పర్యావరణంతోనే సమస్త జీవుల మనుగడ ముడిపడి వున్నదని ప్రపంచమంతా గుర్తించి దాని పరిరక్షణకు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టి అయిదు దశాబ్దాలవుతోంది. కానీ ఇప్పటికీ అది వివాదాస్పద అంశమే. కాలుష్యం వల్ల వాతావరణం నాశనమై పర్యావరణం దెబ్బతింటోందని హరిత ఉద్యమకారులు... మరి అభివృద్ధి మాటేమిటని పాలకులు మాటల యుద్ధం సాగిస్తున్నారు. అమెరికా మొదలుకొని ఆఫ్రికా వరకూ ప్రపంచంలో అన్నిచోట్లా ఈ వాదవివాదాలు రివాజే. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) నోటిఫికేషన్ ముసాయిదాను విడుదల చేసి దానిపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. ఈ నెల 11తో దాని గడువు ముగి సింది. తమకు దరిదాపు 17 లక్షల అభిప్రాయాలొచ్చాయని, వాటిని కూడా పరిశీలించి తుది ముసా యిదాను రూపొందిస్తామంటోంది ఆ శాఖ. మన దేశంలో తొలి ఈఐఏ 1994లో వస్తే, 2006లో దాన్ని సవరించి మరొకటి రూపొందించారు. రెండు సందర్భాల్లోనూ ఇప్పటితో పోలిస్తే తక్కువ మందే వాటిపై స్పందించారు.
సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల ఈసారి పరిస్థితి మారింది. అత్యధిక సంఖ్యాకులు అందులో పాల్గొన్నారు. ఇదంతా ఏ స్థాయిలో వుందంటే ఈఐఏపై స్పందించమని ఆన్‌లైన్ ఉద్యమం మొదలుపెట్టిన పర్యావరణ బృందం ‘ఫ్రై డేస్ ఫర్ ఫ్యూచర్’ (ఎఫ్‌ఎఫ్‌ఎఫ్)కు ఢిల్లీ పోలీసుల నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద నోటీసు కూడా వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ పోలీస్ విభాగం ఏమనుకుందో ఏమో... అది ‘పొరపాటు’గా వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. కానీ ఆపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద నోటీసు పంపింది. అనంతరం దాన్ని కూడా ఉపసంహరించుకుంది. ఈ నోటీసుల ప్రహసనం సాగుతుండగానే ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ వెబ్ సైట్‌తోపాటు మరో రెండు సంస్థల వెబ్‌సైట్లు నిలిచిపోయాయి. ఈ కప్పగంతు లెందుకో ఢిల్లీ పోలీ సులు చెబితే తప్ప తెలిసే అవకాశం లేదు. కానీ ఈ ముసాయిదా ఆమోదిస్తే పర్యావరణంపై కలిగే దుష్ఫలితాల గురించి జనాన్ని చైతన్యవంతం చేయడంలో, దానిపై ఎక్కువమంది స్పందించేలా చూడ టంలో ఆ సంస్థ విజయం సాధించిందని నోటీసుల వ్యవహారం వెల్లడిస్తోంది.
తాజా ముసాయిదాపై అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు రెండూ వున్నాయి. గనులు, ఆనకట్టలు, పరిశ్రమలు తదితరాలకు అవసరమయ్యే సహజవనరులు...అంటే భూమి, నీరు, అడవులు వినియోగించుకోవడానికి అనుమతులు మంజూరు చేసే చట్టబద్ధమైన ప్రక్రియను ఈఐఏ నిర్ణయిస్తుంది. మన దేశంలో తొలి ఈఐఏ పుట్టుక ఎప్పుడు జరిగిందో గుర్తుంచుకుంటే ఇది ఏ ఉద్దేశంతో వచ్చిందో తెలుస్తుంది. దేశం ప్రపంచీకరణ విధానాలను అనుసరించడం మొదలుపెట్టి ప్రధాన ఉత్పత్తి రంగాల్లో ప్రైవేటు సంస్థలకు పెద్ద పీట వేయడం ప్రారంభించిన తొలినాళ్లలో మొదటి ఈఐఏ వచ్చింది. సహజ వనరుల్ని అవి పరిమితంగా వాడుకునేలా నియంత్రించడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ఈఐఏను పాటించే ఉత్పాదక సంస్థలకే అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి అప్పు పుడుతుంది గనుక అన్ని సంస్థలూ అనుసరించక తప్పని స్థితి వచ్చింది. సారాంశంలో సహజ వనరుల్ని కాపాడి, పర్యావరణ హితమైన అభివృద్ధికి బాటలు పరచవలసిన ఈఐఏ ఆ పని సమర్థవంతంగా చేస్తున్నదా లేదా... అది ప్రజాహితంగా వున్నదా, వారి ప్రయోజనాలకు చేటు తెస్తున్నదా అనేవి ప్రధాన ప్రశ్నలు.
