ఉన్నా..ఉత్సవ విగ్రహాలే
Published Sun, Mar 2 2014 1:58 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
సాక్షి, కాకినాడ :మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం అనంతరం రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతూ గత నాలుగేళ్లుగా కొనసాగిన కాంగ్రెస్ సర్కారుకు తెరపడింది. నాలుగుదశాబ్దాల తర్వాత రాష్ర్టం తిరిగి రాష్ర్టపతి పాలనలోకి వచ్చింది. శుక్రవారం నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఆమోదముద్ర వేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు జిల్లాల పాలనాపగ్గాలు పూర్తిగా కలెక్టర్ల చేతుల్లోకి వచ్చాయి. శాసనసభను సుప్తచేతనావస్థలో పెడుతూ రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనను తీసుకు రావడంతో ఎమ్మెల్యేలు అదే స్థితిలోకి వెళ్లనున్నారు.
రాష్ర్టంలో ప్రజాకంటక పాలన సాగించిన ‘కిరణ్’ సర్కార్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన కారణంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై అనర్హత వేటువేయడంతో ఆయన ఇప్పటికే మాజీ అయ్యారు. కిరణ్ కేబినెట్‌లో పాడిపరిశ్రమ, మత్స్యశాఖామంత్రిగా పనిచేసిన పినిపే విశ్వరూప్ సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఈ శాఖలను కూడా జిల్లాకు చెందిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖమంత్రి తోట నరసింహంకు అప్పగించారు. రాష్ర్టపతి పాలన అమలులోకి రావడంతో ఆయన కూడా మంత్రి హోదా కోల్పోయి మాజీగా మిగిలిపోయారు.
నోటిఫికేషన్ వస్తే మాజీలే..
తోటతో పాటు జిల్లాకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు కూడా పదవులుండీ ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోనున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వీరికి కనీస గౌరవం దక్కుతుంది. నోటిఫికేషన్ వస్తే మాత్రం మాజీలుగా మిగిలిపోతారు. ఈలోగా కేంద్రం మనసు మార్చుకొని రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుని, రాష్ర్టపతి పాలన ఎత్తివేస్తే అప్పుడు మళ్లీ వీరికి అధికారిక పగ్గాలు వస్తాయి. అప్పటి వరకు వీరు పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు. అధికారులపై కనీసం పెత్తనం చెలాయించే అధికారం కూడా వారికి ఉండదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీల పదవుల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ఎంపీలు పూర్తిగా కేంద్రానికి బాధ్యులై ఉంటారు. ఎమ్మెల్సీ హోదా కేవలం మండలికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అలాగే నామినేటెడ్ పదవులు, సర్పంచ్ పదవులకు కూడా ఎలాంటి ఢోకా ఉండదు. స్థానిక ప్రభుత్వాలు యథావిధిగా పనిచేస్తాయి.
మహానేత మరణ ంతో అస్థిరతకు బీజం..
తాను సముపార్జించిన అపార జనాభిమానంతో 2004లో కాంగ్రెస్‌కు ఘన విజయం చేకూర్చి, ముఖ్యమంత్రి అయిన వైఎస్ జన సంక్షేమానికే పెద్దపీట వేశారు. దాంతో ప్రజలు 2009 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌కు అందలమిచ్చారు. హెలికాప్టర్ ప్రమాదంలో మహానేత మనకు దూరమైనప్పటి నుంచీ కాంగ్రెస్ సర్కారు అస్థిరత పాలైంది. రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో రాష్ట్రం తిరోగమించింది. ప్రజా సంక్షేమం కొడిగట్టింది. కేంద్రంలో బీజేపీతో, రాష్ర్టంలో టీడీపీతో కుమ్మక్కు రాజకీయాలు నెరిపిన కాంగ్రెస్ తెలుగుప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని రెండుముక్కలు చేసింది. విభజనకు అన్ని విధాలా సహాయ సహకారాలందించిన కిరణ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిపోయాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో ఇంకా సమయం ఉండగానే పాలనాపగ్గాలను తీసుకెళ్లి రాష్ర్టపతి చేతులో పెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల కనుసన్నల్లో సాగిన జిల్లా పాలన ఇక నుంచి పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోకి వెళుతుంది. రాజకీయ పలుకుబడులకు తెరపడుతుంది. గవర్నర్ నేతృత్వంలో కలెక్టర్ పూర్తిగా జిల్లా పాలన సాగిస్తారు. వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదల, పనుల మంజూరు.. ఇలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో దేంట్లోనైనా కలెక్టర్‌దే తుది నిర్ణయం.
తుదిదినం.. తీరిక లేదు క్షణం
కాగా రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుందని ముందే తెలియడంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు చివరిరోజైన శనివారం క్షణం తీరిక లేకుండా.. తమ తమ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కేంద్ర మంత్రి వర్గ నిర్ణయానుసారం రాష్ర్టంలో రాష్ట్రపతి పాలనకు ఆయన ఆమోదముద్ర శనివారం మధ్యాహ్నమే లభించింది. అయినప్పటికీ జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు ‘చూరు పట్టుకుని వేలాడే బాపతు’ తాపత్రయంతో శనివారం రాత్రి కూడా అధికారిక హోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. ‘తిరిగి ఎన్నికల బరిలో నిలిచినా జనం ఆదరిస్తారన్న నమ్మకం బొత్తిగా లేకపోవడంతోనే ఇలా చివరిరోజు ‘గడువు’ మీరి మరీ అధికారాన్ని వెలగబెట్టారు’ అని పలువురు వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement