ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మొన్న మున్సిపల్, నిన్న సార్వత్రిక ఎన్నికల సమరానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండడం.. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో పొత్తులపైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయమై కమిటీ వేసినట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఏ సీట్లు ఎవరికి కేటాయిస్తారు.. భవిష్యత్ కార్యాచరణ ఏంటి.. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవాల్సి వస్తే ఏం చేసేదనే ప్రశ్నలు టీఆర్‌ఎస్ నేతల మదిని తొలుస్తున్నాయి. కాగా.. అసెంబ్లీ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న అన్నిపార్టీల నేతలకు మున్సి‘పల్స్’ తలనొప్పిగా మారాయి. కౌన్సిలర్ల ఎంపిక బాధ్యత నియోజకవర్గ నేతలకు అప్పగించడంతో వారు తంటాలు పడాల్సి వస్తోంది. దీనికితోడు శుక్రవారం సుప్రీం కోర్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని తీర్పునిస్తే జిల్లాలో రాజకీయం
రసకందాయంలో పడనుంది.
కదనరంగంలోకి పార్టీలు.. నేతలు..
ఇన్ని రోజులుగా ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోసుకున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్నాయి. పట్టుకోసం పాకులాడుతున్నాయి. ఉనికి కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. అవకాశవాద రాజకీయాలకు తెరతీస్తున్నారు. శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల మద్య పొత్తులపై చర్చించేందుకు ఆయా పార్టీలు కమిటీలు వేయడం ఆసక్తికరంగా మారింది.
పొత్తు ఏర్పడితే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలాగుంటుందోనని ఆయా పార్టీల నాయకుల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేలలోనూ ఈ ఆందోళన వ్యక్తమవుతోంది. పొత్తు ఖరారైన పక్షంలో నియోజకవర్గం ఏ పార్టీకి కేటాయించిన మిగతా పార్టీ నాయకుల్లో అసంతృప్తి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదేజరిగితే అసంతృప్తి నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లడం, లేనిపక్షంలో స్వతంత్ర ంగానైనా పోటీలో ఉండే అవకాశాలు లేకపోలేదు.
వైఎస్సార్‌సీపీలో నూతనోత్తేజం
కాగా.. ఖమ్మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సభ విజయవంతం కావడంతో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కన్పిస్తోంది. తెలంగాణ ప్రజలూ పార్టీని ఆదరించడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. వైఎస్సార్ అభిమానులు పార్టీ పట్ల మక్కువ చూపిస్తూ నేతలను ఆదరిస్తుండడం కలిసిరానుంది. కాగా.. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా ఇప్పుడు ఖాళీ అవుతోంది. దశాబ్ద కాలంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న టీడీపీకి గత 2009 ఎన్నికల్లో జిల్లా నుంచి ఆదిలాబాద్, ముథోల్, ఖానాపూర్, బోథ్ స్థానాలు దక్కాయి.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జోగు రామన్న, వేణుగోపాలాచారి, ఇటీవల గోడం నగేష్ టీఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యారు. దీంతో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ నుంచి పలువురు వెళ్లిపోవడంతో ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. దీంతో రాజకీయంగా తటస్థంగా ఉన్న నాయకులపై టీడీపీ దృష్టి సారించింది. మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు గురువారం టీడీపీలో చేరడంతో ఆయన బోథ్ నుంచి పోటీ చేయవచ్చని చర్చ సాగుతోంది. బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇక ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. లోక్‌సభ ఆదిలాబాద్‌కు ఎస్టీ రిజర్వ్ కావడంతో ఆయా పార్టీల ముఖ్యనేతలు అటు అసెంబ్లీ బరిలో ఉండాలా.. లేక లోక్‌సభకు పోటీ చేయాల అనేదానిపై తర్జభర్జన పడుతున్నారు.
ప్రచారానికి సిద్ధం..
పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. మున్సిపల్ బరిలో దిగాలనుకుంటున్న నాయకులు స్థానిక వార్డుల్లోని ప్రజలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. వార్డు అభివృద్ధికి తోడ్పడుతామని నాయకులు చెబుతూ ఓటర్ల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోపక్క పార్టీల పరంగా టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు జిల్లాలో పర్యటించే అవకాశాలు ఉండడంతో రూట్లను సిద్ధం చేస్తున్నారు. శాసనసభ బరిలో దిగాలనుకుంటున్న నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే రావడంతో దృష్టిసారింపు విషయంలో అయోమయం చెందుతున్నారు.
అయితే స్థానిక పోరులో తన వాళ్లను నెగ్గించుకొని అసెంబ్లీ పోరుకు ధీమాగా వెళ్లాలని, లేనిపక్షంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని వారిలో భయం కూడా గూడుకట్టుకుంది. వార్డు సభ్యుల ఎంపిక విషయంలో అసంతృప్తి చోటు చేసుకున్న తమకే ఇబ్బంది అవుతుందని నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. పార్టీల పరంగా శాసనసభకు పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు మున్సిపోల్స్ సెమీఫైనల్ కానున్నాయి. 94 వార్డులు మహిళలకు రిజర్వు కావడంతో మహిళ నాయకుల్లో సందడి మొదలైంది. ఈనెల 10 నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుండడంతో మున్సిపల్ రాజకీయం వేడెక్కుతుంది. కాగా ఐదేళ్లు దాటినప్పటికీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరినా.. విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. నేటితో ఆ సస్పెన్స్‌కు తెరపడనుంది. ఒకవేళ ఆ ఎన్నికలు కూడా తప్పనిసరి నిర్వహించాల్సి వస్తే రాజకీయ నేతలకు తలనొప్పులు ప్రారంభమైనట్లేనని చెప్పొచ్చు.
వేడెక్కిన రాజకీయం
Published Fri, Mar 7 2014 1:44 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement