Health secrets
-
46లో అలా.. 64లో ఇలా.. అలా ఎలా?
కొన్ని కొన్ని విషయాలు డాక్టర్లు కాదు.. పేషేంట్లు చెబితేనే బాగా అర్థమవుతాయి. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశారు ఇయాన్ క్లార్క్. ట్విట్టర్లో ఆయన పంచుకున్న అంశాలు .. కచ్చితంగా మనకు ఆరోగ్య రహస్యాలెన్నో చెబుతాయి. నాకప్పుడు 46 ఏళ్లు అధిక బరువుతో బాధ పడ్డాను ఏడాదికి మూడు సార్లు ఏదో ఒక జబ్బు వచ్చేది వీపరీతమైన నిరాశ, నిస్పృహాల్లో మునిగిపోయేవాడిని జుట్టు వేగంగా ఊడిపోయేది నాకిప్పుడు 64 ఏళ్లు ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా ఎలాంటి రోగాలు, జబ్బులు లేవు సంతోషంగా ఉన్నాను నాకు గుండు ఏమాత్రం కనిపించనంతగా పూర్తి స్థాయిలో వెంట్రుకలున్నాయి. అసలేం జరిగింది? ఈ 46 నుంచి 64 ఏళ్ల మధ్య కాలంలో నేను ఏం చేశాను? అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారడానికి నేను పడ్డ కష్టమేంటీ? ముందుగా నేను ఏ డాక్టర్‌ను కలవలేదు. ఎలాంటి మందులు వాడలేదు. అసలు హెల్త్ ఇన్సూరెన్సే తీసుకోలేదు. నేను చేసిన పనులేంటో మీరే చదవండి. 1. ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు నా ఆరోగ్యం బాగుండడానికి నేను చేసిన మొదటి పని ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు తీసుకోవడం. ఇది వారంలో ఒక రోజు చేసింది కాదు. రోజూ దీన్ని అనుసరించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవద్దనే నియమాన్ని కఠినంగా అనుసరించాను. ల్యాబ్‌ల్లో తయారై బాక్సుల్లో అందంగా ప్యాక్ చేసి కనిపించే భోజనాన్ని పూర్తిగా దూరం పెట్టాను. నా చుట్టున్న మార్కెట్లో, పంట పొలాల్లో నాకు మట్టిలో కనిపించే ఆహార పదార్థాలను ఎంచుకున్నాను. సూపర్ మార్కెట్లో దొరికే వాటి కంటే ఈ పదార్థాల్లో ఎన్నో పోషకాలుంటాయి. 2. మాంచి నిద్ర పోవడం మొదలెట్టాను కచ్చితంగా నిద్ర కోసం సమయాన్ని కేటాయించుకున్నాను. సమయమయిందంటే చాలు.. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఆపేసి నిద్ర పోవడం అలవాటు చేసుకున్నాను. అంతేనా.. రోజులో కూడగా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకున్నాను. దీని వల్ల మనసు ప్రశాంతంగా అనిపించింది. నా మెదడుకు ఎంతో రిలాక్స్ దొరికింది. వయస్సు మీద పడినట్టుగా అనిపించే కారకాలన్నీ దూరమయ్యాయి. అతి ముఖ్యమైన విషయం. నిద్ర రావడానికి టాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. - మీరు పడుకునే చోట ఎలాంటి లైట్లు ఉండకూడదు - రూం టెంపరేచర్ తక్కువగా ఉంటే మంచిది - ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఉండకూడదు. 3. ఉపవాసం ఉపవాసం అతి ముఖ్యమైనది. ఎందుకంటే... మన భోజన షెడ్యూల్‌ను కచ్చితంగా అనుసరించడం.. అంటే ఒకే సమయంలో అల్పహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్ర భోజనం తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రం అని ఎందుకంటున్నానంటే.. పడుకునేకంటే చాలా ముందుగా ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. అలాగే అప్పుడప్పుడు చేసే ఉపవాసాల వల్ల శరీరం నుంచి యాంటీ అక్సిడెంట్స్ సులువుగా బయటికి వెళ్లిపోతాయి. ఇవి వెళ్లిపోవడం వల్ల కాన్సర్, అల్జీమర్స్, స్ట్రోక్, గుండె వ్యాధులు లాంటివి రావు. గత కొన్నాళ్లుగా నేను కేవలం రెండు పూటలకు మాత్రమే పరిమితమయ్యాను. అదీ కూడా సేంద్రీయ సాగు ద్వారా పండించిన పంటలనే ఎంచుకుంటున్నాను. ఈ అలవాట్ల వల్ల నా భోజనం ఖర్చు సగానికి సగం తగ్గింది. 