‘అరుణాచల్’ సున్నిత విషయం
రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
♦ గవర్నర్ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇది చాలా తీవ్రమైన, సున్నితమైన అంశమంటూ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం.. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ గవర్నర్ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని ఆదేశించింది. దీనిపై జనవరి 29 లోగా స్పందించాలంటూ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాకు, కేంద్ర హోం శాఖకు బుధవారం నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ పాలనలోని అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ అయిన అధికారిక నోటిఫికేషన్‌ను పిటిషన్‌దారులు తమ తాజా దావాలో సవాలు చేయలేదని, అందువల్ల మళ్లీ దావా వేయాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ లేవనెత్తిన సాంకేతికపర అభ్యంతరాన్ని బెంచ్ తోసిపుచ్చింది. తమ దావాను జనవరి 29లోగా సవరించుకునేందుకు పిటిషన్‌దారైన అరుణాచల్ అసెంబ్లీలో సీఎల్పీ చీఫ్ విప్ రాజేశ్ టాకోకు, సహ పిటిషన్‌దారులకు అవకాశమిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వేసింది. రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ చేసిన సిఫారసు నివేదికను రహస్యంగా ఉంచాలంటూ గవర్నర్ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ సత్పాల్ జైన్ కోరారు. దాంతో పిటిషన్‌దారులకు నివేదిక పంపిన తేదీని చెబితే సరిపోతుందని, తమకు మాత్రం పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని బెంచ్ స్పష్టం చేసింది.
‘రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయడానికి కారణాలేంటో తెలియకుండా ముందుకు వెళ్లలేం. ఆ కారణాలతో.. రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ అయిన అధికారిక నోటిఫికేషన్‌లోని వివరాలు సరిపోలకపోతే అది వేరే విషయం’ అని పేర్కొంది. గవర్నర్ నివేదికలోని కారణాలు, నోటిఫికేషన్‌లోని కారణాలు వేరుగా ఉండే అవకాశముందని ప్రభుత్వం న్యాయవాది అశోక్ దేశాయి పేర్కొనగా ‘ఎస్.. అందుకే మేం ముందుగా గవర్నర్ నివేదికను చూడాలనుకుంటున్నాం’ అని తేల్చిచెప్పింది. గవర్నర్ నివేదికను రహస్యంగా ఉంచాలన్న అభ్యర్థనను వ్యతిరేకిస్తూ.. ఈ విషయంలో ఐదుగురు కన్నా ఎక్కువ మంది సభ్యులున్న సుప్రీం బెంచ్ ఇప్పటికే ఈ అంశంపై స్పష్టతనిచ్చిందని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఫాలీ నారిమన్ తదితరులు చెప్పారు.
అంతకుముందు, విచారణ ప్రారంభం కాగానే, 15 నిమిషాల్లో గవర్నర్ నివేదికను కోర్టుకు సమర్పించాలంటూ కోర్టు ఆదేశించడంతో.. రాజ్‌భవన్ ముందు నిరసనలు జరుగుతున్నాయని, గవర్నర్‌కు ప్రాణహాని అవకాశముందని సత్పాల్ జైన్ వివరణ ఇచ్చారు. గవర్నర్ ఇచ్చిన పలు నివేదికల ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారన్న ముకుల్ రోహత్గీ వాదనను.. ఒకే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్రపతిపాలన విధిస్తూ జారీ అయిన నోటిఫికేషన్‌లో ఉందంటూ కోర్టు తిప్పికొట్టింది. రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అవసరమైన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్న నారిమన్ వాదనతో విభేదిస్తూ.. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది. కాగా అరుణాచల్‌లో రాష్ట్రపతిపాలన సమాఖ్య తత్వానికి దెబ్బని కాంగ్రెస్ పేర్కొంది. తనకు అవకాశమిస్తే.. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటానని మాజీ సీఎం టుకీ చెప్పారు.