ఇప్పుడంతా ఎటుచూసినా మాస్కులు ధరించిన ముఖాలే కనిపిస్తున్నాయి. ఈ భూమి మీద ఉన్న దాదాపు తొంబై శాతం జనాభా మాస్కు లేకుండా బయటికి రావడం లేదు. ఇంతమంది ఒక్కసారి మాస్కు పెట్టుకోవాలంటే ఎన్ని మాస్కులు కావాలో కదా! అటువంటిది ఒక్కొక్కరి దగ్గర సగటున కనీసం ఐదారు మాస్కులైనా ఉంటాయి. కోట్లలో ఉత్పత్తి అవుతోన్న మాస్కులు కరోనాను అడ్డుకుంటున్నప్పటికీ పర్యావరణానికి మరో కోణంలో ముప్పుగా పరిణమిస్తున్నాయనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈ విషయాన్నీ నిశితంగా గమనించిన డచ్ గ్రాఫిక్ డిజైనర్ మరియాన్నే డీ గ్రూట్‌పోన్స్ పర్యావరణానికి ఎటువంటి హానీ తలపెట్టని మాస్కులను ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు.
మరియాన్నేకు వచ్చిన వినూత్న ఐడియాతో వందశాతం మట్టిలో కరిగిపోయే ‘మేరీ బీ బ్లూమ్’ మాస్కులను రూపొందిస్తున్నారు. వీటిని వాడిన తరువాత మట్టిలో పాతితే అందమైన పువ్వులు కూడా పూస్తాయట. నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ నగరానికి చెందిన మరియాన్నే స్వతహాగా గ్రాఫిక్ డిజైనర్ అయినప్పటికీ రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. కరోనా కాలు పెట్టిన తరువాత ప్రపంచవ్యాప్తంగా సర్జికల్ మాస్కులు వాడిపారేయడం వల్ల మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది.
దీన్ని ఎలాగైనా తగ్గించాలనుకున్న ఆమె మనం రోజూ అన్నం రూపంలో తీసుకునే బియ్యంతో మొదట పేపర్ తయారు చేసి దానిలో డచ్ గడ్డిమైదానంలో పెరిగే వివిధ రకాల పూలమొక్కల విత్తనాలు నింపుతారు. ఈ మాస్కులు సాధారణ మాస్కుల్లాగా వాడిన తరువాత ఎక్కడైనా పారేసినాగానీ, లేదా కాస్త చిన్నపాటి గుంతలో పడేసినా అవి పరిసర ప్రాంతాల్లోని నీటిని పీల్చుకుని మొలకెత్తి పూలు పూస్తాయి. ఈ పువ్వులు తేనెటీగలకు ఎంతో సాయపడతాయని మరియాన్నే చెప్పింది. ఇలా మాస్కులన్నీ మొలకెత్తితే రంగు రంగుల పూలు పూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
పూర్తి ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేయడం వల్ల వంద శాతం ఈ మాస్కులు మట్టిలో కలిసిపోయి పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించవు. ఇప్పుడు మనం వాడే మాస్కుల తయారీలో సాధారణంగా మందమైన ఎలాస్టిక్‌ని తాళ్లు అంటే లేసులుగా ఉపయోగిస్తారు. ఇవి చెవులకు తగిలించడం వల్ల మాస్క్ మాఖానికి పట్టి ఉంటుంది. కానీ మాస్కు వాడి పారేసినప్పుడు ఈ ఎలాస్టిక్ మట్టిలో కలిసిపోదు. ఫలితంగా కాలుష్యానికి దారి తీస్తుంది. అయితే మేరీ బీ బ్లూమ్ మాస్కుల్లో ఎలాస్టిక్ కు బదులుగా గొర్రెల నుంచి తీసిన ఉన్నితో తయారు చేసిన తాడును వాడుతున్నాం.
ఇది పర్యావరణానికి ఎటువంటి నష్టం చేయదు’’ అని మరియాన్నే వివరించింది. ఇక మాస్క్‌ల మీద ఆయా కంపెనీల పేర్లు ఇంక్‌తో రాసి ఉంటాయి. ఇంక్ స్థానం లో ఆర్గానిక్ గ్లూ వాడి కంపెనీ లోగోను ముద్రించామని మరియాన్నే చెబుతూ... ‘‘ప్రసుతం మేము తయారు చేసిన మాస్కుల్లో కొన్నింటిని మట్టిలో పాతిపెట్టాం.. అవి పూలు పూయడానికి సిద్ధంగా ఉన్నాయి.. వాటిని చూసేందుకు ఎంతో మంది ఆసక్తితోనూ, ఓర్పుతోనూ వేచి చూస్తున్నామన్నారు. ఇప్పటికే మేరీ బీ బ్లూమ్ మాస్క్‌లు కావాలనీ భారీ ఆర్డర్లు వస్తున్నాయని, డిమాండ్‌ను బట్టి మాస్కుల ఉత్పత్తిని పెంచుతామని ఆమె వివరించారు. l
Comments
Please login to add a commentAdd a comment