ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదం దేశ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకుంది కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులతో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత కోల్పోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. రాజకీయంగా పట్టును కోల్పోయిందని విమర్శిస్తోంది.
అటు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల కింద స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26లోగా అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హరీష్ రావత్ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ శాసనసభ్యులు ఒక గుర్తుతెలియని ప్రదేశంలోకి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, సీనియర్ నాయకుడు హరక్ సింగ్ సహా తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నివాసాలకు బయట ఈ నోటీసులు అతికించారు. అటు ముఖ్యమంత్రి హరీష్ రావత్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు ఈనెల 28 వరకు గవర్నర్ పౌల్ గడువు ఇచ్చారు.
కాగా రావత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ సభ్యులను కొని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ట్విట్ శారు. మొన్న అరుణాచల్, ఇపుడు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడిచేయడం ద్వారా బీజేపీ తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మండిపడ్డారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ తిరుగు బాటు అభ్యర్ధుల సహకారంతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.