంది. స్పీకర్ స్పందిస్తూ.. ఈ అంశం సుప్రీంకోర్టు ఎదుట ఉందని గుర్తుచేస్తూ.. దీనిపై ఇంకా మాట్లాడరాదని ఖర్గేకు సూచించారు. తాను కేంద్ర ప్రభుత్వ చర్యల గురించి మాట్లాడుతున్నానని, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు గురించి మాట్లాడటం లేదని ఖర్గే బదులిచ్చారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న ఇష్రాత్జహాన్ కేసు గురించి ఇటీవల సభలో చర్చించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘ఎన్డీఏ ప్రతి రాష్ట్రంలోనూ అధికారాన్ని లాక్కోవటానికి చాలా తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యాంగం ఉందని మరచిపోవద్దు.. మార్చి 28న విశ్వాస పరీక్ష వరకూ మీరు వేచి ఉండాల్సింది.. కానీ మార్చి 27నే మీరు రాష్ట్రపతి పాలనను విధించారు’’ అని ధ్వజమెత్తారు. బీజేడీ నేత బి.మహతాబ్ మాట్లాడుతూ దీనిపై తాము కూడా నోటీసు ఇచ్చామని చెప్పారు. 356వ అధికరణను ఏకపక్షంగా వినియోగించటానికి తాము వ్యతిరేకమని, కోర్టు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో సంక్షోభాలను ఎన్డీఏ కానీ బీజేపీ కానీ సృష్టించలేదని, అది వారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభమని పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన అంశం కోర్టు పరిశీలనలో ఉన్నందున దీనిని ప్రస్తుత రూపంలో లేవనెత్తరాదన్న స్పీకర్ నిర్ణయాన్ని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రపతి పాలన ప్రకటన ఉభయసభలకు సమర్పణ ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన ప్రకటన పత్రాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరాల మధ్య పార్లమెంటు ఉభయసభలకు సమర్పించింది. మార్చి 27వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జారీ చేసిన ప్రకటనతో పాటు.. ఉత్తరాఖండ్ గవర్నర్ మార్చి 26వ తేదీన ఇచ్చిన నివేదికను, ఈ అంశంపై ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టులో విచారణ పత్రాలను కూడా సభకు నివేదించింది. రెచ్చగొడుతున్నారు రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ రాష్ట్రపతి పాలన అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా ఉద్దేశపూర్వకంగా విపక్షాన్ని రెచ్చగొడుతూ పార్లమెంటు సమావేశాల్లో అంతరాయాలు రేకెత్తించి సభ పనిచేయకుండా చేస్తోందని ఆరోపించారు. ‘శీతాకాల సమావేశాలు జరిగేటపుడు.. అరుణాచల్‌లో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోశారు. కేంద్రం అక్కడ తన సొంత సర్కారును ప్రతిష్టించే వరకూ ఆగలేదు’ అని ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్ విషయంలో ఆ రాష్ట్ర హైకోర్టు జడ్జీలకు అభినందనలు తెలపాలని కోరుకుంటున్నానని ఆజాద్ పేర్కొనగా.. న్యాయపరమైన అంశాలపై ఎటువంటి వ్యాఖ్యలూ ఉండరాదని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ చెప్పారు. అయితే ఉత్తరాఖండ్ అంశం న్యాయస్థానం పరిశీలనలో ఉన్నందున దీనిని లేవనెత్తరాదంటూ పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి నక్వీ అభ్యంతరం వ్యక్తంచేశారు. మీరన్నదే పాటించండి సీపీఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. న్యాయపరిశీలనలో ఉన్న అంశాలపైనైనా సరే సభలో చర్చను నిరోధించజాలదని సభా నాయకుడు అయిన అరుణ్‌జైట్లీ గత సమావేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘మీరు చెప్పి ఆచరించిన దానిని మీరు పాటించండి’ అని తిప్పికొట్టారు. జైట్లీ స్పందిస్తూ.. రాష్ట్రపతి పాలన ప్రకటన అంశం సభ ముందుకు వస్తుందని, అప్పుడు దానిపై మాట్లాడొచ్చని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళంలో కురియన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తర్వాత ఇదే పరిస్థితుల్లో మళ్లీ 2 గంటల వరకూ వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాకా కాంగ్రెస్ నిరసన మధ్యే రాజ్యాంగ(ఎస్సీ) ఉత్తర్వు (సవరణ) బిల్లునుప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదానికి సహకరించాలని నక్వీ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవటంతో సభ మళ్లీ వాయిదా పడింది. ‘కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి’ దేశంలో నెలకొన్న కరువు, నీటి కొరత, వడగాడ్పులపై లోక్‌సభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు ముళ్లప్పళ్లి రామచంద్రన్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ దేశంలో 4వ వంతు జనాభా కన్నా ఎక్కువ మందిపై దారుణ కరువు పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయన్నారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రజలకు తక్షణ సాయం అందించాలని కోరారు. ఆయనకు మద్దతుగా పలువురు సభ్యులు మాట్లాడారు. దీనిపై సభ సవివరమైన చర్చ జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. -
'మోదీ.. నీ నియంతృత్వం చెల్లదు'
'మోదీ.. తెరి తానాషాహి, నహి చెలెగి' (మోదీ నీ నియంతృత్వం చెల్లబోదు) అంటూ రాజ్యసభ ప్రతిపక్షాల నిరసనలతో దద్దరిల్లింది. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు పెద్దలసభలో ఆందోళనకు దిగారు. అయితే, ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో సభలో దీని గురించి చర్చించలేమంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు అందుకున్నారు. 'మోదీ నీ నియంతృత్వం చెల్లబోదు' అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం తన అధికారాలను దుర్వినియోగపరిచిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ రెండో దఫా సమావేశాలు సోమవారం ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ ఉత్తరాఖండ్ అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించిన ఆర్టికల్ 356ను మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరిచిందని మండిపడ్డారు. దీనిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కౌంటర్ ఇస్తూ రాజ్యసభలో ఈ అంశంపై చర్చకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశామని, ముందు చర్చకు పట్టుబట్టడం సరికాదని సూచించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు వెనుకకు తగ్గకపోవడం.. ఉత్తరాఖండ్ అంశంపై చర్చ జరుపాల్సిందేనని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడం రాజ్యసభ మంగళవారానికి వాయిదాపడింది. -
మోదీజీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి: కేజ్రీవాల్
న్యూఢిల్లి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి పాలనను కొట్టివేసిన విషయంలో కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికైన ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇది మోదీ సర్కారుకు గుణపాఠంగా మారాలన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగ్రెస్ నాయకుడు హరీష్ రావత్ ను ఈ నెల 26న మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా న్యాయస్థానం సూచించింది. ఉత్తరాఖండ్ లో మార్చి 27 ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించిన విషయం తెలిసిందే. -
హస్తినకు ఉత్తరాఖండ్ సంక్షోభం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదం దేశ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకుంది కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులతో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత కోల్పోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. రాజకీయంగా పట్టును కోల్పోయిందని విమర్శిస్తోంది. అటు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల కింద స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26లోగా అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హరీష్ రావత్ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ శాసనసభ్యులు ఒక గుర్తుతెలియని ప్రదేశంలోకి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, సీనియర్ నాయకుడు హరక్ సింగ్ సహా తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నివాసాలకు బయట ఈ నోటీసులు అతికించారు. అటు ముఖ్యమంత్రి హరీష్ రావత్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు ఈనెల 28 వరకు గవర్నర్ పౌల్ గడువు ఇచ్చారు. కాగా రావత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ సభ్యులను కొని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ట్విట్ శారు. మొన్న అరుణాచల్, ఇపుడు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడిచేయడం ద్వారా బీజేపీ తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మండిపడ్డారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ తిరుగు బాటు అభ్యర్ధుల సహకారంతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.