అది మరో రూపంలో ప్రపంచీకరణకు ముందున్న ‘పర్మిట్ రాజ్’ను ప్రవేశపెట్టిందని పారిశ్రామికవేత్తలు ఆరోపిస్తుంటే, పర్యావరణ విధ్వంసాన్ని చట్టబద్ధం చేస్తున్నదని ఉద్యమకారులు నిందిస్తున్నారు. ఈఐఏతో వచ్చే చిక్కేమిటంటే అది పూర్తి అర్థంలో చట్టం కాదు. చట్టమే అయితే దానికి సవరణలు చేసినప్పుడల్లా పార్లమెంటరీ నిఘా వుంటుంది. విపక్షాలకు ప్రశ్నించే అవకాశం, నిలువరించే అవకాశం వస్తాయి. అందులో ఇమిడివుండే ప్రమాదాలు దేశ ప్రజ లందరికీ తెలుస్తాయి. కానీ ఈఐఏకు చడీచప్పుడూ లేకుండా ఇష్టానుసారం సవరణలు చేయడం ప్రభుత్వాలకు అత్యంత సులభం. దీనిపై పార్లమెంటరీ సబ్ కమిటీ కన్నుంటుందిగానీ, ఎక్కువసార్లు దానికి కూడా తెలియకుండా అంతా సాగిపోతూ వుంటుంది.
దేశమంతా కరోనా మహమ్మారి గుప్పెట్లో చిక్కుకున్న సమయంలో ఈఐఏ ముసాయిదా తీసుకురావడం సరికాదు. దానిపై లక్షలమంది ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు చెప్పివుండొచ్చు. వాటిపై అధికారులు కూర్చుని తోచిన మార్పులు చేయొచ్చు. కానీ ఇది సరిపోదు. ఎవరో ఇంగ్లిష్ తెలిసిన వారు, ఆన్‌లైన్‌లో పంపగలిగినవారు అభిప్రాయాలు ప్రకటిస్తే చాలదు. దానిపై అన్ని వర్గాలూ, పక్షాలూ చర్చించాలి. ముసాయిదా అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రచురించాలి. ముఖ్యంగా సహజ వనరులు కేంద్రీకృతమైవుండే ఆదివాసీ ప్రాంతాల్లో విస్తృత చర్చ జరగాలి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల ప్రయత్నం అక్కడ ఎంత కల్లోలం సృష్టించిందో మన కళ్లముందే వుంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అక్కడి ఆదివాసీల ఆకాంక్షలకు అను గుణంగా ఆ అనుమతుల్ని రద్దు చేసింది.
ఇటువంటి కీలకాంశాలపై మన చలనచిత్ర నటులు మాట్లాడరుగానీ... తమిళ హీరోలు సూర్య, కార్తీ స్పందించారు. ఈ ముసాయిదా మన ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తగిన అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టవచ్చునని ముసాయిదాలో ఇస్తున్న మినహాయింపు ఉల్లంఘనలను ప్రోత్స హించడమే అవుతుంది. అలాగే ఏ ప్రాజెక్టుపైన అయినా బహిరంగంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించ డానికి ఇప్పుడుండే 30 రోజుల పరిమితిని, 20 రోజులకు కుదించారు. ప్రజల జీవికతో ముడిపడి వుండే వ్యవసాయ భూముల్ని ప్రాజెక్టుల కోసం తీసుకునే ప్రక్రియను ఆదరాబాదరాగా పూర్తయ్యేలా రూపొందించడం సరికాదు. ఒకపక్క పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని అంతర్జాతీయ సద స్సుల్లో చెబుతూ, దానికి విరుద్ధమైన విధానాలు అమల్లోకి తీసుకురావడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment