'సలహా ఇచ్చిన మంత్రిని సాగనంపండి'
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించమని సలహా ఇచ్చిన మంత్రిని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ లో భంగపాటు గురైన మోదీ.. పార్లమెంట్ లో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ బేరాలు ఫలించలేదని అన్నారు.
'కాంగ్రెస్ రాజకీయ బేరసారాలు సాగించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అలా అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చెంతకు ఎందుకు చేరార'ని సిబల్ ప్రశ్నించారు. అధికార దాహంతోనే ఆర్టికల్ 356ను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. 33 శాతం మంది ప్రజలు కరువుతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మోదీ అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.