Vidarbha state
-
టి.బిల్లుకు ఇరుసభల్లో మద్దతిస్తాం: మాయావతి
తెలంగాణ బిల్లుకు లోక్‌సభలోనూ... రాజ్యసభలోనూ మద్దతు ఇస్తామని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి మాయావతి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె న్యూఢిల్లీలో మాట్లాడారు. తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే చాలా కాలం నుంచి ప్రత్యేక రాష్ట్రంలో కావాలని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల విభజనపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందని ఆమె ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. -
‘విదర్భ’ కోసం ఏకం కండి
నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ ఎంపీ విలాస్ ముత్తెంవార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన విదర్భ ప్రాంతానికి చెందిన ఎమెల్మేల్యకు లేఖ రాశారు. ముంబై కేంద్రంగా విధాననిర్ణయాలు చేసేవారంతా విదర్భను నిర్లక్ష్యం చేస్తున్నారని అందులో ఆరోపించారు. ప్రత్యేక విదర్భ డిమాండ్‌కు బహిరంగ మద్దతు పలకాలని, ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలను కోరారు. విదర్భ ప్రాంత నాయకులు రాజకీయపరంగా ఎంతగానో సహకరించారని, అయితే అధినాయకత్వం ఏనాడూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనబరచలేదన్నారు. విదర్భ ప్రాంతానికి చెందిన నాయకులను కేవలం ద్వితీయ స్థానాలకే పరిమితం చేశారని, గుర్తింపులేని మంత్రి పదవులు కేటాయించారని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినందుకు ఈ ప్రాంతం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన తన లేఖలో ఆరోపించారు. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదని, తెలంగాణ కంటే పాతదని అన్నారు. అయితే తమ వైఖరిని బహిరంగంగా వెల్లడించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భ యపడ్డారని, అందువల్లనే ఈ డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఆరోపణలు సరికాదు మంత్రివర్గంలో లేనందువల్లనే తాను ప్రత్యేక విదర్భ రాష్ర్ట ఏర్పాటు డిమాండ్‌ను లేవనెత్తుకున్నానంటూ వచ్చిన ఆరోపణలను విలాస్ కొట్టిపారేశారు. విదర్భవాదాన్ని తలకెత్తుకున్నందుకు తాను ఎంతో నష్టపోయానని ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన విలాస్ విచారం వ్యక్తం చేశారు. కాగా వారం క్రితం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలు ఆచరణ సాధ్యం కాదని, పెద్ద రాష్ట్రాలే మేలని పేర్కొన్న సంగతి విదితమే. -
‘ప్రత్యేక’ విదర్భ అవసరం లేదు
సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ రాష్ట్రం వల్ల నక్సలైట్ల ప్రభావం పెరిగే అవకాశముందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్పాటుచేసిన ఛత్తీస్గడ్, జార్ఖంఢ్లలో పెద్ద ఎత్తున నక్సలైట్ల ప్రభావం పెరిగిందని గుర్తుచేశారు. చంద్రాపూర్ జిల్లా చిమూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ రాష్ట్రం అవసరం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ ఉద్యమం మరోసారి జోరుగా కొనసాగుతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక విదర్భ ఏర్పాటైతే నక్సలైట్ల ప్రభావం మరింత పెరుగుతుందన్నారు. అభివృద్ధితోనే విదర్భకు మేలు.. ప్రత్యేక విదర్భ రాష్ర్ట ఏర్పాటు పెద్దగా అవసరం లేదని, అయితే అక్కడ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు నిర్వహించి విదర్భను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి జరిగితే విదర్భకు మేలు జరుగుతుందన్నారు. పుణే, ముంబైలతో పోలిస్తే విదర్భలో అభివృద్ధి కొంతమేర కుంటుపడిందని ఆయన అంగీకరించారు. ఈ కారణంతోనే ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేయమనడం సబబు కాదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విదర్భ కోసం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. సమైక్యంగా ఉంటేనే అందరికీ లాభమన్నారు. ఐక్యతే మహారాష్ట్ర అభివృద్ధికి ప్రధాన కారణమని తెలిపారు. కాగా, ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ ఉద్యమం మరోసారి జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ చవాన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై విదర్భ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.