కొంపముంచిన వర్గపోరు! | not elected chairman to parigi Market committee | Sakshi
Sakshi News home page

కొంపముంచిన వర్గపోరు!

Mar 6 2014 12:11 AM | Updated on Mar 18 2019 7:55 PM

పరిగి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోని ఇరువర్గాల మధ్య నెలకొన్న పోటీ అసలుకే ఎసరు తెచ్చింది.

 పరిగి, న్యూస్‌లైన్: పరిగి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోని ఇరువర్గాల మధ్య నెలకొన్న పోటీ అసలుకే ఎసరు తెచ్చింది. పోటాపోటి లాబీయింగ్‌తో రాష్ట్ర నాయకత్వాన్ని డోలాయమానంలో పడేసిన స్థానిక నాయకులు.. చైర్మన్‌గిరి ఎవరికీ దక్కకుండా చేసుకున్నారు. చైర్మన్ పదవీకాలం ముగిసి ఆరు నెలలు గడిచిన నేపథ్యంలో ఆ పదవి కోసం కమతం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఆర్ వర్గాలు పోటీ పడ్డాయి. తీరా ఈ సమస్య కొలిక్కి వస్తుందనుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన రావడంతోపాటు ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. దీంతో మరో ఆరు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత ఆగస్టుతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీ కాలం ముగిసింది. అప్పటినుంచే ఇరు వర్గాల నాయకులు గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ మంత్రి కమతం రాంరెడ్డి.. తన కుమారుడినే మళ్లీ ఆ పీఠంపై కూర్చోబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి సైతం లాబీయింగ్ చేశాయి. వీరే కాకుండా మరికొందరు కూడా ఆ పీఠంపై కన్నేసి ముమ్మర ప్రయత్నాలు కొన సాగించారు.

 మాదంటే మాదే..
 మార్కెట్ చైర్మన్ పదవి మాదంటే.. మాదని చివరివరకూ ఇరు వర్గాలు చెప్పుకున్నాయి. ప్రస్తుత చైర్మన్‌కే ఇచ్చే అవకాశం ఉంటే ఇప్పటికే పదవీకాలం పొడిగించే వారని, ఇచ్చే ఉద్దేశం లేకనే పెండింగ్ పెట్టారని కమతం వ్యతిరేకవర్గం ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే రామ్మోహన్‌రెడ్డి కుల్కచర్ల మండలానికి చెందిన ఓ బీసీ నేత పేరును సూచిస్తూ పార్టీ పెద్దల వద్ద లాబీయింగ్ చేశారు. కానీ ఎవరి ప్రయత్నాలూ ఫలించలేదు.

 మంచి ఆదాయ వనరు!
 గతంలో నామినేటెడ్ పోస్టంటే హోదా కోసమనే భావించేవారు. కానీ అన్నింటిలా కాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పెట్టుబడిలేని ఆదాయ వనరులని భావిస్తున్నారు. ఐదారేళ్ల క్రితం వరకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలలోపు ఉన్న పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయం ప్రస్తుతం ఏడాదికి రూ.కోటి దాటింది. మరోవైపు ప్రధాన ఆదాయ వనరుగా జీరో వ్యాపారం.. దీంతో మార్కెట్ చైర్మన్ పదవి కోసం పోటీ పెరిగింది. ప్రస్తుతం పరిగి వ్యవసాయ మార్కెట్‌కు చైర్మన్ లేక, కార్యదర్శి లేక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement