‘ప్రత్యేక’ విదర్భ అవసరం లేదు
Published Sat, Aug 17 2013 11:42 PM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ రాష్ట్రం వల్ల నక్సలైట్ల ప్రభావం పెరిగే అవకాశముందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్పాటుచేసిన ఛత్తీస్‌గడ్, జార్ఖంఢ్‌లలో పెద్ద ఎత్తున నక్సలైట్ల ప్రభావం పెరిగిందని గుర్తుచేశారు. చంద్రాపూర్ జిల్లా చిమూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ రాష్ట్రం అవసరం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ ఉద్యమం మరోసారి జోరుగా కొనసాగుతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక విదర్భ ఏర్పాటైతే నక్సలైట్ల ప్రభావం మరింత పెరుగుతుందన్నారు.
అభివృద్ధితోనే విదర్భకు మేలు..
ప్రత్యేక విదర్భ రాష్ర్ట ఏర్పాటు పెద్దగా అవసరం లేదని, అయితే అక్కడ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు నిర్వహించి విదర్భను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి జరిగితే విదర్భకు మేలు జరుగుతుందన్నారు. పుణే, ముంబైలతో పోలిస్తే విదర్భలో అభివృద్ధి కొంతమేర కుంటుపడిందని ఆయన అంగీకరించారు. ఈ కారణంతోనే ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేయమనడం సబబు కాదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విదర్భ కోసం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. సమైక్యంగా ఉంటేనే అందరికీ లాభమన్నారు. ఐక్యతే మహారాష్ట్ర అభివృద్ధికి ప్రధాన కారణమని తెలిపారు. కాగా, ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ ఉద్యమం మరోసారి జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ చవాన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై విదర్భ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement