పర్యావరణమే ప్రాణం! | Suresh Gupta is spreading awareness about handloom and organic farming | Sakshi
Sakshi News home page

పర్యావరణమే ప్రాణం!

Published Fri, Apr 7 2023 3:52 AM | Last Updated on Fri, Apr 7 2023 8:54 AM

Suresh Gupta is spreading awareness about handloom and organic farming - Sakshi

పర్యావరణ పరిరక్షణ కోసం నల్లగొండ పట్టణానికి చెందిన మిట్టపల్లి సురేశ్‌ గుప్తా విశేష కృషి చేస్తున్నారు. ఉద్యోగాన్ని వదిలేసి, కుటుంబాన్ని పక్కన పెట్టి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి క్షణం పని చేస్తున్నారు. ఉదయం 5 గంటలకు లేచి, మార్కెట్‌కు వెళ్లి, అక్కడ ప్లాస్టిక్‌ కవర్లతో ఎవరు ఎదురుపడినా, వారికి ఓ జూట్‌ బ్యాగ్‌/క్లాత్‌ సంచి ఇవ్వడంతో ఆయన దిన చర్య ప్రారంభం అవుతుంది. ఇక పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే వారిని శాలువాతో సత్కరించడం ఆయన ప్రత్యేకత.

అంతేకాదు భూగర్భ జలాల పెంపునకు సొంతంగా ఇంకుడు గుంతలు తవ్వించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, చేనేత వస్త్రాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గుప్తా పని చేస్తున్నారు. తాను కూడా చేనేత బనియన్, దోవతి ధరించడం ప్రారంభించారు. ఇవన్నీ చేస్తున్న ఆయనేం కోటీశ్వరుడు కాదు. ఉద్యోగాలు చేయగా వచ్చిన డబ్బునంతా లక్ష్యం కోసమే ఖర్చు చేశారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను భార్యకు అప్పగించి.. దాతలను వెతికి, సమయానికి దొరక్కపోతే అప్పు చేసి మరీ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 

మలుపు తిప్పిన సంఘటన
2008లో ఒక ఆవు చెత్త కుప్పలో వేసిన ఆహార పదార్థాలతో పాటు ప్లాస్టిక్‌ కవర్లను తినడం గుప్తా చూశారు. ఆ ఆవుకు ఆపరేషన్‌ చేసినప్పుడు కడుపు నిండా ప్లాస్టిక్‌ కవర్లు ఉండటం చూసి చలించిపోయారు. ప్లాస్టిక్‌ వల్ల జీవరాశికి ప్రమాదం పొంచి ఉందని అప్పుడే గ్రహించారు. దాని వాడకాన్ని తాను నిషేధించలేను కాబట్టి  కనీసం వినియోగాన్ని అయినా తగ్గించేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. నాటి నుంచి ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలంటూ ఎక్కడ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు జరిగినా,  పండుగలు జరిగినా అక్కడికి వెళ్లి ప్లాస్టిక్‌ను వాడొద్దని ప్రచారం చేయడం ప్రారంభించారు. 

ఉద్యోగాన్ని వదిలేసి..
1999లో నల్లగొండలో ఇంటర్నెట్‌ సెంటర్‌ నడుపుతున్న సురేశ్‌ గుప్తా వద్దకు ఏపీఆర్‌ఎల్‌పీ ప్రాజెక్టు ఉద్యోగులు వస్తుండేవారు. తర్వాత తమ ప్రాజెక్టులో పని చేసేవారు కావాలని వారు గుప్తాను తీసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం హైదరాబాద్‌కు రావాలని చెప్పడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత నల్లగొండలోనే ఒకటి రెండు ఉద్యోగాలతో పాటు 2013 నుంచి 2017 వరుకునల్లగొండ సుధా బ్యాంకు మేనేజర్‌గా పని చేశారు.

పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తూనే ఈ ఉద్యోగాలన్నీ చేశారు. అయితే తాను చేస్తున్నది సరిపోదని, ఈ దిశగా మరింత కృషి చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి, పూర్తిగా పర్యావరణ  పరిరక్షణకే జీవితాన్ని అంకితం చేశారు. 

నీటి పరిరక్షణపైనా శ్రద్ధ
ఓసారి ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన.. వర్షపు నీరు వృథాగా పోతుండటాన్ని గమనించి సొంత డబ్బులతో ఇంకుడు గుంతలను తవ్వించారు. భవిష్యత్‌ అవసరాలకు నీటిని పరిరక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అంతేకాదు జీవనోపాధి కరువైన చేనేత కార్మికులను ఆదుకోవాలని, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో పని చేయడం ప్రారంభించారు. ఇందుకు తానే ఓ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. మరోవైపు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. 

ప్లేటు, గ్లాసు సంచిలోనే..
ఎక్కువ ప్రాంతాల్లో తిరుగుతూ పర్యావరణంపై ప్రచారం చేసేందుకు మోటారు సైకిల్‌ వాడక తప్పడం లేదు. అది వెలువరించే పొగతో వాతా­వరణం కలుషితం అవుతోంది. అందుకే నాకు నేనే శిక్ష వేసుకున్నా. చెప్పులు లేకుండా తిరగా­లని నిర్ణయించుకున్నా. ఇక నేను తినే ప్లేటు, నా గ్లాసు నా సంచిలోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా నా ప్లేట్‌లోనే భోజనం చేస్తా. పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పని చేస్తా.  – మిట్టపల్లి సురేశ్‌ గుప్తా

షాక్‌ తగిలినా..కోలుకుని..
సురేశ్‌ గుప్తా తన కుటుంబ బాధ్యతను పూర్తిగా గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేసే తన భార్య కల్పనపైనే మోపారు. ఆ విధంగా దొరుకుతున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, తనకు ఆహ్వానం లేకపోయినా అక్కడికి వెళ్లిపోయేంత ప్రేమికుడిగా మారిపోయారు. అయితే 2018 మే 22వ తేదీన రోజున జరిగిన ఓ సంఘటన తన కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తుతుందని ఆయన ఊహించలేదు.

వార్షిక పరీక్షల చివరి రోజు కావడంతో ఇంజనీరింగ్‌ చదువుతున్న పెద్ద కుమారుడు ప్రణీత్‌ను తీసుకువచ్చేందుకు హైదరాబాద్‌కు బయలుదేరిన గుప్తా.. అతని వద్దకు వెళ్లకుండా స్థానికంగా వరల్డ్‌ ఎర్త్‌ డే కార్యక్రమం వద్దే ఆగిపోయారు. అదే సమయంలో కొడుక్కి యాక్సిడెంట్‌ అయిందని, చనిపోయాడని ఫోన్‌ వచ్చింది. ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి గుప్తాతో పాటు కుటుంబానికి చాలా రోజులు పట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement