పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో పార్టీ ఫిరాయించిన 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. వారిపై అనర్హత వేటు వేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో రేపు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షలో వీరు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. హరీశ్ రావత్ పై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది.
మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో హరీశ్ రావత్ విశ్వాస పరీక్ష ఎదుర్కొబోతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరాఖండ్ శాసనసభలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 27 మంది, బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో 61 మంది బలపరీక్షలో ఓటు వేయనున్నారు. తనకు 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రావత్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న బలపరీక్షలో రావత్ గట్టెక్కడం ఖాయంగా కనబడుతోంది.