4) మెగ్నిషియం సప్లిమెంట్ మన శరీరానికి మెగ్నిషియం చాలా అవసరం. కండరాలు, జాయింట్లు, రోగ నిరోధక శక్తి మెదడు, గుండె, ఇతర ముఖ్య శరీర భాగాలు వీటన్నింటికి మెగ్నిషియం అవసరం. మనం ఎలాంటి భోజనం తీసుకున్నా.. వీటికి సరిపడా మెగ్నిషియం రాదు. సాగులో మనం అనుసరిస్తున్న విధానాలు అలాంటివి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75శాతం మంది మెగ్నిషీయం లోపంతో బాధపడుతున్నారు. అందుకే మెగ్నిషియంను అదనంగా సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాను. ఇవీ నేను అనుసరిస్తున్న విధానాలు. అందుకే 46 ఏళ్లలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల కంటే 64 ఏళ్లలో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. -
Cardamom Benefits: ఏలకులను పటికబెల్లంతో కలిపి చప్పరిస్తే..
Elaichi Health Benefits: నోటి దుర్వాసనను నివారించడానికి కొన్ని ఏలకులను నోట్లో వేసుకుని చప్పరించడం అనాదిగా మనకు తెలిసిన చిట్కానే. అయితే ఏలకులను పటికబెల్లంతో కలిపి చప్పరిస్తే నోటి దుర్వాసనను ఇంకా సమర్థంగా తగ్గించవచ్చు. అలాగే నీళ్లతో నిమ్మరసం చేసి, అందులో కొద్దిగా ఏలకుల చూర్ణం కలిపి తాగితే వాంతులు కూడా తగ్గుతాయి. పాలమీగడలో ఏలకులను కలుపుకుని, ఆ ముద్దను చప్పరిస్తే నోటిపూత, నాలుక పూత తగ్గుతాయి. ఏలకుల చూర్ణాన్ని బట్టలో పెట్టి కొద్దికొద్దిగా వాసన చూస్తుండం వల్ల తుమ్ములు, తలనొప్పి తగ్గుతాయి. అయితే ఏలకులలో చాలా ఎక్కువగా ఔషధ గుణాలున్నందు వల్ల దాన్ని ఎప్పుడూ కొద్ది కొద్ది మోతాదులో, చాలా పరిమితంగా మాత్రమే వాడాలి. చదవండి: (బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి) -
బౌండరీలు దాటే మనస్సు నాదీ... సెంచరీలు కొట్టే వయస్సు నాది
శంకరమంచి జానకి... షావుకారు చిత్రంతో ఇంటిపేరు మారిపోయింది.. తొమ్మిది పదులు నిండినా ఇప్పటికీ తన పని తనే చలాకీగా చేసుకుంటున్నారు.. 74 సంవత్సరాల క్రితం నటించిన షావుకారు చిత్రంలోని డైలాగులను నిద్రలో లేపి అడిగినా నేటికీ ఒప్పచెబుతున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎంత యాక్టివ్‌గా ఉన్నారో! వయసు తన శరీరానికే కానీ, తన మనస్సు మాత్రం బౌండరీలు దాటుతోందంటున్న షావుకారు జానకి తన ఆరోగ్య రహస్యాలను సాక్షితో పంచుకున్నారు. ఆ వివరాలు ఆవిడ మాటల్లోనే... నేను బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో.. 1931 డిసెంబరు 11న తూ. గో. జిల్లా రాజమండ్రిలో పుట్టాను. మాది చాలా ఆచారవంతుల కుటుంబం. అమ్మ శచీదేవి, నాన్న టేకుమళ్ల వెంకోజీరావు. అమ్మ పద్ధతులు, శుభ్రత అన్నీ అలవడ్డాయి. నాకు ఇప్పుడు 89 పూర్తయ్యి 90కి వచ్చాను. నా కంటె ముందు అన్నయ్య, అక్కయ్య, నా తరవాత, చెల్లి కృష్ణకుమారి. అక్కయ్య చాలా చిన్నతనంలోనే కన్నుమూసింది. రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నాను. నాన్న ఉద్యోగరీత్యా చాలా రాష్ట్రాలకు మారుతుండటం వల్ల నా చదువు సరిగ్గా సాగలేదు. నాన్న హిందూ పేపర్ చదవటం అలవాటు చేశారు. మద్రాసు ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్‌లో చేర్పించారు. క్రమేపీ తెలుగు రాయటం, మాట్లాడటం నేర్చుకున్నాను. బాల్య వివాహం... పదిహేను సంవత్సరాలకే పెళ్లి చేసేశారు. మద్రాసు ఆకాశవాణిలో బాలానందం ప్రోగ్రామ్ లో నా గొంతు విన్న బి.ఎన్. రెడ్డి గారు నన్ను పిలిపించి, ‘సినిమాలో చేస్తావా’ అన్నారు. ఏమీ తెలియక పోయినా ‘చేస్తాను’ అనేసి, ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాను. నాన్న చీవాట్లు పెట్టి, శంకరమంచి శ్రీనివాసరావుతో నాకు పెళ్లి చేసేశారు. ఆ తరవాత నాన్నగారు బదిలీ మీద అస్సాం వెళ్లిపోయారు. విజయవాడలో కొత్త కాపురం... మేం విజయవాడ సత్యనారాయణపురంలో కాపురం పెట్టాం. అయితే ఆయనకు సంపాదన అంతగా లేక పోవడంతో క్రమేపీ మాకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో మమ్మల్ని అస్సాం రమ్మన్నారు నాన్న. అక్కడ కొన్నాళ్లు ఉన్నాం. పెళ్లి అయ్యాక పుట్టింట్లో ఉండటం ఇబ్బందిగా అనిపించింది. అప్పట్లో మా చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. ఊరికే కూర్చోలేక, తనని చదివిస్తూ, నేను ప్రైవేట్‌గా పరీక్ష రాశాను. అప్పుడు నాకు పదిహేడు సంవత్సరాలు. నిండు నెలలు, ఓవర్‌కోట్ కప్పుకుని పరీక్ష రాశాను. షావుకారు ఇంటి పేరుగా మారింది.. ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం మర్యాద కాదని, మద్రాసు మా మేనమామ ఇంటికి చేరాం. అక్కడే నాకు పెద్దమ్మాయి యజ్ఞ ప్రభ పుట్టింది. ఒక రోజున మా వారితో, గతంలో నాకు వచ్చిన సినిమా అవకాశం గురించి చెప్పి, నేను నటించటానికి ఒప్పించి, బిఎన్ రెడ్డిగారిని కలిశాను. చేతిలో పాపాయి, పక్కన మా వారు. ఆయనకు నా కళ్లల్లో మా ఇబ్బంది కనిపించి, వారి తమ్ముడు తీస్తున్న ‘షావుకారు’ చిత్రం గురించి చెప్పారు. ఎన్నో పరీక్షల తరవాత ఆ చిత్రంలో హీరోయిన్ అవకాశం వచ్చింది. అప్పటి నుంచి షావుకారు జానకి అయ్యాను. షావుకారు íసినిమాలో బాగా చేస్తేనే నిలదొక్కుకోగలను అనుకున్నాను. ఇంట్లో మూడు నెలల పాపను వదిలి, తల్లిగా మానసిక వేదన అనుభవిస్తూ, ఆ సినిమా చేశాను. ఆ సినిమాకు 2500 రూపాయలు పారితోషికం. అలా కుటుంబం కోసం సినిమాలలోకి ప్రవేశించాను. నాలుగు కాలాల పాటు ఉండే పాత్రలు చేస్తూ, ‘నువ్వు పనికిరావు’ అన్న కె. వి. రెడ్డిగారితో ‘పనికి వస్తావు’ అనిపించుకునే స్థాయికి ఎదిగాను. శివాజీ గణేశన్ గారి ప్రోద్బలంతో పుదియ పరవై అనే తమిళ చిత్రంలో గ్లామర్ రోల్ చేసి, అందరి ప్రశంసలు అందుకున్నాను. బాలచందర్ నాటకాలలో... 500 సినిమాలు చేసినా, నాటకాల మీద వ్యామోహం పోలేదు. సినిమాలలో చేస్తూనే, పైసా కూడా తీసుకోకుండా 300 నాటకాలు చేశాను. అప్పట్లో కె. బాలచందర్ రచన, దర్శకత్వం వహించిన నాటకాలలో కూడా వేశాను. కలైమామణి అవార్డు, అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్ కూడా అందుకున్నాను. సంవత్సరానికి 20 సినిమాలు చేశాను ‘ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నానో, ప్రతిరోజూ ఇలాగే గడవనీ’ అని దేవుడికి దండం పెట్టుకుంటాను. మా కుటుంబం నుంచి ఎవ్వరూ నన్ను ప్రోత్సహిం^è కున్నా, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేశాను. నా కష్టాలు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. మూడు ప్రసవాలు జరిగినా కెరీర్ కు ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 20 సినిమాలు చేశాను. ఉదయమే దేవుడికి దండం పెట్టుకుని, కాఫీ, బ్రెడ్ తీసుకున్నాక, పేపర్ చదువుతాను. ఇప్పుడు కాఫీ మానేసి, వేడినీళ్లు, తేనె, శొంఠి పొడి, జీలకర్ర పొడి కలిపిన నీళ్లు తాగుతున్నాను. ఆరోగ్యకరమైన భోజనం తింటాను. ఎవరినీ బాధపెట్టను. గౌరవంగా, మర్యాదగా, తృప్తిగా బతకడానికి ఎంత డబ్బు కావాలో అంతే కావాలి అని కోరుకుంటాను. వీలైతే సహాయం చేస్తూంటాను. పబ్లిసిటీ, ఆర్భాటం ఇష్టం లేదు. ఇంటిపనే నాకు పెద్ద వ్యాయామం నాకు వంట బాగా అలవాటు. స్వీట్లలో అరిసెలు ఇష్టం. ఇవి తినాలంటే మిగిలినవి కట్ చేసేస్తాను. పెరుగు, అరటి పండు, ఒక కూర/పప్పు/ చారు/పులుసు ఏదో ఒకటి మాత్రమే. వెన్న, నెయ్యి, పాల వంటివి పరిమితంగా తింటాను. ఆరోగ్యకరమైన భోజనం çరోజుకొకసారి చాలు. ఆకలి లేకపోతే పండు తిని, మంచినీళ్లు తాగి పడుకుంటా. ఈ అలవాట్ల వల్ల నాకు సుగర్, బీపీలు లేవు. రెండు మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నాను. గుండె ఆపరేషన్ అయినా పని చేస్తూనే ఉన్నాను. సినిమాలు లేకపోయినా ఇంటి పనే నాకు పెద్ద వ్యాయామం. దేవుడి మీద భక్తి ఉంది. మూఢ నమ్మకాలు లేవు. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని భావిస్తాను. మాట వెనక్కు తీసుకుంటానన్నారు.. పుల్లయ్యగారి దర్శకత్వంలో ‘వెంకటేశ్వర మహాత్మ్యం’లో ఎరుకలసాని వేషం వేసే అవకాశం వచ్చింది. సాయంత్రం షూటింగ్ అయితే, మధ్యాహ్నం చెప్పారు. నేను భయపడ్డాను. పుల్లయ్యగారు ధైర్యం చెప్పి, నాకు ట్రయినింగ్ ఇచ్చారు. పదిహేను నిమిషాల పాత్ర. చెప్పింది చెప్పినట్లుగా నేర్చుకున్నాను. ఆ సినిమా చూసిన కె. వి. రెడ్డిగారు తన మాటను వెనక్కు తీసుకుంటాను అన్నారు. ఎంతో సంతోషించాను. అదే నాకు నిజమైన సినిమా అనుకుంటాను ఇప్పటికీ. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
112 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యం ఇదే
టోక్యో : ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన మసాజో నొనాకా మంగళవారం ప్రపంచ రికార్డుకెక్కారు. జూలై 25, 1905న జపాన్‌లోని హొక్కాయ్డోలో జన్మించిన మసాజో నూటపన్నెండేళ్ల వయస్సులో ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మసాజో ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు. ఆయన ఎక్కువగా స్వీట్లు తినడానికి ఇష్టపడతారని, వేడి నీళ్ల స్నానం అంటే ఆయనకు మక్కువని వారు తెలిపారు. ప్రస్తుతం వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికి ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు రాలేదని, ప్రతి రోజూ దినపత్రిక చదువుతారని వెల్లడించారు. స్పెయిన్‌కు చెందిన ఫ్రాన్సిస్కో న్యూజెన్ ఒలివెరా పేరు మీద ఉన్న ప్రపంచరికార్డు ఆయన మరణానంతరం మసాజోకు దక్కింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వయో వృద్ధులు ఉన్న దేశంగా జపాన్ పేరు గాంచింది. తమ దేశంలో దాదాపు 68000 శతాధిక వృద్ధులు జీవిస్తున్నారని జపాన్ ప్రభుత్వం గతంలో వెల్లడించింది. -
చిరకాలం సుఖీభవా!
పుస్తక పరిచయం వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉండే వ్యక్తుల గురించి తెలిసినప్పుడు వారు చెప్పే ఆరోగ్యరహస్యాలు తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. జాక్ లాలెన్ నుంచి కూడా అలాంటి రహస్యాలెన్నో తెలుసుకోవచ్చు. ‘హెల్త్ ఐకాన్’గా గుర్తింపు పొందిన జాక్ రాసిన ‘లివింగ్ యంగ్ ఫరెవర్’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. న్యూయార్క్‌టైమ్స్ బెస్ట్‌సెల్లింగ్ జాబితాలో చోటు చేసుకొంది.తొంభై ఆరు సంవత్సరాల జాక్, ఎక్కువ కాలం జీవించడానికి, సంతోషంగా జీవించడానికి అవసరమైన జీవనశైలిని గురించి ఈ పుస్తకంలో సులభంగా వివరించారు. జాక్ ఆరోగ్యరహస్యాలు చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ‘ఆయనకు మాత్రమే సాధ్యం’ అనుకున్న చాలామంది కూడా ‘మనకు కూడా సాధ్యమే’ అనే నమ్మకాన్ని ఈ పుస్తకం చదవడం ద్వారా సంపాదించుకున్నారు. మోటివేషన్, పర్సనల్ కేర్, వర్కవుట్, ఫైండ్ సమ్ ఎనర్జీ... ఇలా మొత్తం పన్నెండు విభాగాలుగా ఆయన తన రచన చేశారు.సంక్లిష్టమైన వాక్యాల జోలికి వెళ్లకుండా, స్కూల్ మాస్టర్ పిల్లలకు ఎలా అర్థమయ్యేలా చెబుతాడో అలా ఈ పుస్తకంలో ఆరోగ్యసంబంధమైన విషయాల గురించి పాఠకులకు చక్కగా తెలియజెప్పారు జాక్. ‘లివింగ్ యంగ్ ఫరెవర్’ నుంచి కొన్ని విషయాలు... - బరువు మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. అనవసరమైన బరువు ఆపదలకు మూలం. - ఎంత తింటున్నామనే లెక్కతో పాటు, ఏం తింటున్నామనేది కూడా ఆలోచించాలి. - నువ్వు ఏం తింటున్నావు అనేదానిపైనే...నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆధారపడి ఉంటుంది. - సమస్యలను అటకెక్కించి సుఖంగా నిద్రపోండి. నిద్ర పోవడం అంటే...మీ శరీరం మొత్తం రీచార్జ్ అవుతున్నట్లే కదా! - ప్రశాంతమైన ఆలోచనలు. ప్రశాంతజీవితానికి దారి చూపుతాయి. - ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చాం. ఈ ప్రపంచం నుంచి ఒంటరిగా వెళతాం. ఈ విషయంలో మనం చేయగలిగినది ఏమీ లేదు. కానీ రావడానికి, పోవడానికి మధ్య కాలంలో ప్రతి నిమిషం మనం చేయడానికి ఎంతో ఉంది. - ఎక్కువకాలం జీవించడం, సంపూర్ణ ఆరోగ్యం అనేవి దీవెనల మీద ఆధారపడవు. పూర్తిగా మన జీవనశైలి మీదే ఆధారపడి ఉంటాయి.