కొందరు చూడటానికి ఎంతో శుభ్రంగా ఉంటారు. ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. అయితే పరిసరాల పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోరు. ఇల్లు మురికిగా ఉండి, వ్యక్తి మాత్రం శుభ్రంగా ఉన్నా; ఇల్లు, ఇంట్లోని మనుషులు మాత్రమే పరిశుభ్రంగా ఉండి పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. అనారోగ్యం, అంటువ్యాధులు పొంచే ఉంటాయి. ఇంతకీ పరిసరాల పరిశుభ్రత అంటే ఏమిటో, పరిసరాలను ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చూద్దాం.
పరిసరాల పరిశుభ్రత అంటే ఇంటికి చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ చెత్తాచెదారం, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవడమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మురికిగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయడం కంటే.. హానికారక సూక్ష్మజీవులను నిరోధించడంపై దృష్టిపెట్టడం చాలా మేలని పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం
.
సరైన సమయానికి చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఫ్లోర్‌ని తుడవటం ఆరోగ్యవంతమైన వాతావరణానికి కీలకం. అయితే, ప్రతి నలుగురిలో ఒకరు మాత్రం వీటికి ప్రాధాన్యం లేదని భావిస్తున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. .
మురికి, క్రిములు, శుభ్రత, ఆరోగ్యవంతంగా ఉండడానికి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. ఒక సర్వే మేరకు 23 శాతం మంది.. హానికారక సూక్ష్మ క్రిముల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారని తేలింది. అయితే, వారి నమ్మకంలో ఏమాత్రం నిజం లేదు. హానికారక సూక్ష్మక్రిములుండే పరిసరాలలో మెసలడం వల్ల్ల పిల్లలు ప్రమాదకరమైన అంటురోగాల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.
దానికి బదులు, ఆయా ప్రదేశాలను శుభ్రం చేయడంపై దృష్టి పెట్టాలని, అవి శుభ్రంగా కనిపించినప్పటికీ తగిన శ్రద్ధ పెట్టి ఎలాంటి క్రిములూ లేకుండా చూడాలని, అప్పుడే హానికారక సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
శుభ్రత అంటే మురికి లేకుండా చేయడం. ఆరోగ్యవంతంగా పరిసరాలను ఉంచుకోవడం అంటే మురికితోపాటు రోగకారక క్రిములను అరికట్టడం. తద్వారా అంటువ్యాధులు సోకకుండా చూసుకోవడం. ముఖ్యంగా ఆహారాన్ని తయారు చేసేప్పుడు, మరుగుదొడ్డి వాడేప్పుడు, పెంపుడు జంతువులతో గడిపేటప్పుడు ఇది చాలా ముఖ్యం.
ఆరుబయట స్నేహితులు, కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులతో గడపడం, ఆడుకోవడంతో ‘మంచి బ్యాక్టీరియా’ను పొందవచ్చు. ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల్ని పెంపొందించుకోవచ్చు. కానీ, అదే సమయంలో ప్రజలు చెడు బ్యాక్టీరియా బారిన పడకుండా చూసుకోవడం కూడా అంతే కీలకం.
‘‘పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల్ని నియంత్రించవచ్చు. ఇది చాలా సులభమైన, చౌక అయిన వ్యవహారం. ఇంట్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడం ద్వారా అంటురోగాలను తగ్గించొచ్చు. తద్వారా పిల్లల్ని రక్షించుకోవడంతో పాటు, ఆసుపత్రులపై ఒత్తిడిని కూడా తగ్గించవచ్చు’’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటిని మాత్రమే కాదు, ఇంటి పరిసరాలలో ఎక్కడైనా మురికిగుంటలు, చెత్తకుప్పలు, అపరిశుభ్ర వాతావరణం ఉంటే దానిపై దృష్టి పెట్టాలి. శ్రమ అనో, ఖర్చనో అనుకోకుండా చెత్తను క్లీన్ చేయాలి లేదా చేయించాలి. కొంతమంది తమ ఇంటిలోని చెత్తనంతటినీ తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పడేస్తుంటారు. క్రమేణా అవి చెత్తకు, ఆ తర్వాత అపరిశుభ్రతకు, అంటువ్యాధులకు ఆనవాళ్లుగా మారతాయి. అందువల్ల సంబంధిత శాఖ వాళ్లకు చెప్పి ఆ చెత్తను క్లీన్ చేయించాలి. అలాగే మురికిగుంటలపై కూడా దృష్టి సారించాలి. బ్లీచింగ్ పౌడర్ వేయాలి. పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి.
చెత్తను, తడిచెత్త, పొడిచెత్తగా వేరు చేసి పడెయ్యడం, గాజుపెంకులు, ప్లాస్టిక్, పాలిథిన్ కవర్ల వంటి వాటిని విడిగానూ పడెయ్యాలి. ఇలాంటి వాటన్నింటినీ బాధ్యతగా చేసినప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సూక్ష్మక్రిములు, తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము.
ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి?
►ఆహారాన్ని తయారు చేసే వంట శాలలు, వడ్డించే ఆహార శాలలు ప్రాంతాలు (డైనింగ్ హాల్స్)
►మరుగుదొడ్లు, వాటిని వాడిన తర్వాత చేతులు, ఇల్లు, వంటగదిలో ఉండే మురికి బట్టలు, మసిగుడ్డలు.
►పెంపుడు జంతువులతో ఉన్నప్పుడు.
►ఎవరైనా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కును చీదేటప్పుడు.
►చెత్త, వ్యర్థాలను చేత్తో తాకినప్పుడు, పారేసేటప్పుడు.
►అంటువ్యాధి సోకిన వారికి సపర్యలు చేసేప్పుడు శుభ్రత పాటించడం అత్యవసరం.
►మాంసం వంటి వంటకాలు చేసినప్పుడు వంటగదిలోని నేలను, దిమ్మల్ని, మాంసం కోసిన చెక్క/బోర్డుల్ని శుభ్రం చేయడం చాలా కీలకం.
►అలాగే, శాండ్‌విచ్‌లు, చిరుతిళ్లు తయారు చేసేముందు కూడా ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి.
►కలుషితమైన ప్రదేశాన్ని, పాత్రల్ని శుభ్రం చేశాక ఆయా గుడ్డలు, స్క్రబ్‌లను, బ్రష్‌లను కడగాలి. ఎందుకంటే ఇంట్లో నేలపైన, కుర్చీలు, బల్లల వంటి ఫర్నీచర్‌పైన పేరుకుపోయిన దుమ్ములో ఉండే క్రిములతో పోల్చితే ఇవి చాలా వరకు ఆరోగ్యానికి ఎక్కువ హాని చేకూర్చేవి కాబట్టి.
బ్యాక్టీరియా ఎలా పోతుంది?
►ఇంట్లో నేలను కానీ, పాత్రల్ని కానీ వేడిగా ఉన్న సబ్బు నీటితో కడగడం ద్వారా బ్యాక్టీరియాను తొలగించవచ్చు. ఆ బ్యాక్టీరియా నీటితో పాటు కొట్టుకుపోతుంది. అయితే బ్యాక్టీరియాను పూర్తిగా చంపాలంటే మాత్రం నీటిని 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొద్దిసేపు మరిగించాలని ఆహార ప్రమాణాల సంస్థ చెబుతోంది.
►ఆహారాన్ని తయారు చేసిన తర్వాత నేలను, రాతి దిమ్మెలను శుభ్రం చేయడానికి గుడ్డకు బదులు పేపర్ టవల్స్ వాడి చూడండి. ఇలా చేయడం వల్ల వంటగదిలో ఉపయోగించే గుడ్డలు అపరిశుభ్రం కాకుండా, కలుషితం కాకుండా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment