రాష్ట్రపతి పాలనకు వ్యూహం | President's rule strategy | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పాలనకు వ్యూహం

Published Tue, Oct 7 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

President's rule strategy

 చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో అన్నాడీఎంకే ఆధిపత్యానికి గండికొట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడం ద్వారా జయలలిత ప్రాభవాన్ని పక్కనపెట్టవచ్చన్న వ్యూహ రచనలో నిమగ్నమయ్యూయి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అన్నాడీఎంకే గెలుపొంది అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు డీఎంకే అధికారంలో ఉంది. ఐదేళ్లకోసారి అధికార పార్టీ మారడం రాష్ట్రంలో సర్వసాధారణమైనా అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్థి డీఎంకేకు ఈసారి గట్టిదెబ్బే తగిలింది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా శ్రీలంక యుద్ధం సమయంలో సరైన పాత్ర పోషించలేదనే అపవాదును కరుణానిధి మూటగట్టుకున్నారు.
 
 శ్రీలంక గస్తీ దళాలు తమిళ జాలర్లపై చెలరేగిపోవడం వల్ల ఈ అపప్రద మరింతగా పెరిగింది. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో  ఒంటిరిపోరుకు దిగిన అన్నాడీఎంకే అత్యధిక స్థానాలు (37) తన్నుకుపోగా మిగిలిన రెండింటిలో బీజేపీ, కూటమి పార్టీ గెలుచుకున్నారు. డీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యూయి. గత నెల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అమ్మ హవా కొనసాగింది. డీఎంకేకు ఒక్క కార్పొరేషన్, ఒక్క మునిసిపాలిటీ కూ డా దక్కలేదు. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా అమ్మ ప్రభుత్వంపై ప్రజల్లో ఏమాత్రం అసంతృప్తి లేకుండా పోయింది. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ వాటర్ బాటిళ్లు, అమ్మ చౌకదుకాణాలు ఇలా అన్ని పథకాలతో ప్రజలకు అమ్మ చేరువకావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
 
 అన్నిటికన్నా ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు మధ్య అనాదిగా సాగుతున్న కావేరీ జలాల వివాదంపై జయ విజయం సాధించారు. పాలనాపరంగా ప్రతిపక్షాల విమర్శలకు అమ్మ చిక్కడం లేదు. 2016లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అన్నాడీఎంకేను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలకు అవకాశమే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జయ జైలు పాలుకావడం  ప్రతిపక్షాలకు కలిసొచ్చింది. రాబోయే ఎన్నికల్లో జయ జైలు అంశాన్నే ప్రధాన ఆయుధంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో అన్నాడీఎంకే అధికారంలో ఉంటే సంకట స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలో కొనసాగుతున పాలనను ఆపద్ధర్మ ప్రభుత్వంలా చూస్తున్న ప్రతిపక్షాలు రాష్ట్రపతి పాలన దిశగా సాగాలని ఆలోచిస్తున్నాయి.
 
 జయ జైలు పాలైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల కారణంగా శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యూయనే కారణం చూపుతూ కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా రాష్ట్రపతి పాలనను సాధించాలని వ్యూహం పన్నుతున్నాయి. అధికార పార్టీ అధినేత్రి కోసం సాగుతున్న ఆందోళనలు కావడంతో పోలీసు శాఖ నుంచి అనుమతులు కూడా తీసుకోవడం లేదని డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం నోరువిప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను అదుపు చేసేందుకు కీలకస్థానాల్లో ఉన్నవారు తక్షణం జోక్యం చేసుకోవాలని కరుణ డిమాండ్ చేయడం రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేయడంగానే పరిగణిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నాడీఎంకే యేతర పక్షాలన్నీ డీఎంకే నేతృత్వంలో ఒకే గొడుగు కిందకు రావాలనే ప్రయత్నాలు ఇప్పటికే మొద లయ్యూయి. పనిలో పనిగా రాష్ట్రపతి పాలనను సైతం సాధించగలిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలో గెలుపు నల్లేరు మీద నడకేనని సమాలోచనలు జరుపుతున్న సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement