
రాజ్‌భవనే కీలకం
- {పధాన సమీక్షలన్నీ అక్కడే..
- రాష్ట్రపతి పాలన నేపథ్యంలో పోలీసింగ్‌లో స్వల్పమార్పు
- జీహెచ్‌ఎంసీ యథావిధిగానే...
సాక్షి, సిటీబ్యూరో : రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో నగరంలో మార్పుచేర్పులు ఏ విధంగా ఉంటాయనే విషయం చర్చనీయాంశమైంది. ప్రధానంగా సిటీ, సైబరాబాద్ పోలీసింగ్‌లో స్వల్ప మార్పుచేర్పులు చేసుకోనున్నాయి. జీహెచ్‌ఎంసీ యథావిధిగానే కొనసాగుతుందని తెలుస్తోంది. శాంతిభద్రతలకు సంబంధించి ఇకపై కీలకమైన సమీక్షలు ముఖ్యమంత్రికి బదులు గవర్నర్ నేతృత్వంలో జరుగనున్నాయి. ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నగరంలోని జంట కమిషనరేట్లలో భారీ స్థాయిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు చేపట్టాల్సి వచ్చింది. దీంతో పరస్పర బదిలీలకు నిర్ణయించిన కమిషనర్లు.. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావించారు.
అయితే ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి ఉండటం, డీజీపీ బి.ప్రసాదరావు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిమిత్తం ఢిల్లీ వెళ్లడంతో గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయనకు వివరించారు. ఇకపై ఇలాంటి కీలకాంశాల్లో ఇదే పంథా కొనసాగనుంది. పాలసీ డెసిషన్స్‌కు సంబంధించిన అంశాల్లో గవర్నర్ లేదా ఆయన ఆధీనంలో పనిచేసే సలహాదారుల్లో శాంతిభద్రతల్ని పర్యవేక్షించే అధికారి సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. జంట కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తినా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా రాజ్‌భవన్ నుంచి కమిషనర్లను సంజాయిషీ కోరతాయి.
ఉదంతం తీవ్రతను బట్టి గవర్నర్ సైతం స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తారు. ఎన్నికల బందోబస్తు, తీసుకుంటున్న చర్యలపై ఈసీతో పాటు రాజ్‌భవన్ వర్గాలూ ఆరాలు తీయడంతో పాటు, సమీక్షలు నిర్వహిస్తుంటాయి. ప్రజలు ఎవరైనా తమకు తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందని, పోలీసులు సైతం నిస్పాక్షికంగా వ్యవహరించట్లేదని భావిస్తే నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనిపై ఆయనే సంజాయిషీలు, నివేదికలు కోరతారు. చీటికీ మాటికీ పోలీసుస్టేతషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై ధర్నాల పేరుతో విరుచుకుపడే రాజకీయ పార్టీలు సైతం వెనకడుగు వేయాల్సిందే.
పోలీసులు ధైర్యం చేస్తారా?
మామూలు సమయాల్లో రాజధానిలో పూర్తిస్థాయిలో నిష్పాక్షిక పోలీసింగ్ జరగదు. సామాన్యుడికి అన్ని విధాలా సహకారం అందదు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయ జోక్యం, నేతల ఒత్తిడి వంటి కారణాలు చెప్తుంటారు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తే గవర్నర్ అజమాయిషీతో రాజకీయం అనే మాటే వినిపించదు. అయినప్పటికీ పోలీసింగ్ నుంచి ఎన్నికల నిర్వహణ వరకు ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా పోలీసులు వ్యవహరించగలరా? అంటే పూర్తిగా ఔనని చెప్పలేని స్థితి. దీనికీ కారణం లేకపోలేదు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన, ఆ తరవాత ఎన్నికల తంతు ముగిస్తే మళ్లీ పరిస్థితి ‘మామూలే’. ఇప్పుడు పక్కా పోలీసింగ్ పేరుతో విధులు నిర్వర్తిస్తే అప్పుడు టార్గెట్‌గా మారే ప్రమాదం ఉంటుందని అధికారులు భయపడతారు. ఈ భీతికి తావివ్వకుండా ఎందరు అధికారులు ధైర్యం ప్రదర్శిస్తారో వేచి చూడాల్సిందే.
జీహెచ్‌ఎంసీ తీరుతెన్నులివీ...
రాష్ట్రపతి పాలన విధించనున్న నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరిపాలన ఎలా ఉంటుంది..? పనితీరులో ఏవైనా మార్పు చేర్పులుంటాయా? ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండలి రద్దవుతుందా వంటి అనుమానాలు ఎందరిలోనో నెలకొన్నాయి. అయితే రాష్ట్రపతి పాలన వల్ల స్థానిక సంస్థ అయిన జీహెచ్‌ఎంసీలో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రపతి పాలన వల్ల రాష్ట్రంలో మంత్రిమండలి, అసెంబ్లీ నిర్వహణ వంటివి ఉండవు తప్ప జీహెచ్‌ఎంసీ యథావిధిగానే పనిచేస్తుందని చెబుతున్నారు.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో.. తెలంగాణ పరిధిలోకి వచ్చే పది జిల్లాల్లో హైదరాబాద్ ఒక జిల్లాగా ఉంటుందే తప్ప.. స్థానిక సంస్థ అయిన జీహెచ్‌ఎంసీకి ప్రత్యేక పాలన కానీ.. పరిమితులు కానీ ఉండవని వారు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయినా జీహెచ్‌ఎంసీకి సంబంధించినంతవరకు ఎలాంటి మార్పుచేర్పులుండబోవని చెబుతున్నారు. ఎప్పటిలాగే గ్రేటర్‌లో నివసిస్తున్న ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్యుత్, వరదకాలువల వంటి సదుపాయాలు కల్పిస్తారు. పారిశుధ్యం, దోమల నివారణ తదితర పనులు నిర్వహిస్తారు. అలాగే ఆస్తిపన్ను, ట్రేడ్‌లెసైన్సుల ఫీజుల వసూలు వంటివి చేస్తారు.
మార్పులుండవ్
స్థానిక సంస్థ అయిన జీహెచ్‌ఎంసీలో ఎలాంటి మార్పులుండవని, యథావిధిగానే కార్యకలాపాలు కొనసాగుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వం తరపున ఒక సలహాదారును నియమించే అవకాశాలున్నాయన్నారు. పరిపాలనకు సంబంధించిన సంప్రదింపులు.. ఏవైనా కార్యక్రమాల అమలు కోసం సలహాదారు సూచనలు తీసుకునే వీలుంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూలు కూడా వెలువడనున్నందున.. అధికారులు సైతం ఎన్నికల పనుల్లో నిమగ్నం కానున్నారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ.. జీహెచ్‌ఎంసీ తన పని తాను చేసుకుపోతుందే తప్ప.. ఎలాంటి మార్పులకు అవకాశం లేదని సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం కాబట్టి రెండు రాష్ట్రాల నుంచి నిధులు పొందేందుకు.. అలాగే కేంద్రం నుంచీ ప్రత్యేక గ్రాంట్లు పొందేందుకు వీలుంటుందని మేయర్ మాజిద్ భావిస్తున్నారు. ఆ మేరకు ఆయా ప్రభుత్వాలకు లేఖలు రాయనున్నారు.