సాక్షి, న్యూఢిల్లీ : నానాటికి దిగజారిపోతోన్న భారత దేశ ఆర్థిక పరిస్థితిని మెరగుపరిచేందుకు బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయాలనే బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన విషయం తెల్సిందే. బొగ్గు, రాగి, ఇనుప రజను, సీసం, వజ్రాలతోపాటు లిగ్నైట్, బాక్సైట్, క్రోమైట్, జింక్ తదితర 85 ఖనిజాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేస్తూ ఎగుమతి చేస్తోన్న దేశాల్లో భారత్ రెండవది. 2015–16 సంవత్సరం నివేదిక ప్రకారం 2.82 లక్షల కోట్ల రూపాయల విలువైన బొగ్గును భారత్ ఉత్పత్తి చేసింది.
3.500 లీజుల కింద దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 3,16,290 హెక్టార్లలోని బొగ్గు గనుల తవ్వకాలు జరగుతున్నాయి. వీటిలో 70 శాతం గనులు కేవలం ఐదు రాష్ట్రాల పరిధిలోనే ఉండడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో 702 మైనింగ్ లీజులు, తమిళనాడులో 464, ఆంధ్రప్రదేశ్‌లో 453, గుజరాత్‌లో 432, కర్ణాటకలో 376 మైనింగ్ లీజులు కొనసాగుతున్నాయి. దేశంలోని 41 బొగ్గు గనులను వేలం వేయాలని జూన్ నెలలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్–19 మహమ్మారి విజంభిస్తోన్న తరుణంలో దేశం స్వావలంబన సాధించేందుకు ఈ బొగ్గు గనుల వేలం ఉపయోగ పడుతుందని మోదీ చెప్పారు. అయితే పెట్టుబడిదారుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. కోవిడ్ నేపథ్యంలో వేలం పాటలను కొన్ని నెలలపాటు వాయిదా వేయాలనే పెట్టుబడిదారుల ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించక తప్పలేదు.
బొగ్గు తవ్వకాల వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడమే కాకుండా, అనేక అటవి, కొండ జాతుల ప్రజలతో భూ వివాదాలు తలెత్తుతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు వాడకాన్ని నియంత్రించడంలో భాగంగా 2022 నాటికల్లా దేశంలో 175 జీడబ్లూ, 230 నాటికల్లా 350 జీడబ్లూ గాలి, సూర్య కాంతి ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని భారత దేశం అంతర్జాతీయ సమాజానికి వాగ్దానం చేసింది. అయితే ప్రస్తుతం 87.66 గిగా వాట్ల ప్రత్యామ్నాయ విద్యుత్‌ను తయారు చేస్తోన్న భారత్, తన వాగ్దానాన్ని నిలుపుకునే పరిస్థితుల్లో లేదనే విషయం సులభంగానే అర్థం అవుతోంది. దేశంలో వేలం వేయాలనుకుంటోన్న బొగ్గు గనులు అడవి, కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటి తవ్వకాల వల్ల అక్కడ నివసించే ఆదిమ జాతి ప్రజలు ఉపాధిని కోల్పోతారు. గ్రీనరి ఫల, పుష్పాలు నాశనంతో పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. సమీపంలోని నీటి వనరులు కలుషితం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment