ప్రస్తుత పోటీప్రపంచంలో మనమందరం పరిగెడుతున్నాము. పిల్లలు చదువుల కోసం, ఉద్యోగస్తులు సంపాదన కోసం, పెద్దవాళ్లు ఆరోగ్యం కోసం ఇలా పరిగెడుతూ మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడం మర్చిపోయాం. పెరుగుతున్న ఎండలు, అకాల వర్షాలు, వణికిస్తున్న చలి ఇలా మనల్ని ఇబ్బంది పెడుతున్న వాతావరణం గూర్చి మాట్లాడుకుంటాం కానీ ఆ వాతావరణం వలన పర్యావరణం, జీవవైవిధ్యంలో వచ్చే మార్పులను గమనించము. మానవ మనుగడకు పర్యావరణ సమతుల్యత చాలా ముఖ్యం. ఈ సమతుల్యతను నిర్వహించడంలో జీవవైవిధ్యం ముఖ్య పాత్ర పోషిస్తూ, పర్యావరణ వ్యవస్థలోని మార్పులకు ముఖ్య సూచికగా నిలుస్తుంది.
మన చుట్టూ సాధారణంగా కనిపించే మొక్కలు, చెట్లు, క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు జీవవైవిధ్యంలో ఒక భాగం. వీటిని ప్రతిరోజూ చూస్తుండే మనం, చాలా అరుదుగా గమనిస్తూంటాం. చూడటానికి గమనించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. గమనించిన ప్రతి వివరము ఎక్కువ కాలం గుర్తుంటుంది. ప్రకృతిలోని జీవవైవిధ్యమును గమనించడం వలన పిల్లలకు, పెద్దలకు చాలా ఉపయోగములు ఉన్నవి. పక్షులను గమనించడం, పక్షి కూతలను విని ఆనందించడం మనుషుల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనబరుస్తుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలలో వెల్లడైనది. ఆల్బర్ట్ ఐంస్టీన్ 1949లోనే పక్షులు, తేనెటీగలలోని గమ్యాన్ని గుర్తించే సామర్ధ్యం తెలుసుకొనడం భౌతిక శాస్త్రంలో చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. విమానాల నుండి అట్టపెట్టెల వరకు ప్రకృతి నుండి ప్రేరేపింపబడిన వస్తువులు, పరికరములు, వాహనాలు మనం నిత్యం చూస్తుంటాం, ఉపయోగిస్తుంటాం.
ప్రస్తుత విద్యావ్యవస్థ విధానాలు పిల్లలను ప్రకృతి నుండి దూరం చేస్తుంది. తరగతి గదులలో నేర్పించే చదువుకు ఉన్న ప్రాధాన్యత, ప్రకృతి పరిసరాలలోని జీవవైవిధ్యం గమనించడంలో కనిపించడంలేదు. పల్లెల్లో మారుతున్న జీవనవిధానాలు, నగరీకరణతో వస్తున్న మార్పుల వలన సహజమైన పర్యావరణ వ్యవస్థలు కనుమరుగవుతున్నవి. ప్రకృతి ఆధారిత అభ్యాసాన్ని, పర్యావరణ విద్యను విద్యావ్యవస్థలో ఏకీకృతం చేయడం వలన పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావం కనిపిస్తుంది. పరిసరాలలోని పక్షులు, ఋతువులు చెట్లు, మొక్కలలో ఋతు ప్రభావిత మార్పులు , సీతాకోకచిలుకలు, వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే చిమ్మెటలు ఇలా జీవవైవిధ్యంలోని అనేక ప్రాణులు, ఆ ప్రాణుల మధ్య సంబంధాలు, వివరములను పిల్లలు గమనించడం వలన ఒత్తిడి తగ్గి వారిలో సృజనాత్మకత మెరుగుపడుతుంది, విమర్శనాత్మకంగా ఆలోచించే గుణం పెంపొందుతుంది . సాంకేతిక విద్యతో పాటు పిల్లలకు ఇటువంటి అవకాశములు కల్పించడం వలన వారికి వాతావరణ మార్పులు, జీవవైవిధ్యమునకు కలుగుతున్న నష్టం, కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలపై అవగాహన పెరిగి ఆ దిశలోని సవాళ్ళను ఎదుర్కొని శాస్త్రజ్ఞులుగా,బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. ఇది మనకు మన తరువాత తరాలకు అత్యంత అవసరం.
ఎదుగుతున్న పిల్లలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవితం అందించాల్సిన పెద్దలు కూడా పని ఒత్తిడికి తద్వారా వచ్చే మానసిక రుగ్మతలకు మినహాయింపు కాదు. ఇంగ్లాండ్ , నెదర్లాండ్స్ , అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో పెద్దవారిలో , పింఛనుదారులలో వచ్చే ఒత్తిడి, ఒంటరితనం ఇతర మానసిక సవాళ్ళను అధిగమించడానికి వ్యాయామంతో పాటు పక్షివీక్షణ కూడా తరుచుగా చేస్తుంటారు. ఇది మన వ్యవస్థలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఉపాధ్యాయులకు ప్రకృతి, జీవవైవిధ్యమునకు సంభందించిన శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. పర్యావరణ విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పిల్లలలో మంచి మార్పు తేవడంలో ముఖ్యపాత్ర పోషించగలరు.
పిల్లలకు, పెద్దలకు జీవవైవిధ్యంతో పరిచయం వలన పర్యావరణంఫై అవగాహన పెరిగి సహజ వనరులను పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. కానీ ఈ పరిచయానికి కావాల్సిన వనరులు తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. మదనపల్లె లోని రిషి వాలీ స్కూల్ పక్షులు గూర్చి అవగాహన పెంపొందించడానికి ఆర్నిథాలజీ (పక్షి శాస్త్రము) కోర్సు అందిస్తున్నది. అలాగే ఎర్లీ బర్డ్ (early-bird.in) ప్రాజెక్ట్ నుండి పక్షులకు సంబంధించిన కరదీపికను/చేపుస్తకమును ఉచితముగా పొందవచ్చును. పిల్లలకొరకు పక్షులకు సంబంధించిన ఆటలు,పోస్టర్లు కూడా ఎర్లీ బర్డ్ ఉచితముగా అందిస్తున్నది. జీవివైవిధ్యంపై అవగాహన పెంపొందించుట కొరకు బొంబాయి నాచురల్ హిస్టరీ సొసైటీ (bnhs.org) వివిధ ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఆన్లైన్లో (https://academy.allaboutbirds.org/learning-games/) ఆటలతో పక్షులను పిల్లలకు పరిచయం చేస్తున్నారు. మొక్కలు, చెట్లపై ఆసక్తి ఉన్నవారు సీజన్ వాచ్ (https://www.seasonwatch.in) కార్యక్రమములో ఉచితముగా పాల్గొని అవగాహన పెంచుకోవచ్చు. ఇలా మన ఇంటినుండే ప్రకృతి, జీవవైవిధ్యంఫై అవగాహన పెంచుకుని తోటివారితో పంచుకునే సాంకేతికత, వనరులు మనకు చాలా అందుబాటులో ఉన్నవి. వీటిని ఉపయోగించుకుని మనకు, మన సమాజానికి ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందించడం చాలా అవసరం.
--- రాజశేఖర్ బండి
Comments
Please login to add a commentAdd a comment