Biodegradable fertilizer
-
పుష్పించే మాస్కులు!
ఇప్పుడంతా ఎటుచూసినా మాస్కులు ధరించిన ముఖాలే కనిపిస్తున్నాయి. ఈ భూమి మీద ఉన్న దాదాపు తొంబై శాతం జనాభా మాస్కు లేకుండా బయటికి రావడం లేదు. ఇంతమంది ఒక్కసారి మాస్కు పెట్టుకోవాలంటే ఎన్ని మాస్కులు కావాలో కదా! అటువంటిది ఒక్కొక్కరి దగ్గర సగటున కనీసం ఐదారు మాస్కులైనా ఉంటాయి. కోట్లలో ఉత్పత్తి అవుతోన్న మాస్కులు కరోనాను అడ్డుకుంటున్నప్పటికీ పర్యావరణానికి మరో కోణంలో ముప్పుగా పరిణమిస్తున్నాయనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈ విషయాన్నీ నిశితంగా గమనించిన డచ్ గ్రాఫిక్ డిజైనర్ మరియాన్నే డీ గ్రూట్పోన్స్ పర్యావరణానికి ఎటువంటి హానీ తలపెట్టని మాస్కులను ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు. మరియాన్నేకు వచ్చిన వినూత్న ఐడియాతో వందశాతం మట్టిలో కరిగిపోయే ‘మేరీ బీ బ్లూమ్’ మాస్కులను రూపొందిస్తున్నారు. వీటిని వాడిన తరువాత మట్టిలో పాతితే అందమైన పువ్వులు కూడా పూస్తాయట. నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ నగరానికి చెందిన మరియాన్నే స్వతహాగా గ్రాఫిక్ డిజైనర్ అయినప్పటికీ రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. కరోనా కాలు పెట్టిన తరువాత ప్రపంచవ్యాప్తంగా సర్జికల్ మాస్కులు వాడిపారేయడం వల్ల మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని ఎలాగైనా తగ్గించాలనుకున్న ఆమె మనం రోజూ అన్నం రూపంలో తీసుకునే బియ్యంతో మొదట పేపర్ తయారు చేసి దానిలో డచ్ గడ్డిమైదానంలో పెరిగే వివిధ రకాల పూలమొక్కల విత్తనాలు నింపుతారు. ఈ మాస్కులు సాధారణ మాస్కుల్లాగా వాడిన తరువాత ఎక్కడైనా పారేసినాగానీ, లేదా కాస్త చిన్నపాటి గుంతలో పడేసినా అవి పరిసర ప్రాంతాల్లోని నీటిని పీల్చుకుని మొలకెత్తి పూలు పూస్తాయి. ఈ పువ్వులు తేనెటీగలకు ఎంతో సాయపడతాయని మరియాన్నే చెప్పింది. ఇలా మాస్కులన్నీ మొలకెత్తితే రంగు రంగుల పూలు పూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పూర్తి ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేయడం వల్ల వంద శాతం ఈ మాస్కులు మట్టిలో కలిసిపోయి పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించవు. ఇప్పుడు మనం వాడే మాస్కుల తయారీలో సాధారణంగా మందమైన ఎలాస్టిక్ని తాళ్లు అంటే లేసులుగా ఉపయోగిస్తారు. ఇవి చెవులకు తగిలించడం వల్ల మాస్క్ మాఖానికి పట్టి ఉంటుంది. కానీ మాస్కు వాడి పారేసినప్పుడు ఈ ఎలాస్టిక్ మట్టిలో కలిసిపోదు. ఫలితంగా కాలుష్యానికి దారి తీస్తుంది. అయితే మేరీ బీ బ్లూమ్ మాస్కుల్లో ఎలాస్టిక్ కు బదులుగా గొర్రెల నుంచి తీసిన ఉన్నితో తయారు చేసిన తాడును వాడుతున్నాం. ఇది పర్యావరణానికి ఎటువంటి నష్టం చేయదు’’ అని మరియాన్నే వివరించింది. ఇక మాస్క్‌ల మీద ఆయా కంపెనీల పేర్లు ఇంక్‌తో రాసి ఉంటాయి. ఇంక్ స్థానం లో ఆర్గానిక్ గ్లూ వాడి కంపెనీ లోగోను ముద్రించామని మరియాన్నే చెబుతూ... ‘‘ప్రసుతం మేము తయారు చేసిన మాస్కుల్లో కొన్నింటిని మట్టిలో పాతిపెట్టాం.. అవి పూలు పూయడానికి సిద్ధంగా ఉన్నాయి.. వాటిని చూసేందుకు ఎంతో మంది ఆసక్తితోనూ, ఓర్పుతోనూ వేచి చూస్తున్నామన్నారు. ఇప్పటికే మేరీ బీ బ్లూమ్ మాస్క్‌లు కావాలనీ భారీ ఆర్డర్లు వస్తున్నాయని, డిమాండ్‌ను బట్టి మాస్కుల ఉత్పత్తిని పెంచుతామని ఆమె వివరించారు. l -
ఉపాధి కుటీరం!
ప్లాస్టిక్ రహితమే లక్ష్యంగా కుటీర పరిశ్రమ స్థాపించివిస్తరాకులు, వక్క చెట్లబెరడులతో బోజనం, టిఫన్ ప్లేట్లు, కప్పులు, తయారు చేసి తాను ఉపాధి పొందడమేకాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే షేక్ అలీముస్తఫా కంభం: బయోడీగ్రేడబుల్ ఉత్పత్తుల తయారీతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు మాజీ సైనికుడు అలీ ముస్తఫా. కుటీర పరిశ్రమ స్థాపనతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కంభం మండలంలోని కందులాపురం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు షేక్ అలీ ముస్తఫా ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే పదవీ విరమణకు ముందు హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీ రూరల్ టెక్నాలజీ పార్క్‌లో ఉపాధి శిక్షణ పొందారు. రీ ఎంప్లాయ్మెంట్లో భాగంగా సైన్యంలో పనిచేసే వారికి ఉద్యోగ విరమణకు ముందు 21 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. అందులో ప్లాస్టిక్ రహిత వస్తువుల తయారీపై ముస్తఫా శిక్షణ పొందారు. రిటైరైన తర్వాత అసోం, ఒడిశా, హైదరాబాద్ నుంచి అవసరమైన మిషనరీని తెప్పించి ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వగ్రామం కందులాపురంలో కుటీర పరిశ్రమ స్థాపించారు. పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా.. కుటీర పరిశ్రమలో ప్లాస్టిక్ రహిత ప్రసాదం ప్లేట్లు, భోజనం, బిర్యానీ, టిఫిన్, పానీపూరీ, చాట్, టేబుల్ ప్లేట్లు, బఫే ప్లేట్లు తయారు చేస్తున్నారు. వీటి తయారీ కోసం మాడపాకులు(విస్తరాకులు), కాన్సెషన్ పేపర్, బ్రౌన్ క్రాఫ్ట్, డీగ్రేడబుల్ ఎల్డీ పేపర్ వినియోగిస్తున్నారు. వక్కచెట్ల బెరడుతో ప్రత్యేకంగా ప్లేట్లు తయారు చేస్తారు. 4 అడుగుల సైజు నుంచి 12 అడుగుల సైజు వరకు ప్లేట్లు ఇక్కడ తయారవుతున్నాయి. అలాగే బ్రిచ్‌ఉడ్ స్పూన్స్, ఫోర్కులు, బయో డీగ్రేడబుల్ వాటర్ గ్లాసులు కూడా తయారు చేస్తున్నారు. నెలకు 60 వేల ప్లేట్ల తయారీ డిమాండ్‌ను బట్టి నెలకు 60 వేల ప్లేట్లు తయారు చేస్తామని అలీ ముస్తఫా తెలిపారు. ప్లేట్ల తయారీ కోసం ఆరుగురు కార్మికులు పని చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎక్కువగా కోయంబత్తూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరానికి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పూర్తిగా ప్లాస్టిక్ రహితం కావడం, బయోడీగ్రేడబుల్ మెటీరియల్ వినియోగిస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ప్లాస్టిక్, డిస్పోజల్ ప్లేట్లతో పోల్చితే వీటి ఖరీదులో పెద్దగా వ్యత్యాసం లేదు. పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహిత వస్తువులు ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత ఈ రంగాన్ని ఎంచుకున్నాను. కుటీర పరిశ్రమ కోసం సుమారు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టా. కందులాపురంతోపాటు గిద్దలూరులో కూడా ప్లేట్లు తయారీ చేస్తాం. రెండు చోట్లా కలిపి 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నెలలో 24 రోజులు ప్లేట్లు, గ్లాసులు తయారు చేస్తాం. పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహితంగా తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా పంపిస్తున్నా. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ నిర్మూలన పూర్తి స్థాయిలో చేపడితే బయోడీగ్రేడబుల్ ఉత్పత్తుల వాడకం మన ప్రాంతంలో కూడా పెరిగే అవకాశం ఉంది. – ఎస్కే అలీ ముస్తఫా, మాజీ సైనికుడు -
‘సేంద్రియం’ వైపు చూపు..
‘‘సాధారణంగా పంటల సాగులో రైతులు రసాయన ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఎరువుల ప్రభావం ఆయా పంటలపై ఉంటోంది. రసాయన ఎరువుల ప్రభావంతో భూమిలో సారం తగ్గిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తే భూసా రం పెరుగుతుందని, అలా పండించిన పంట లు ఆరోగ్యానికీ మంచివని పేర్కొంటున్నారు. నేను సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. ఏడాది క్రితమే ఈ నిర్ణయానికి వచ్చాను. రుద్రూర్‌లోని కృషి విజ్ఞా న కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నాను. అంబం(ఆర్) రోడ్డు సమీపంలో ఎకరం 30 గుంటల భూమి ఉంది. ఆ భూమిలో ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు ప్రారంభించాను. ఆరు నెలల క్రితం సొంతంగా అభ్యుదయ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాను. వంకాయ, బీరకాయ, బెండకాయ, టమాట, చెర్రి టమాట, కీరదోస, కాకర, సోరకాయ పండిస్తున్నాను. కూరగాయలను అరకిలో, కిలో చొప్పున ప్యాక్ చేసి విక్రయిస్తున్నాను. ఎందరు వారించినా.. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తాననగానే తెలిసిన వారు వారించారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. కూరగాయలను ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని, నష్టపోతావని పేర్కొన్నారు. అయినా నేను వెనుకంజ వేయలేదు. లాభమైనా.. నష్టమైనా.. అనుభవించాలని నిర్ణయించుకుని ముందుకే సాగాను. మా నాన్న రాజారాం మాజీ వైస్ ఎంపీపీ. ఆయనను ఒప్పించి సేంద్రియ పద్ధతు ల్లో కూరగాయల సాగు మొద లు పెట్టాను. పొలంలో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశాను. మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాను. డ్రిప్ కోసం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందించింది. రూ. 12 వేలు ఖర్చయ్యాయి. మిత్రులు చెప్పినట్లుగానే పెట్టుబడి ఖర్చు ఎక్కువైంది. సాధారణ పద్ధతులకంటే దిగుబడి కూడా తక్కువగానే వస్తోంది. దీంతో మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు కూరగాయలు అమ్మా ల్సి వస్తోంది. సాధార ణ పద్ధతుల్లో పండించి న కూరగాయలకంటే కిలోకు రూ. 10 నుంచి రూ. 15 ఎక్కువ ధర తీసుకుంటున్నాను. మొదట్లో ఎక్కువ ధర చెల్లించడానికి ప్ర జలు వెనుకంజ వేశారు. అయితే ఇప్పు డు ఆ సమస్య లేదు. ఆరోగ్యానికి ప్రాధాన్య త ఇచ్చేవారు సేంద్రి య పద్ధతుల్లో సాగు చేసిన కూరగాయలు కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ బాగానే ఉంది. ధర ఎక్కువైనా.. కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్.. వ్యవసాయ క్షేత్రం వద్దే కాకుండా సమీప గ్రామాల్లో జరిగే సంతలకు కూరగాయలను తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. డిమాండ్ బాగానే ఉంది. బోధన్ పట్టణానికి చెందిన కొందరు వైద్యులు ఇక్కడి నుంచి కూరగాయలను తీసుకెళ్తున్నారు. చాలా మంది రెగ్యులర్‌గా మా వద్దే కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. చెర్రి టమాట ధర కిలో రూ. 60, కీరదోస కిలో రూ. 40గా నిర్ణయించాను. ఏడాది వరకు ధరలో మార్పుండదు. ఇతర కూరగాయలను మార్కెట్ ధర కంటే 10 నుంచి 15 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాను. నెలకు రూ. 25 వేలనుంచి రూ. 30 వేల ఆదాయం వస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగును ప్రోత్సహించడమే నా ధ్యేయం. పలువురు రైతులు ఈ పద్ధతిలో కూరగాయల సాగుకు ముందుకు వస్తున్నాను. త్వరలో నా మిత్రులు మూడెకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేయనున్నారు’’ అని రామరాజు వివరించారు.