ప్రధాని పదవిపై ఎప్పుడూ ఆశపడలేదు..
తన తాజా పుస్తకంలో ‘రాష్ట్రపతి పాలన’పై ప్రణబ్
* అయోధ్య ‘ద్వారాలు’ తెరవటం రాజీవ్‌గాంధీ చేసిన పొరపాటు
* ‘ద టర్బులెంట్ ఇయర్స్: 1980-96’ను ఆవిష్కరించిన హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన విధింపు అనేది దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తుందని.. అయితే కొన్నేళ్లలో చేసిన విధానపరమైన మార్పులు ఆ అవకాశాన్ని కొంతమేర తగ్గించాయని రాష్ట్రపతి ప్రణబ్ తను రాసిన తాజా పుస్తకంలో పేర్కొన్నారు. ప్రణబ్ తన అనుభవాలతో రాసిన రెండో పుస్తకం ‘ద టర్బులెంట్ ఇయర్స్ 1980-1996’ (కల్లోల సంవత్సరాలు) పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ ప్రచురించగా.. ఉపరాష్ట్రపతి అన్సారీ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్యాంగం విఫలమైందన్న ప్రాతిపదికపై రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేసిన అధికారిక ప్రకటనపై ప్రణబ్ మంగళవారం నాడే సంతకం చేసిన నేపథ్యంలో.. ఆయనే రాసిన పుస్తకంలోని పై వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రాల అధికారాన్ని రద్దుచేసే శక్తిని రాజ్యాంగంలోని 356వ అధికరణ కేంద్రానికి కల్పిస్తోందని.. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ శక్తిని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలతో ఈ అధికరణపై తీవ్ర విమర్శలు వచ్చాయని ప్రణబ్ తన పుస్తకంలో ఉటంకించారు. గణతంత్రం తొలి 50 ఏళ్లలో 2001 మార్చి వరకూ వివిధ రాష్ట్రాల్లో 108 సార్లు రాష్ట్రపతి పాలన విధించటం.. ఈ ఆరోపణలకు బలం చేకూర్చిందన్నారు.
గతంలో రాష్ట్రపతి పాలనను మూడేళ్ల వరకూ కొనసాగించవచ్చని.. కానీ రాజ్యాంగానికి 44వ సవరణ తర్వాత రాష్ట్రపతి పాలనను కేవలం ఏడాది పాటే కొనసాగించే వీలుందని.. అది కూడా అధికారిక ప్రకటన జారీ చేసిన రెండు నెలల్లోగా పార్లమెంటు ఉభయసభలూ దానిని ఆమోదించాల్సి ఉంటుందని వివరించారు.
ప్రధాని పదవిపై ఎప్పుడూ ఆశపడలేదు
ప్రధాని పదవి చేపట్టాలని తానెప్పుడూ ఆశపడలేదని స్పష్టంచేశారు. ఇందిరాగాంధీ హత్యోదంతం తర్వాత ప్రధాని పదవికి సంబంధించి తనపై వచ్చిన కథనాలన్నీ అసత్యాలని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీకి తనకు మధ్య ప్రధాని పదవికి సంబంధించి బాత్‌రూమ్‌లో జరిగిన సంభాషణలను వివరించారు. హాలులో జనం ఉండటంతో రాజీవ్ తనను బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లారని.. అప్పటి రాజకీయ పరిస్థితులు, రాజీవ్‌ను ప్రధానిగా చేయాలన్న పార్టీ నాయకుల అభిప్రాయాలను తాను చర్చించానని.. దీంతో ప్రధాని పదవి చేపట్టేందుకు రాజీవ్ అంగీకరించారని తాను బయటకొచ్చి రాజీవ్ నిర్ణయాన్ని తెలియజేశానని పేర్కొన్నారు.
మాస్ లీడర్‌ను కానని గుర్తించా: తర్వాతి కాలంలో రాజీవ్ కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలకటం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ‘పీవీ నరసింహారావు కూడా అయోమయంలో పడ్డారు’ అని అన్నారు. ఈ విషయంలో రాజీవ్‌తోపాటు తానూ తప్పులు చేశానన్నారు. బహిష్కారానికి గురయ్యాక బయటకొచ్చి ప్రణబ్ రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించానని.. తాను మాస్ లీడర్‌ను కాననే సంగతి తర్వాతే గుర్తించానన్నారు. రెండేళ్ల తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చానన్నారు.
అది రాజీవ్ పొరపాటు: పంజాబ్‌లో పరిస్థితి అసాధారణంగా మారిపోవటంతో స్వర్ణదేవాలయంలో ఉగ్రవాదుల ఏరివేతకు.. తనకు ప్రాణాపాయం ఉందని తెలిసీ మరో మార్గం లేకపోవటంతో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’పై ఇందిర నిర్ణయం తీసుకున్నారన్నారు. 1986 ఫిబ్రవరి 1న అయోధ్యలో ఆలయ ప్రాంత ద్వారాలను తెరవటం రాజీవ్ అంచనా పొరపాటన్నారు బాబ్రీ మసీదును ధ్వంసం చేయటం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పాల్పడిన మతిలేని విశ్వాసఘాతుక చర్య అని.. భారత ప్రతిష్టను అది దెబ్బతీసిందన్నారు. మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయటం.. జనాభాలో భిన్న వర్గాలు వేర్వేరుగా పోగుపడటానికి కారణమైనా సమాజంలో సామాజిక అన్యాయాన్ని తగ్గించేందుకు సాయపడిందన్నారు.
కావాలనే రహస్యాలను చెప్పలేదు
‘‘చాలా రహస్యమైన అంశాలపై నేను ఉద్దేశపూర్వకంగానే (పుస్తకంలో) మాట్లాడలేదు. అవి నాతోనే సమాధి అవుతాయి. ఆయా అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం విడుదల చేసినపుడు చదివి తమ సొంత నిర్ధారణలకు రావాల్సింది పాఠకులే’’ అని ప్రణబ్‌ముఖర్జీ పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డైరీలో రోజూ ఒక పేజీ రాసే తన అలవాటు గురించి చెప్తూ.. తన డైరీని ఎన్నడూ బయటపెట్టవద్దని దాని భద్రతను చూస్తున్న తన కుమార్తెకు నిర్దేశించినట్లు తెలిపారు.