అందరిలాగే ఒకానొక సమయంలో హమ్మింగ్ బర్డ్ గురించి విన్నది అనూష శంకర్. ఈ అతిచిన్న పక్షి అతి చురుకుదనం, గొంతు మార్చే నైపుణ్యం, ముక్కును తన రక్షణ కోసం ఆయుధంగా వాడే బలం...ఇలా ఎన్నో విషయాలు విన్నది అనూష. ఈ ఆసక్తి తనను పక్షుల ప్రేమికురాలిగా మార్చింది. పర్యావరణ వేత్త కావడానికి కారణం అయింది. పుణెలో పుట్టి పెరిగిన అనూష పైచదువుల కోసం చెన్నై వెళ్లింది. అక్కడ జంతుశాస్త్రం, బయోటెక్నాలజీలలో డిగ్రీ చేసింది. న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ యూనివర్శిటీలో ‘ఎకాలాజీ అండ్ ఎవల్యూషన్’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసింది.
‘పక్షులకు సంబంధించి నాకు ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉండేవి. వాటిని తీర్చే వ్యక్తులు, పుస్తకాలు ఉండేవి కాదు. ఈ లోటు వల్ల నాలో అన్వేషణ మొదలైంది. రకరకాల విషయాలను స్వయంగా తెలుసుకోవడంలో ఎంతో తృప్తి లభించింది’ అంటున్న అనూష తాను తెలుసుకున్న విషయాలను రచనలు, ఉపన్యాసాలు, వీడియోల రూపంలో జనాలలోకి తీసుకెళుతుంది.
తన పరిశోధనలో భాగంగా అస్సాం అడవులలో ఒంటరిగా కొన్ని వారాలపాటు గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో అడవిలో చెట్లు, పుట్టలు, పక్షులు, జంతువులు తన ఆత్మీయనేస్తాలు అయ్యాయి. వాటితో మౌనసంభాషణ చేసేది.
ఈ నేపథ్యంలోనే హమ్మింగ్ బర్డ్ గురించి ఆనోటా ఈనోటా ఎన్నో విషయాలు విన్నది. ఎన్నో పుస్తకాల్లో చదివింది అనూష. ఇదిమాత్రమే కాకుండా తానే స్వయంగా రంగంలోకి దిగింది. హమ్మింగ్ బర్డ్‌పై పది సంవత్సరాల పాటు పరిశోధన చేసింది. ఈక్వెడార్ క్లౌడ్‌ఫారెస్ట్... మొదలైన ఎన్నో ప్రాంతాలకు వెళ్లింది. ‘మన వ్యక్తిత్వవికాసానికి అవసరమైన పాఠాలు, ఆరోగ్యస్పృహకు సంబంధించిన అంశాలు హమ్మింగ్‌బర్డ్ జీవితం నుంచి విస్తృతంగా లభిస్తాయి’ అంటుంది అనూష.
నిజమే మరి! అతి చిన్నదైన హమ్మింగ్ పక్షిలో జీవక్రియ శక్తివంతమైనది. దీనికి ఆ పక్షి తీసుకునే జాగ్రత్తలు కూడా ఒక కారణం. పరిమితమై శక్తితో అపరిమితమైన శక్తిని ఎలా సమకూర్చుకుంటుంది, అత్యంత ప్రతికూల వాతావరణంలో సైతం ఏ మాత్రం నష్టం జరగకుండా తనను తాను ఎలా కాపాడుకుంటుంది, ఎనర్జీ బడ్జెట్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటుంది... మొదలైన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు హమ్మింగ్‌బర్డ్ జీవితంలో ఉన్నాయి. మనం ఆ తేనెపిట్ట మాటలు విందాం... మన జీవితాలలో కూడా తేనెను నింపుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment