సాక్షి, అమరావతి: పర్యావరణహిత క్లీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. గ్రీన్ హైడ్రోజన్, బయో ఇథనాల్ తయారీ ప్లాంట్లను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ కారిడార్ ఏపీలో విస్తరించి ఉందని.. దీన్ని వినియోగించుకుంటూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న మూడో ‘గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా’ సదస్సులో గురువారం ప్రవీణ్ పాల్గొన్నారు.
దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో పారిశ్రామిక పార్కులు, పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పారిశ్రామిక పార్కుల ద్వారా తక్షణమే పెట్టుబడులు పెట్టడానికి 13,772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పెట్రో కెమికల్స్ రంగంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, కెయిర్న్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, టాటా కెమికల్స్ తదితర దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బయో ఇథనాల్‌కు ఏపీ హబ్‌గా మారిందని ప్రవీణ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్.. సౌదీ అరేబియా బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ జనార్దన్ రామాంజనేయులు, సుర్బానా జురాంగ్ డైరెక్టర్ డెన్నీస్ టాన్, దీపక్ నైట్రేట్ సీఎండీ దీపక్ సీ మెహతా, నయారా ఎనర్జీ ప్రెసిడెంట్ దీపక్ అరోరా, బేయర్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీటిలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment