డ్యూటీ సమయంలో బుద్ధిగా కూర్చుని తమ పని తాము చేసుకుని సమయం అయిపోగానే ఇంటికి వెళ్లిపోయే అధికారులు కొందరయితే, ఆఫీసు పని వేళల తరవాత కూడా పని గురించి ఆలోచించి వినూత్న నిర్ణయాలతో అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు మరికొందరు.
ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే జార్ఖండ్ ఫారెస్ట్ అధికారి మమతా ప్రియదర్శి. పర్యావరణం గురించి అవగాహన కల్పించడంతో పాటు జంతువులకు మనుషులకు మధ్యన సంధి కుదురుస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.
జంషెడ్‌పూర్ డివిజినల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేస్తోంది మమతా ప్రియదర్శి. ఫారెస్ట్ అధికారిగా అడవులను సంరక్షించడంతో పాటు పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. ప్రకృతి ప్రాముఖ్యత, కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ రేపటి పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు.
వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులు, నీటి సంరక్షణ, మనుషులు– జంతువుల మధ్య ఏర్పడే సంఘర్షణలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రకాల డాక్యుమెంటరీలను ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా 347 గ్రామాలు, వివిధ స్కూళ్లలో ప్రదర్శించిన డాక్యుమెంటరీలతో రెండున్నర లక్షలమందికిపైగా అవగాహన కల్పించింది. వ్యాన్‌కు పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి చెబుతున్నారు.
ఈ కార్యక్రమం గురించి ఆమె మాటల్లోనే...
‘‘ఈ మధ్యకాలంలో తరచూ అడవుల్లో మంటలు రేగి చాలా వృక్షాలు కాలిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. అసలు అడవులు ఎందుకు తగలబడుతున్నాయో కూడా ఈ చుట్టుపక్కల నివసిస్తోన్న చాలామందికి తెలీదు. ఏనుగులకు, మనుషులకు మధ్య తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వాటన్నింటిని అధిగమించడానికి తీసుకొచ్చిందే ఈ కార్యక్రమం.
అందుకే ఆడియో–వీడియో
జంతువులకు ఎలాగూ అర్థం చేయించలేము. మనమే అర్థం చేసుకుని వాటికి అడ్డు తగలకుండా, మూగజీవాలు మనకి ఇబ్బంది కలిగించకుండా మనమే సర్దుకుపోవాలి. అందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ... కూర్చోబెట్టి చెపితే ఎవరూ వినరు. అందుకే ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి వారి ఆసక్తిని ఇటు మళ్లిస్తున్నాం. కొంతవరకైనా గుర్తుపెట్టుకుని పాటిస్తారు. ఈ డాక్యుమెంటరీలలో నాలుగు విభిన్న అంశాలపై వీడియోలు ప్లే చేస్తున్నాం.
మనుష్యులు– జంతువుల సంఘర్షణ మొదటిది, రెండో వీడియోలో అడవులు తగలబడినప్పుడు ఏం చేయాలి... మూడో అంశంగా కర్బన ఉద్గారాలు విడుదలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. నాలుగో అంశం మొక్కల పెంపకం, మొక్కలను ఎలా కాపాడాలి, నీటిసంరక్షణ గురించి సరళమైన భాషలో చెబుతున్నాం. వీటివల్ల విద్యార్థులు, గ్రామస్థులకు సులభంగా అర్థమవుతుంది.
స్కూళ్లు, పబ్లిక్ ప్లేసుల్లో..
ఇప్పటిదాకా స్కూళ్ళతో పాటు, గ్రామాల్లోని పబ్లిక్ పేసుల్లో వ్యాన్ వీడియోలు ప్లేచేసి వీలైనంత అవగాహన కల్పించాం. పాఠ్యపుస్తకాల్లో సిలబస్ కాకుండా కొత్త విషయాలు తెలుసుకున్నందుకు వాళ్లు చాలా సంతోషపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment