Coal Auction
-
ఆర్థిక వ్యవస్థలో బొగ్గు కీలక పాత్ర: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బొగ్గుని నల్ల బంగారంగా పేర్కొన్నారు. వాణిజ్య బొగ్గు గనుల ఏడో విడత వేలాన్ని రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘‘గడిచిన కొన్నేళ్లలో మన ఇంధన వినియోగం పెరిగింది. అది ఇక ముందూ వృద్ధి చెందుతుంది. ఈ అవసరాలను తీర్చేందుకు ఈ రోజు నుంచే చర్యలు తీసుకోవాలని’’ చెప్పారు. వ్యాపార సులభ తర నిర్వహణను ప్రోత్సహించేందుకు ముందస్తుగా ఉత్పత్తి ప్రారంభించిన వాటికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించే ఆదాయంలో 50 శాతాన్ని రాయితీగా ఇస్తున్నట్టు చెప్పారు. వచ్చే 40-50 ఏళ్లపాటు బొగ్గు వినియోగం కొనసాగుతుందని చెబుతూ.. భారీగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆరు విడతల వేలంలో 87 బగ్గు గనులను వేలం వేశామని, ఇవన్నీ ఉత్పత్తి ఆరంభిస్తే ఏటా రూ.33,200 కోట్ల ఆదాయంతో పాటు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) 106 గనుల వేలం.. ఏడో విడతలో వేలానికి ఉంచిన 106 గనుల్లో 61 బ్లాక్‌లు పాక్షికంగా అన్వేషించినవి కాగా, 45 పాక్షికంగా బొగ్గు నిక్షేపాల గురించి అన్వేషణ నిర్వహించినవి. 95 నాన్ కోకింగ్ కోల్ గనులు అయితే, 10 లిగ్నైట్ గనులు ఉన్నాయి. ఈ గనుల నుంచి వెలికితీసే బొగ్గు వినియోగంపై ఎలాంటి ఆంక్షలను ప్రభుత్వం పెట్టలేదు. బొగ్గు రంగంలో ప్రైవేటు కంపెనీలూ తగిన అవకాశాలను సొంతం చేసుకునేందుకు కేంద్ర సర్కారు లోగడ ఈ రంగానికి సంబంధించి ద్వారాలు తెరవడం తెలిసిందే. మరోవైపు ఆరో విడతలో వేలం వేసిన 28 గనులకు సంబంధించి ఒప్పందాలపై బొగ్గు శాఖ సంతకాలు పూర్తి చేసింది. (సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు) -
కమర్షియల్ బొగ్గు గనుల వేలం..బిడ్స్ దాఖలు చేసిన 31 సంస్థలు!
న్యూఢిల్లీ: కమర్షియల్ బొగ్గు గనుల వేలంలో 31 సంస్థలు బిడ్స్ దాఖలు చేసినట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 24 గనులకు సంబంధించి బిడ్లను అందించిన సంస్థల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత, ఎన్ఎల్సీ ఇండియా, జిందాల్ పవర్, భారత్ అల్యూమినియం, బిర్లా కార్పొరేషన్, జైప్రకాష్ పవర్ వెంచర్స్, రుంగ్తా మెటల్స్, గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ కంపెనీలు ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో జరిగిన మూడు రౌండ్ల వేలంలో మొత్తం 31 సంస్థలు 38 బిడ్స్ సమర్పించినట్లు బొగ్గు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కమర్షియల్ మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలాన్ని 2020లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నందున గనుల వేలం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు, ప్రభుత్వం దాదాపు 47 బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు వేలం వేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయి 777 మిలియన్ టన్నులను తాకింది. వార్షికంగా 8.55 శాతం వృద్ధిని సాధించింది. -
