చిరకాలం సుఖీభవా!
పుస్తక పరిచయం
వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉండే వ్యక్తుల గురించి తెలిసినప్పుడు వారు చెప్పే ఆరోగ్యరహస్యాలు తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. జాక్ లాలెన్ నుంచి కూడా అలాంటి రహస్యాలెన్నో తెలుసుకోవచ్చు. ‘హెల్త్ ఐకాన్’గా గుర్తింపు పొందిన జాక్ రాసిన ‘లివింగ్ యంగ్ ఫరెవర్’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. న్యూయార్క్‌టైమ్స్ బెస్ట్‌సెల్లింగ్ జాబితాలో చోటు చేసుకొంది.తొంభై ఆరు సంవత్సరాల జాక్, ఎక్కువ కాలం జీవించడానికి, సంతోషంగా జీవించడానికి అవసరమైన జీవనశైలిని గురించి ఈ పుస్తకంలో సులభంగా వివరించారు.
జాక్ ఆరోగ్యరహస్యాలు చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ‘ఆయనకు మాత్రమే సాధ్యం’ అనుకున్న చాలామంది కూడా ‘మనకు కూడా సాధ్యమే’ అనే నమ్మకాన్ని ఈ పుస్తకం చదవడం ద్వారా సంపాదించుకున్నారు. మోటివేషన్, పర్సనల్ కేర్, వర్కవుట్, ఫైండ్ సమ్ ఎనర్జీ... ఇలా మొత్తం పన్నెండు విభాగాలుగా ఆయన తన రచన చేశారు.సంక్లిష్టమైన వాక్యాల జోలికి వెళ్లకుండా, స్కూల్ మాస్టర్ పిల్లలకు ఎలా అర్థమయ్యేలా చెబుతాడో అలా ఈ పుస్తకంలో ఆరోగ్యసంబంధమైన విషయాల గురించి పాఠకులకు చక్కగా తెలియజెప్పారు జాక్.
‘లివింగ్ యంగ్ ఫరెవర్’ నుంచి కొన్ని విషయాలు...
- బరువు మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. అనవసరమైన బరువు ఆపదలకు మూలం.
- ఎంత తింటున్నామనే లెక్కతో పాటు, ఏం తింటున్నామనేది కూడా ఆలోచించాలి.
- నువ్వు ఏం తింటున్నావు అనేదానిపైనే...నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆధారపడి ఉంటుంది.
- సమస్యలను అటకెక్కించి సుఖంగా నిద్రపోండి. నిద్ర పోవడం అంటే...మీ శరీరం మొత్తం రీచార్జ్ అవుతున్నట్లే కదా!
- ప్రశాంతమైన ఆలోచనలు. ప్రశాంతజీవితానికి దారి చూపుతాయి.
- ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చాం. ఈ ప్రపంచం నుంచి ఒంటరిగా వెళతాం. ఈ విషయంలో మనం చేయగలిగినది ఏమీ లేదు. కానీ రావడానికి, పోవడానికి మధ్య కాలంలో ప్రతి నిమిషం మనం చేయడానికి ఎంతో ఉంది.
- ఎక్కువకాలం జీవించడం, సంపూర్ణ ఆరోగ్యం అనేవి దీవెనల మీద ఆధారపడవు. పూర్తిగా మన జీవనశైలి మీదే ఆధారపడి ఉంటాయి.