బలహీనవర్గాల వారికే పీసీసీ: దానం
దిగ్విజయ్‌ను కోరిన మాజీ మంత్రి దానం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని మాజీ మం త్రి దానం నాగేందర్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. పీసీసీ చీఫ్‌గా బలహీనవర్గానికి చెందిన నేతనే ఎంపిక చేయాలని విన్నవించారు. తెలంగాణలో బీసీల ప్రాబల్యం ఎక్కువని, అందువల్ల ఆ వర్గం నేతను అధ్యక్షునిగా నియమిస్తే పార్టీకి ఎన్నికల్లో లాభం చేకూరుతుందని ఆయన వివరించినట్టు సమాచారం.
ఎన్నికల్లో పార్టీని ఒకేతాటిపైకి తేవడం, అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో అధిష్టానానికి చేదోడుగా నిలిచే నేతను పీసీసీ సారథిగా నియమిస్తేనే ఆశించిన ప్రయోజనం ఉంటుందని నొక్కిచెప్పినట్టు తెలిసింది. సోమవారం ఢిల్లీ వచ్చిన దానం దిగ్విజయ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం హైదరాబాద్‌లో పరిస్థితులు, పార్టీకి లభిస్తున్న ఆదరణపై దానం వివరించారు. టీఆర్‌ఎస్ కలిసిరాకున్నా కాంగ్రెస్‌కు సొంతంగా మెజార్టీ రావడం ఖాయమని వివరించినట్టు సమాచారం. కాగా తెలంగాణ నుంచి పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలు ఆశిస్తోందని, ఇందుకోసం నేతలు కృషిచేయాలని దిగ్విజయ్ సూచించినట్టు సమాచారం.