బొగ్గు గనుల వేలం ద్వారా ఎన్నో అనర్థాలు
సాక్షి, న్యూఢిల్లీ : నానాటికి దిగజారిపోతోన్న భారత దేశ ఆర్థిక పరిస్థితిని మెరగుపరిచేందుకు బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయాలనే బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన విషయం తెల్సిందే. బొగ్గు, రాగి, ఇనుప రజను, సీసం, వజ్రాలతోపాటు లిగ్నైట్, బాక్సైట్, క్రోమైట్, జింక్ తదితర 85 ఖనిజాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేస్తూ ఎగుమతి చేస్తోన్న దేశాల్లో భారత్ రెండవది. 2015–16 సంవత్సరం నివేదిక ప్రకారం 2.82 లక్షల కోట్ల రూపాయల విలువైన బొగ్గును భారత్ ఉత్పత్తి చేసింది. 3.500 లీజుల కింద దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 3,16,290 హెక్టార్లలోని బొగ్గు గనుల తవ్వకాలు జరగుతున్నాయి. వీటిలో 70 శాతం గనులు కేవలం ఐదు రాష్ట్రాల పరిధిలోనే ఉండడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో 702 మైనింగ్ లీజులు, తమిళనాడులో 464, ఆంధ్రప్రదేశ్‌లో 453, గుజరాత్లో 432, కర్ణాటకలో 376 మైనింగ్ లీజులు కొనసాగుతున్నాయి. దేశంలోని 41 బొగ్గు గనులను వేలం వేయాలని జూన్ నెలలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్–19 మహమ్మారి విజంభిస్తోన్న తరుణంలో దేశం స్వావలంబన సాధించేందుకు ఈ బొగ్గు గనుల వేలం ఉపయోగ పడుతుందని మోదీ చెప్పారు. అయితే పెట్టుబడిదారుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. కోవిడ్ నేపథ్యంలో వేలం పాటలను కొన్ని నెలలపాటు వాయిదా వేయాలనే పెట్టుబడిదారుల ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించక తప్పలేదు. బొగ్గు తవ్వకాల వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడమే కాకుండా, అనేక అటవి, కొండ జాతుల ప్రజలతో భూ వివాదాలు తలెత్తుతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు వాడకాన్ని నియంత్రించడంలో భాగంగా 2022 నాటికల్లా దేశంలో 175 జీడబ్లూ, 230 నాటికల్లా 350 జీడబ్లూ గాలి, సూర్య కాంతి ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని భారత దేశం అంతర్జాతీయ సమాజానికి వాగ్దానం చేసింది. అయితే ప్రస్తుతం 87.66 గిగా వాట్ల ప్రత్యామ్నాయ విద్యుత్‌ను తయారు చేస్తోన్న భారత్, తన వాగ్దానాన్ని నిలుపుకునే పరిస్థితుల్లో లేదనే విషయం సులభంగానే అర్థం అవుతోంది. దేశంలో వేలం వేయాలనుకుంటోన్న బొగ్గు గనులు అడవి, కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటి తవ్వకాల వల్ల అక్కడ నివసించే ఆదిమ జాతి ప్రజలు ఉపాధిని కోల్పోతారు. గ్రీనరి ఫల, పుష్పాలు నాశనంతో పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. సమీపంలోని నీటి వనరులు కలుషితం అవుతాయి. -
బొగ్గు క్షేత్రాల వేలానికి రంగం సిద్ధం..!
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల తాజా వేలం ప్రక్రియకు తొలి అడుగు పడింది. వచ్చే యేడాది ఫిబ్రవరి 11వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏకపక్షం, చట్ట విరుద్ధంగా పేర్కొంటూ 1993 నుంచీ జరిగిన 204 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడం తెలిసిందే. వీటిలో మొదటి విడతగా 74 క్షేత్రాలకు తాజాగా ఈ-వేలం ప్రక్రియ ఫిబ్రవరి 11న ప్రారంభమవుతుందని బొగు ్గశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ అంశంపై ముసాయిదా మార్గదర్శకాలను కేంద్రం బుధవారం విడుదల చేసింది. నవంబర్ 24వ తేదీ లోపు ఈ ముసాయిదా నిబంధనలపై సంబంధిత వర్గాల స్పందనలను తెలియజేయాల్సి ఉంటుంది. వీటి వివరాలను స్వరూప్ మీడియాకు తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్వరూప్ తెలిపారు. కేవలం సొంత అవసరాలకు వినియోగించుకునే (క్యాపిటివ్) వారికి మాత్రమే బొగ్గు గనులను కేటాయించడం జరుగుతుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. నిర్దేశించిన ప్రాజెక్టు మినహా ఒక కంపెనీ సంబంధిత బొగ్గు క్షేత్రాన్ని మరే ప్రాజెక్టుకూ వినియోగించరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఏదైనా మార్పు చేయాలనుకుంటే అందుకు సంబంధించి వివరాలను అంతకుముందే తప్పనిసరిగా కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. బొగ్గు క్షేత్రాల వేలం తరువాత విద్యుత్ చార్జీలు పెరిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చూస్తుందని కూడా స్వరూప్ సూచనప్రాయంగా తెలిపారు. ఎన్ని క్షేత్రాలకు ఒక కంపెనీ బిడ్ దాఖలు చేయవచ్చన్న అంశంపై ఒక పరిమితి ఉంటుందని స్వరూప్ తెలిపారు. గుత్తాధిపత్యాన్ని నిరోధించడమే ఈ విధాన లక్ష్యమని వెల్లడించారు. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్గా రెండు దశల టెండర్ ప్రక్రియలో బొగ్గు క్షేత్రాల ఈ-ఆక్షన్ జరుగుతుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వేలానికి సిద్ధం చేసే బొగ్గు గనుల గుర్తింపు, వీటిలో ప్రభుత్వ కంపెనీలకు ఏ గనులను కేటాయించాలి వంటి అంశాల నిర్ణయ బాధ్యతలను కేంద్రం నామినేటెడ్ అథారిటీకి అప్పగించనుంది. నామినేటెడ్ అథారిటీగా బొగ్గు వ్యవహారాల జాయింట్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్‌ను ఇప్పటికే కేంద్రం నియమించింది. విద్యుత్, స్టీల్, ఇనుము, సిమెంట్ రంగాల ప్రాజెక్టుల్లో వినియోగానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ అమలవుతుంది. పరిహారం ప్రక్రియ... తాజా ఆక్షన్‌లో ఒక బొగ్గు క్షేత్ర కేటాయింపుదారు గతంలో కూడా అదే క్షేత్రం చెందిన కేటాయింపుదారుకాని పక్షంలో, గత కేటాయింపుదారుకు పరిహారం అందుతుంది. సంబంధిత క్షేత్ర మౌలిక అభివృద్ధికి గతంలో సంబంధిత కంపెనీ వ్యయం తత్సంబంధ అంశాల ప్రాతిపదికన ఈ తరహా పరిహారాన్ని నామినేటెడ్ అథారిటీ నిర్ణయిస్తుంది. క్షేత్రాల వేలం రిజర్వ్ ధరపై అధికారులు ప్రస్తుతం మదింపు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీ లోపు దీనిని నిర్ణయించే అవకాశం ఉంటుందని స్వరూప్ వెల్లడించారు. కేటాయింపులకు సంబంధించి టెక్నికల్ బిడ్స్‌ను 2015 మార్చి 3న ఓపెన్ చేయాలని మంత్రిత్వశాఖ భావిస్తోంది. మార్చి 16వ తేదీలోపు లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేయాలన్న సంకల్పంతో బొగ్గు మంత్రిత్వశాఖ ఉంది. తొలుత 72 కోల్ బ్లాక్‌లకు వేలం నిర్వహిస్తారు. వీటిలో 42 బ్లాకుల్లో ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఉత్పత్తిని కొనసాగించేందుకు మార్చి 31 వరకూ సుప్రీంకోర్టు అనుమతించింది. మిగిలిన 32 బ్లాకులు ఉత్పత్తికి సిద్ధంగా వున్నాయి. 42 ఉత్పాదక బ్లాకుల్లో ప్రస్తుతం ఏడాదికి 9 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తవుతుండగా, ఉత్పత్తికి సిద్ధంగా వున్న 32 బ్లాకులు మరో 12 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేయగల సామర్థ్యంతో వున్నాయి. ఈ గనుల్ని నిర్వహిస్తున్న ప్రస్తుత కంపెనీ ఆ బ్లాకులో చేసిన పెట్టుబడికి తగిన విలువను పొందుతుందని బొగ్గుశాఖ కార్యదర్శి వివరించారు.