
ఇక రాష్ట్రపతి పాలనే!
నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్ర మంత్రిమండలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై చేతులెత్తేసిన కాంగ్రెస్ అధిష్టానం
3 లేదా 4న ఎన్నికల షెడ్యూల్!
అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే..వాయిదా ఉండదన్న భన్వర్‌లాల్
5న కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ
అపాయింటెడ్ తేదీ... జూన్ 1!
ఆ రోజే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం
త్వరలో గెజిట్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి శుక్రవారంతో తెర పడనుంది. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ అధిష్టానం నిశ్చయించింది. శుక్రవారం ఉదయం 10.30కు జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ అంశాన్ని కేబినెట్ ఎజెండాలో కూడా చేర్చినట్టు సమాచారం. అంతేగాక రాష్ట్ర అసెంబ్లీకి కూడా లోక్‌సభతో కలిపి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 3 లేదా 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలకు ఈ మేరకు తాజాగా సమాచారం అందింది. శుక్రవారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా అనిశ్చితికి కేంద్రం తెరదించనుందని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. ఎన్నికల వేళ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించినా పార్టీలో తలనొప్పులు మరింతగా పెరగడమే తప్ప లాభముండదని కేంద్ర పెద్దలు భావించినట్టు తెలిసింది. పైగా రాష్ట్రపతి పాలన విధిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ నాటికి విభజన ప్రక్రియ సజావుగా సాగుతుందనేది వారి అభిప్రాయమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ (అపాయింటెడ్ డే)ని జూన్ 1గా ఖరారు చేస్తూ రాష్ట్రపతి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఆయన వివరించారు. అప్పటికి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తవడమే గాక విభజన ప్రక్రియ పూర్తై ఎలాంటి సమస్యలూ లేకుండా తెలంగాణ, సీమాంధ్రల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని చెప్పుకొచ్చారు.
నేతలతో సోనియా మంతనాలు
ఇప్పటిదాకా ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరిన కాంగ్రెస్ పెద్దలు... సీమాంధ్ర నేతల్లోని గందరగోళ వైఖరి తదితరాలను లోతుగా విశ్లేషించుకున్నాక గురువారం వైఖరి మార్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు వల్ల విభజన ప్రభావానికి ప్రభుత్వ వ్యతిరేకత తోడవడమే గాక అది ఎన్నికల వరకూ కొనసాగుతుందనిభావించార. వీటికి బదులు పూర్తి కాలం ప్రచారంలో నిమగ్నమవడం మేలన్న అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, తన రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, భావి కార్యాచరణపై చర్చించారు. ఇరు ప్రాంతాల నేతలతో సంప్రదింపుల సారాంశం, ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురవుతున్న అనైక్యత, అపాయింటెడ్ తేదీని ఇప్పట్లో ఖరారు చేయలేని పరిస్థితి తదితరాలను నేతలు మేడమ్ ముందుంచారు. రాష్ట్రపతి పాలనే శరణ్యమని సలహా ఇచ్చారు. అనంతరం దిగ్విజయ్ ఈ మేరకు సంకేతాలిచ్చారు.
ప్రభుత్వ ఏర్పాటుపైనా పరిశీలన: జైరాం
కేంద్ర మంత్రి జైరాం రమేశ్ మాత్రం రాష్ట్రపతి పాలనా, ప్రభుత్వ ఏర్పాటా అన్నదానిపై అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వాటిపై లోతుగా పరిశీలిస్తోందని గురువారం హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులకు చెప్పారు. రెండు రాష్ట్రాలు మనుగడలోకి వచ్చే అపాయింటెడ్ తేదీని ప్రకటిస్తూ రాష్ట్రపతి భవన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ కాగానే రెండు రాష్ట్రాలకు ప్రత్యేక పీసీసీల ఏర్పాటుకు కూడా కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంది.
గవర్నర్ సలహాదారులుగా అగర్వాల్, కుట్టి?
రాష్ట్రపతి పాలన నేపథ్యంలో రాష్ట్ర పాలన పగ్గాలను శుక్రవారం నుంచి గవర్నర్ నరసింహన్ చేపట్టనున్నారు. పాలనలో తనకు సాయపడేందుకు సలహాదారుల వేటలో నిమగ్నమయ్యారు. బయటి వారికి బదులు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్‌లే మేలని ఆయన భావిస్తున్నారు. ఇద్దరు అధికారులను గవర్నర్ సంప్రదించగా వారు విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. విభజన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారిని నియమించుకుంటేనే మేలని కొందరు అధికారులు ఆయనకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో పనిచేసి రిటైరైన అనిల్‌కుమార్ కుట్టి, ఆర్.కె. అగర్వాల్ వంటి సీనియర్ ఐఏఎస్‌లు సలహాదారులుగా రావచ్చంటున్నారు.
మార్చి 5న కలెక్టర్లు, ఎస్పీలతో సీఈఓ భేటీ
రాష్ట్రంలో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో తనను కలిసిన సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రం మరికొంత కాలం కలిసుంటుందా, వెంటనే విడిపోతుందా అన్నదానితో సంబంధం లేదు. రెండు రాష్ట్రాల్లోనైనా ఎన్నికలు యథావిధిగా జరుగుతాయి. విభజన పూర్తవకపోతే 28 రాష్ట్రాల్లోను, పూర్తయితే 29 రాష్ట్రాల్లోను ఎన్నికలు జరుగుతాయి. అంతే తప్ప విభజన వల్ల ఎన్నికలు వాయిదా పడవు’’ అని వివరించారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలతో మార్చి 5వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.