నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ ఎంపీ విలాస్ ముత్తెంవార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన విదర్భ ప్రాంతానికి చెందిన ఎమెల్మేల్యకు లేఖ రాశారు. ముంబై కేంద్రంగా విధాననిర్ణయాలు చేసేవారంతా విదర్భను నిర్లక్ష్యం చేస్తున్నారని అందులో ఆరోపించారు. ప్రత్యేక విదర్భ డిమాండ్‌కు బహిరంగ మద్దతు పలకాలని, ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలను కోరారు. విదర్భ ప్రాంత నాయకులు రాజకీయపరంగా ఎంతగానో సహకరించారని, అయితే అధినాయకత్వం ఏనాడూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనబరచలేదన్నారు.
విదర్భ ప్రాంతానికి చెందిన నాయకులను కేవలం ద్వితీయ స్థానాలకే పరిమితం చేశారని, గుర్తింపులేని మంత్రి పదవులు కేటాయించారని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినందుకు ఈ ప్రాంతం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన తన లేఖలో ఆరోపించారు. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదని, తెలంగాణ కంటే పాతదని అన్నారు. అయితే తమ వైఖరిని బహిరంగంగా వెల్లడించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భ యపడ్డారని, అందువల్లనే ఈ డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదన్నారు.
ఆరోపణలు సరికాదు
మంత్రివర్గంలో లేనందువల్లనే తాను ప్రత్యేక విదర్భ రాష్ర్ట ఏర్పాటు డిమాండ్‌ను లేవనెత్తుకున్నానంటూ వచ్చిన ఆరోపణలను విలాస్ కొట్టిపారేశారు. విదర్భవాదాన్ని తలకెత్తుకున్నందుకు తాను ఎంతో నష్టపోయానని ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన విలాస్ విచారం వ్యక్తం చేశారు. కాగా వారం క్రితం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలు ఆచరణ సాధ్యం కాదని, పెద్ద రాష్ట్రాలే మేలని పేర్కొన్న సంగతి విదితమే.
‘విదర్భ’ కోసం ఏకం కండి
Published Fri, Aug 23 2013 11:52 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement