సాక్షి, కొత్తకోట(చిత్తూరు) : జిల్లాలోనే కరువుకు పెట్టింది పేరు తంబళ్లపల్లె. వెంటాడే వరుస కరువు.. ఉపాధి కోసం ఊళ్లు విడిచి వెళ్లే జనం..ఇక్కడే కనిపిస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. అయితే తంబళ్లపల్లె అంటే దశాబ్దాల తరబడి రాజకీయ పోరు రాజుకుంటూనే ఉంది. ఇక్కడ ఎన్నికల్లో వర్గపోరు దే కీలకపాత్ర. ఏ ఎన్నిక జరిగినా..ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయం. వర్గరాజకీయాలే కాక, ఆధిపత్యం కోసం జరిగిన హత్యా రాజకీయాలకు ఎందరో బలయ్యారు.
1980–90 దశాబ్దాల మధ్య నడచిన రాజకీయ వర్గపోరుతో ఇక్కడి ప్రజ ల జీవితాలు భయంలోకి నెట్టబడ్డాయి. జీవనప్రమాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. ఆధిపత్యం చెలాయించడానికి జరిగిన రాజకీయ క్రీడలో ఎందరో బలయ్యారు. ఈ పరిస్థితుల్లో పీ పుల్స్‌వార్ ఉద్యమం తంబళ్లపల్లెలో పురుడు పో సుకుని నక్సల్ ఉద్యమానికి బీజం పడింది.
ఇదీ తంబళ్లపల్లె నియోజకవర్గం
రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఘన చరిత్రే ఉంది. కంటిచూపుతో రాజకీయాలు శాసించిన నేతలున్న నియోజకవర్గమిది. జిల్లాలో మారుమూలన, కర్ణాటక, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులోని ఈ నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు నడిచాయి. 1952లో తొలి నియోజకవర్గంగా బి.కొత్తకోట మండలంలోని గట్టు కేంద్రంగా ఏర్పడింది.
తర్వాత 1955లో తంబళ్లపల్లె కేంద్రంగా పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం మండలాలు, బి.కొత్తకోట మండలంలోని ఐదు పంచాయతీలతో నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో జరిగిన పునర్విభజనతో మదనపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం, బి.కొత్తకోట మండలంలోని మిగిలిన ఆరు పంచాయతీలను కలిపి ఆరు మండలాలతో తంబళ్లపల్లె నియోజకవర్గం ఏర్పాటు చేశారు.
టీఎన్, కలిచర్ల కుటుంబాలదే పైచేయి
నిత్య కరువు, వర్గపోరుకు నిలయమైన తంబళ్లపల్లె రాజకీయాల్లో టీఎన్, కలిచర్ల కుటుంబాలదే పైచేయి. తొలిసార్వత్రిక ఎన్నికలు 1952 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే పదవి విషయంలో వీరిమధ్యనే పోటీ. ఎమ్మెల్యే, రాజంపేట ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన చరిత్ర టీఎన్ కుటుంబానిదే. ఈ కుటుంబం నుంచి టీఎన్ రామకృష్ణారెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఈ కుటుంబీకులే గెలిచారు. ఒకసారి టీఎన్ కుటుంబం, ఒకసారి కలిచర్ల కుటుంబం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి ఎమ్మెల్యేలయ్యారు.
1983లో రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం ఉంటే తంబళ్లపల్లెలో టీఎన్.శ్రీనివాసులురెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఈ రెండు కుటుంబాల నడుమ 1978లో సాధారణ కుటుంబానికి చెందిన ఆవుల మోహన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఒకసారి, 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో అనిపిరెడ్డి వెంకట కుటుంబం నుంచి ఏవీ లక్ష్మీదేవమ్మ రెండుసార్లు, ఆమె తనయుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఒకసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు అయ్యారు. 1989 నుంచి తంబళ్లపల్లె రాజకీయాల ను శాసించి ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన టీఎన్ కుటుంబం, నాలుగుసార్లు ఎ మ్మెల్యేగా గెలుపొందిన కలిచర్ల కుటుంబం 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.
నక్సలిజానికి ఆజ్యం
నియోజకవర్గంలో 1980–90 దశాబ్దాల్లో నక్సలిజం పురుడు పోసుకుంది. జిల్లాలో పీపుల్స్‌వార్ కార్యకలాపాలు పుట్టింది ఇక్కడే. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తంబళ్లపల్లె మండలంలోని అన్నగారిపల్లెలో నక్సలైట్ల ధర్మగంట ఏర్పాటు ఒక అధ్యాయం. అన్యాయానికి గురైన వారు ఈ గంట మోగిస్తే రాత్రివేళల్లో అన్నలు పల్లెలోకి వచ్చి తీర్పులు ఇచ్చేవారు. భూ సమస్యలపై జరిగిన వివాదాల్లో ములకలచెరువు, తంబళ్లపల్లె మండలాల్లో నక్సలైట్లు, వారి వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన సంఘటనల్లో 13 మంది చనిపోయారు.
నక్సలైట్లకు వ్యతిరేకంగా చౌడసముద్రంలో రైతు, రైతు కూలీ సమన్వయ సంఘం ఏర్పాటైన తర్వాత వరుస హత్యలు జరిగాయి. పీపుల్స్‌వార్ దళాలు పేదలతో కలిసి చౌడసముద్రంపై జరిపిన దాడిలో ముగ్గురిని హతమార్చారు. పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శులుగా చౌడసముద్రం ఎల్‌వీ రమణ, కలిచర్లకు చెందిన కృష్ణప్ప, మల్లూరివాండ్లపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి పనిచేశారు. తర్వాత కృష్ణప్ప రాయలసీమ కార్యదర్శిగా పనిచేశారు. జొన్నచేనువారిపల్లె వేమనారాయణరెడ్డి పీపుల్స్‌వార్‌తో విభేదించి కొత్తగా పీపుల్స్‌వార్ విముక్తి పథం ఏర్పాటు చేశారు. 1984లో తంబళ్లపల్లె సమీపంలో జిల్లా వార్ ప్లీనరీలో కొండపల్లె సీతారామయ్య హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment