న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు దోహదంచేసే (గ్రీన్ క్లైమేట్) ప్రాజెక్టుల్లోకి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా తగిన మిశ్రమ ఫైనాన్స్ ఇన్‌స్ట్రమెంట్ల ద్వారా నిధులు సమీకరించడానికిగాను ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని వర్గాలు తెలిపాయి. 2070 నాటికి కర్బన్ ఉద్గారాలను నికర సున్నాకి తగ్గించాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ఈ కసరత్తు జరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
గత ఏడాది కేంద్ర క్యాబినెట్ ఇందుకు సంబంధించి ఒక కీలక విధానాన్ని ఆమోదించింది. మెరుగైన వాతావరణం నెలకొల్పాలన్న లక్ష్యంలో భాగంగా గ్లాస్గో సదస్సులో ప్రధానమంత్రి ప్రకటిత ’పంచామృతం’ వ్యూహానికి అనుగుణంగా క్యాబినెట్ ఆమోదించిన జాతీయ విధాన రూపకల్పన ఉంది. ఈ విధానం ప్రకారం, ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి నుండి 2030 నాటికి 45 శాతం తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉంది. 2030 నాటికి శిలాజ రహిత ఇంధన వనరుల నుండి 50 శాతం విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలన్నది లక్ష్యం.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆయా లక్ష్యాల సాధన దిశలో సస్టైనబుల్ ఫైనాన్స్, క్లైమేట్ ఫైనాన్స్‌పై జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఐఎస్‌ఎస్‌బీ)తో సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సంప్రతింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐఎస్‌ఎస్‌బీ రాబోయే రెండు నెలల్లో క్లైమేట్ ఫైనాన్స్ కోసం ప్రమాణాలను ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కాగా, అంతర్జాతీయంగా ఉద్ఘారాలను తగ్గించడానికి చేసే నియమ నిబంధనవాళి, ఇన్‌స్ట్రమెంట్లు అభివృద్ధి చెందిన– చెందుతున్న దేశాల మధ్య వివక్ష చూపేవిగా ఉండరాదని కూడా భారత్ కోరుకుంటోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment