జగదల్‌పూర్: కాంగ్రెస్ పార్టీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్లపాలనలో వామపక్ష తీవ్రవాద ఘటనలు 52 శాతం మేర తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భగేల్ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన స్కాముల ప్రభుత్వంగా తయారైందని పేర్కొన్నారు. జగదల్‌పూర్, కొండగావ్‌లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడారు.
‘రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అర్ధించటానికే మీ ముందుకు వచ్చా. స్కాములకు పాల్పడటం ద్వారా గిరిజనుల డబ్బును దోచుకున్నవారిని తలకిందులుగా వేలాడదీస్తాం’అని ఆయన అన్నారు. బీజేపీకే ఓటు వేయాలని ప్రజలను కోరిన అమిత్ షా, ‘మీ ముందు రెండు అవకాశాలున్నాయి..ఒకటి నక్సలిజాన్ని ప్రోత్సహించే కాంగ్రెస్, మరోవైపు, ఈ బెడదను నిర్మూలించే బీజేపీ. కోట్లాది రూపాయల అవినీతి సొమ్మును ఢిల్లీ దర్బార్‌కు పంపే కాంగ్రెస్.. కోట్లాది మంది పేదలకు గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, రేషన్, ఇళ్లు అందజేస్తున్న బీజేపీ.
ఈ రెండింట్లో మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటారు?’అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు దీపావళి పండుగను ఈసారి మూడుసార్లు జరుపుకుంటారంటూ... మొదటిది దీపావళి రోజున, రెండోది డిసెంబర్ 3న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, మూడోది జనవరిలో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయ్యాక (శ్రీరాముడి మాతామహుల నివాసం ఛత్తీస్‌గఢ్ అని ప్రజల విశ్వాసం)అని అమిత్ షా చెప్పారు. ‘రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే, ఈ బెడద నుంచి పూర్తిగా విముక్తి కలి్పస్తాం. మోదీ ప్రభుత్వ పాలనలో 9 ఏళ్ల కాలంలో నక్సల్ సంబంధ హింస 52% తగ్గగా నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 62% మేర క్షీణించింది’అని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో జరిగే తీవ్రవాద సంబంధ హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయే పోలీసులైనా, పౌరులైనా, నక్సలైట్లయినా అందరూ గిరిజనులేనని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment