
తెలంగాణతో నక్సలిజం పెరగదు: డీజీపీ
పోలీసు శాఖలో రాజకీయ జోక్యాన్ని అధిగమిస్తాం: డీజీపీ
ఏటూరునాగారం, న్యూస్‌లైన్: అభివృద్ధి చెందిన చోట నక్సలిజం ఉండదని డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించటంతోపాటు ఆయన జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి వనరులు, యువతకు చేతినిండా పని లభిస్తే నక్సలిజం అనేది ఉండదన్నారు.
నక్సల్స్ గోదావరి అవతలి వైపు అభయారణ్యంలో అడుగు పెట్టవచ్చని, వారు పూర్తిగా లేరని చెప్పలేమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ వ్యవస్థ పెరగకపోవచ్చని, ఒకవేళ ఎక్కువగా ఉంటే అణచివేసేందుకు పోలీస్‌శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. పోలీసు శాఖలో రాజకీయ ప్రమేయం సాధారణమేనని, దానిని అధిగమించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా ఆయన సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.