బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి
తెలంగాణ బిల్లుకు లోక్సభలోనూ... రాజ్యసభలోనూ మద్దతు ఇస్తామని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి మాయావతి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె న్యూఢిల్లీలో మాట్లాడారు. తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను కూడా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే చాలా కాలం నుంచి ప్రత్యేక రాష్ట్రంలో కావాలని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు.
ఇరు రాష్ట్రాల విభజనపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందని ఆమె ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.